Visakhapatnam YCP: విశాఖ జిల్లాలో వైసీపీకి హేమాహేమీలైన నాయకులు ఉన్నారు. వైసిపి ద్వారా చాలామంది పదవులు దక్కించుకున్నారు. కానీ ఒక్కరంటే ఒక్క నాయకుడు కూడా ఇప్పుడు కనిపించడం లేదు. పార్టీ కష్టకాలంలో ఉండగా కార్యాలయం వైపు చూడడం లేదు. వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్ వెంట ఈ జిల్లా నుంచి నేతలు అధికంగా అడుగులు వేశారు. ముందుగా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, అటు తర్వాత దాడి వీరభద్ర రావు లాంటి నేతలు క్యూ కట్టారు. కానీ వారు ఎవరు ఇప్పుడు పార్టీలో లేరు. వారి తరువాత పార్టీలో ప్రవేశించిన అవంతి శ్రీనివాసరావు, గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు వంటివారికి మంచి పదవులు దక్కాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తన క్యాబినెట్ లోకి అవంతి శ్రీనివాసరావును తీసుకున్నారు జగన్. అంతకుముందు అవంతి శ్రీనివాసరావు టిడిపిలో ఉండేవారు. అనకాపల్లి ఎంపీగా ఉంటూ వైసీపీలో చేరారు. భీమిలి టిక్కెట్ దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు క్యాబినెట్ లోకి తీసుకున్నారు జగన్. అయితే మంత్రివర్గ విస్తరణలో ఆ పదవి కోల్పోయారు. ఈ ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటినుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. కనీసం కార్యాలయం ముఖం కూడా చూడడం లేదు.
* మరోవైపు జూనియర్ గా ఉన్న గుడివాడ అమర్నాథ్ కు మంచి పొలిటికల్ లైఫ్ ఇచ్చారు జగన్. 2014 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ టికెట్ ఇచ్చారు. అయినా సరే ఆయన ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఏకంగా అనకాపల్లి అసెంబ్లీ సీటు ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచిన అమర్నాథ్ కు విస్తరణలో మంత్రి పదవి ఇచ్చారు. కానీ ఎన్నికల్లో అనకాపల్లి సీటు ఇవ్వలేదు. గాజువాక అసెంబ్లీ స్థానానికి మార్చారు. అయినా సరే ఓటమి తప్పలేదు. అయితే ఓడిపోయిన తర్వాత ఎంతో కొంత యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు. కానీ విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా నియమితులైన తర్వాత సైలెంట్ అయ్యారు అమర్నాథ్.
* మరోవైపు మాజీ ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు సైతం పెద్దగా కనిపించడం లేదు. 2014,2019 ఎన్నికల్లో మాడుగుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ముత్యాల నాయుడు. మంత్రివర్గ విస్తరణలో అమాత్య యోగం దక్కించుకున్నారు. ఏకంగా డిప్యూటీ సీఎం హోదాను కట్టబెట్టారు. అయితే ఈ ఎన్నికల్లో మాడుగుల నుంచి తప్పించారు జగన్. అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించారు. దారుణంగా ఓడిపోయారు ముత్యాల నాయుడు. అయితే అప్పటినుంచి సైలెంట్ గా ఉన్నారు. అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించినా ఆయన పెద్దగా యాక్టివ్ గా లేరు. ఈ ముగ్గురు నేతలు సైలెంట్ గా మారడంతో విశాఖ జిల్లా వైసీపీలో ఒక రకమైన నైరాస్యం కనిపిస్తోంది.