Kinjarapu Ram Mohan Naidu: ఏపీ నుంచి ఈసారి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ లు టిడిపి తరఫున చోటు దక్కించుకున్నారు. ఇక బిజెపి కోటాలో నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మకి ఛాన్స్ వచ్చింది. అయితే చిన్న వయసులోనే రామ్మోహన్ నాయుడు క్యాబినెట్ హోదా దక్కించుకున్నారు. కీలకమైన పౌర విమానయాన శాఖ పదవి చేపట్టారు. ప్రధాని మోదీ సరసన కూర్చునే అవకాశాన్ని పొందారు. రామ్మోహన్ నాయుడు వాగ్దాటికి ముగ్ధులైన సభ్యులు ఎంతో మంది ఉన్నారు. చాలామంది సహచర సభ్యులు అభినందిస్తుంటారు కూడా. ఈ తరుణంలో రాజ్యసభలో ఆసక్తికర పరిణామం వెలుగు చూసింది. రాజ్యసభలో సుధా మూర్తి మాతృ ప్రేమకు సభలో ఎంపీలు అందరూ హర్షం వ్యక్తం చేశారు. రాజ్యసభలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సుదీర్ఘ ప్రసంగం చేశారు. భారతీయ వాయు యాన్ విధేయక్ బిల్లును ప్రవేశపెట్టగా… గురువారం దీనిపై రాజ్యసభలో చర్చ జరిగింది. సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు నివృత్తి చేశారు రామ్మోహన్ నాయుడు. ఈ క్రమంలో దాహార్తికి గురయ్యారు. వెంటనే మంచినీళ్లు తెప్పించమని సభ అధ్యక్షుడిగా ఉన్న డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ను కోరారు. వెంటనే ఆయన స్పందించి నీరు తెమ్మని అక్కడ సిబ్బందిని ఆదేశించారు.
* వెంటనే స్పందించిన సుధా మూర్తి
అయితే ఇంతలోనే రాజ్యసభ సభ్యురాలు అయిన సుధా మూర్తి స్పందించారు. తన స్థానం నుంచి లేచి వచ్చారు. తన దగ్గర ఉన్న మంచినీళ్ల బాటిల్ తెచ్చి రామ్మోహన్ నాయుడుకి అందించారు. సుధా మూర్తి వాత్సల్యానికి ముగ్ధుడైన రామ్మోహన్ నాయుడు రెండు చేతులుతో నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఆమె ఎప్పుడూ తల్లిలా తన పట్ల ఆదరణ చూపుతున్నారని చెప్పుకొచ్చారు.ఇంతకీ సుధా మూర్తి ఎవరో తెలుసా? ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి సతీమణి.
* సేవలకు గుర్తింపు
సుధా మూర్తి ఎప్పుడు చాలా సింపుల్ గా ఉంటారు. ఆమె కొద్ది రోజుల కిందట రాజ్యసభకు నామినేట్ అయ్యారు. దేశంలో కళలు, సాహిత్యం, విజ్ఞానం, సామాజిక సేవలకు విశిష్టమైన కృషి చేసినందుకు రాష్ట్రపతి 12 మంది సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేస్తారు. ఆ కోటాలో సుధా మూర్తికి అవకాశం దక్కింది. అంతేకాదు సుధా మూర్తి పద్మశ్రీ తో పాటు పద్మభూషణ్ అవార్డులను సైతం దక్కించుకున్నారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ పేదరిక నిర్మూలన, ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రతకు సంబంధించిన కార్యక్రమాలలో సేవలందిస్తున్నారు. వేల కోట్లు సంపాదించినా ఇప్పటికీ సుధా మూర్తి చాలా సింపుల్ గా ఉంటారు. రాజ్యసభలో ఆమె వ్యవహరించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.