Chiranjeevi : ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా కూటమి పట్టు బిగిస్తోంది. 9 నెలల పాలన పూర్తి చేసుకుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున నేతలు గుడ్ బై చెబుతున్నారు. కీలక నేతలు సైతం రాజీనామా బాటపడుతున్నారు. దీంతో పార్టీని తిరిగి నిలబెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ల ద్వారా నష్టాన్ని భర్తీ చేసే పనిలో ఉన్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా ఆయన విషయంలో భారతీయ జనతా పార్టీ ఆసక్తిగా ఉందని వార్తలు వచ్చాయి. ఆయనకు ఒక పదవి కట్టబెట్టడం ద్వారా బిజెపిలో యాక్టివ్ చేయిస్తారని ప్రచారం నడిచింది. తాజాగా తన పొలిటికల్ రీ ఎంట్రీ, పదవులపై తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు మెగాస్టార్ చిరంజీవి. రాజకీయ పునరాగమనంపై తేల్చేశారు.
* నాటి ప్రజారాజ్యమే నేటి జనసేన
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి( megastar Chiranjeevi) ఓ సినిమా ఫంక్షన్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాటి ప్రజారాజ్యమే నేటి జనసేన అంటూ చెప్పుకొచ్చారు. దీనిపై రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నాటి ప్రజారాజ్యం ఫెయిల్యూర్ తోనే జనసేన ఏర్పడిందని ఎక్కువ మంది గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో మెగా బ్రదర్స్ ద్వారా రాజకీయంగా బలోపేతం కావాలని బిజెపి వ్యూహాలు రూపొందిస్తోంది. పవన్ ప్రమాణ స్వీకార సమయంలో ప్రధాని మోదీ చిరంజీవితో కలిసి ప్రజలకు అభివాదాలు తెలిపారు. భవిష్యత్తు రాజకీయాలు పై సంకేతాలు ఇచ్చారు. ఇటీవల తరచు మెగాస్టార్ చిరంజీవి కేంద్ర పెద్దలను కలుస్తూ వచ్చారు. ప్రధాని మోదీ తో ఎక్కువగా చనువుగా ఉంటున్నారు.
* ఆసక్తిగా బిజెపి
ఆది నుంచి చిరంజీవి( Chiranjeevi) విషయంలో బిజెపి ఆసక్తికరంగానే ఉంది. చిరంజీవిని బిజెపిలోకి తీసుకెళ్లి బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్లు ప్రచారం నడిచింది. అయితే ప్రజారాజ్యం అనుభవాలతో రాజకీయాల పట్ల అంతగా ఆసక్తి చూపడం లేదు చిరంజీవి. తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవిని పొందారు చిరంజీవి. 2014 వరకు ఆ పదవిలో కొనసాగారు. అటు తరువాత పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ సైతం చిరంజీవి విషయంలో భిన్నాభిప్రాయంతో ఉన్నారు. తన సోదరుడు ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే చిరంజీవి రాజకీయాల్లో రీఎంట్రీ ఇస్తారని.. మెగా బ్రదర్స్ తో కలిపి బిజెపి రాజకీయం చేయనుందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ అంశంపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి.
* కళా రంగంలోనే శాశ్వతంగా బ్రహ్మానందం( Brahmanandam) కుమారుడు హీరోగా ఇటీవల ఓ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆ సినిమాకు సంబంధించి ఓ ఫంక్షన్ కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తన పొలిటికల్ రీఎంట్రీ పై స్పష్టత ఇచ్చారు. మళ్లీ రాజకీయాల వైపు వెళ్తానని పలువురు అనుకుంటున్నారని.. పెద్ద పెద్ద వారిని కలుస్తున్నాడు ఏంటి అని భావిస్తున్నారని.. మళ్లీ అటువైపుగా వెళ్తాడు అన్నట్టు సందేహ పడుతున్నారని.. నో డౌట్.. అటువైపు వెళ్ళనని.. జీవితాంతం కళామతల్లి సేవలోనే ఉంటానని తేల్చి చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. సినీ రంగానికి సేవలు కోసమే రాజకీయ పెద్దలను కలుస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అంతకుమించి ఏమీ లేదని కూడా చిరంజీవి స్పష్టతనిచ్చారు. మొత్తానికి అయితే రాజకీయాల్లోకి వెళ్ళనని మెగాస్టార్ చెప్పిన తరువాత పొలిటికల్ రీఎంట్రీ వార్తలకు ఫుల్ స్టాప్ పడతాయో లేదో చూడాలి.