Alla Ramakrishna Reddy: ఎన్నికల సమీపిస్తుండడంతో అన్ని పార్టీల నుంచి నేతలు పక్క చూపులు చూస్తున్నారు. సొంత పార్టీలో ఛాన్స్ లేకపోవడంతో భవిష్యత్తును వెతుక్కుంటూ వేరే పార్టీల్లో చేరుతున్నారు. ప్రధానంగా వైసీపీ నుంచి నేతలు బయటకు వెళ్తున్నారు. టిడిపి, జనసేనలో చేరుతున్నారు.అయితే ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒకరు. జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్న సంగతి తెలిసిందే. తొలి జాబితాలోనే తనకు సన్నిహితుడైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి జగన్ షాక్ ఇచ్చారు. దీంతో ఆయన షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ అక్కడ సైతం ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇమడలేకపోతున్నట్లు తెలుస్తోంది.
2014 నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో సిట్టింగ్ మంత్రిగా ఉన్న నారా లోకేష్ పై గెలుపొంది సంచలనం సృష్టించారు. గత టిడిపి ప్రభుత్వంపై న్యాయపోరాటం చేయడంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ముందుండే వారు. 2019 ఎన్నికల్లో గెలుపొందడం, వైసిపి అధికారంలోకి రావడంతో మంత్రి పదవి ఖాయంగా దక్కుతుందని భావించారు. కానీ సామాజిక సమీకరణల్లో భాగంగా జగన్ పక్కన పెట్టారు. విస్తరణలో సైతం పరిగణిస్తారని భావించారు. అక్కడ కూడా మొండి చేయి చూపారు. తీరా ఎన్నికల్లో టికెట్ కూడా లేదని తేల్చి చెప్పారు. దీంతో వైయస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. వైసీపీ నుంచి నేరుగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. షర్మిల తో సుదీర్ఘ ప్రయాణం చేస్తానని చెప్పుకొచ్చారు.
అయితే ఇది జరిగి నెలరోజుల వ్యవధిలోనే తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. గత పదేళ్లుగా మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండడంతో.. రామకృష్ణారెడ్డికి భారీ అనుచర గణం ఉంది. ఒక్కసారిగా ఆయన వైసీపీకి దూరం కావడంతో వారంతా జీర్ణించుకోలేకపోతున్నారు. తమ పరిస్థితి కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు. మంగళగిరిలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో విజయ్ సాయి రెడ్డితో ఆళ్ల రామకృష్ణారెడ్డి సమావేశం అయ్యారు. కొన్ని రకాల అంశాలపై చర్చించారు. రామకృష్ణారెడ్డి మెత్తబడినట్లు తెలుస్తోంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు రామకృష్ణారెడ్డి సీఎం జగన్ తో భేటీ అయ్యే ఛాన్స్ ఉంది.
ఆళ్ల రామకృష్ణారెడ్డిని తప్పించిన తర్వాత మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జిగా గంజి చిరంజీవిని నియమించారు. అయితే ఆయనకు వైసీపీ శ్రేణుల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదు. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, ఎమ్మెల్సీ హనుమంతరావు కూడా పార్టీ నిర్ణయం పై అసంతృప్తిగా ఉన్నారు. ఈ తరుణంలో అనవసరంగా ఆళ్ల రామకృష్ణారెడ్డిని మార్చి కష్టాలు తెచ్చుకున్నామని జగన్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నారా లోకేష్ ను ఢీ కొట్టాలంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి సరైన అభ్యర్థి అవుతారని వైసీపీ హై కమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆళ్ళ రామకృష్ణారెడ్డిని తిరిగి పార్టీలోకి రప్పించి టికెట్ కట్టబెడతారని టాక్ నడుస్తోంది. మరోవైపు గంజి చిరంజీవిని టిడిపి నుంచి రప్పించి పనిచేయిం చుకున్నారు. ఒకవేళ ఆర్కే పార్టీలో చేరి అభ్యర్థి అయితే.. గంజి చిరంజీవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.