Madanapalle  : మదనపల్లె ఘటనకు వారం.. ప్రమాదమా? కుట్రా? అసలు ఏం జరిగింది?వీడని మిస్టరీ!

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ నిర్ణయాలను పునః సమీక్షిస్తోంది. పెద్ద ఎత్తున శ్వేత పత్రాలను విడుదల చేస్తోంది. కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్ని ప్రమాదానికి గురికావడం విశేషం.

Written By: Dharma, Updated On : July 27, 2024 2:40 pm
Follow us on

Madanapalle : మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం మిస్టరీ వీడడం లేదు.ఘటన జరిగి వారం రోజులు సమీపిస్తున్నా ఈ ఘాతుకానికి పాల్పడింది ఎవరు అన్నది ఇంతవరకు తేలలేదు. ఇంకా విచారణ పర్వం కొనసాగుతోంది. అసలు నిందితులు పట్టు పడలేదు. గత ఆదివారం రాత్రి 11:30 గంటల సమయంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. కార్యాలయంలో ఉన్న కీలక ఫైళ్ళు దగ్ధమయ్యాయి. ఫైళ్లు పోగుచేసి నిప్పంటించినట్టు ఆనవాళ్లు కనిపించాయి. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. సిఐడి విచారణకు ఆదేశించింది. మరోవైపు రెవెన్యూ శాఖ పరంగా కూడా దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఘటన జరిగి దాదాపు వారం అవుతున్నా.. ఇప్పటికీ అసలేం జరిగిందన్న దానిపై క్లారిటీ రావడం లేదు. దీంతో ఇది మిస్టరీగా మారింది. అయితే ఈ ప్రమాద ఘటన రాజకీయ కోణంలో వెళ్తోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాల నేపథ్యంలోనే ఈ దారుణ ఘటన జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో పాటు ఆయన సోదరుడు, తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, ఆయన అనుచరుల భూకబ్జాలను చంద్రబాబు ప్రభుత్వం వెలికితీస్తుందన్న అనుమానంతోనే.. రెవెన్యూ రికార్డులను తగులబెట్టారన్న ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి ఒకవైపు సిఐడి, మరోవైపు రెవెన్యూ శాఖ విచారణ చేపడుతోంది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సిసోడియా, సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నర్ మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సిసోడియా.. అనుమానితుడిగా ఉన్న వైసీపీ నేత మాధవరెడ్డి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఏడుగురు రెవెన్యూ సిబ్బంది పాత్ర కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పెద్దిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

* పెద్దిరెడ్డి కుటుంబం పై అనుమానం
వైసీపీ హయాంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా రాయలసీమ వ్యాప్తంగా నడిచింది. చిత్తూరు జిల్లాను కనుసైగతో శాసించారు. చివరకు ప్రతిపక్ష నేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గం రావడానికి కూడా భయపడిపోయారు. అంతలా ప్రభావం చూపారు పెద్దిరెడ్డి. కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు చివరి వరకు ప్రయత్నాలు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఆయన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా ఉన్నారు. కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట నియోజకవర్గం నుంచి మూడోసారి ఎంపీ అయ్యారు. అయితే పెద్దిరెడ్డి కుటుంబం పై పెద్ద ఎత్తున భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి. వైసిపి ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున భూములను పెద్దిరెడ్డి కుటుంబానికి కట్టబెట్టారన్న విమర్శ ఉంది.

* ఐఏఎస్ అధికారి రానుండగా
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు సీఎం అయ్యారు. తన చిరకాల ప్రత్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేసుకున్నారు. మదనపల్లె ఆర్డిఓ గా ఐఏఎస్ అధికారి మేఘ స్వరూప్ ను నియమించారు. ఈనెల 20న ఆయన బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. ఈ తరుణంలో 19వ తేదీ అర్ధరాత్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరగడం అనుమానాలకు తావిచ్చింది. ఆదివారం సెలవు దినం నాడు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ కార్యాలయానికి వచ్చారు. ఆర్డిఓ హరిప్రసాద్ సైతం అదే రోజు అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. పుంగనూరు లో ఉన్న గౌతమ్ హడావిడిగా వచ్చాడని.. రాత్రి 10:40 గంటల వరకు అక్కడే ఉన్నట్లు సీసీ కెమెరా ఫుటేజ్ చెబుతోంది. కొన్ని ఒప్పందాల మేరకు ఆయన కార్యాలయానికి వచ్చాడని.. అటు తరువాతే ఫైళ్ళకు నిప్పు అంటిందని అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం సిఐడి అదుపులో ఉన్న గౌతం నోరు విప్పినట్లు సమాచారం.

* ఒకటి రెండు రోజుల్లో అరెస్టులు
అయితే ఈ ఘటనకు సంబంధించి అందరి వేళ్లు పెద్దిరెడ్డి వైపే చూపిస్తున్నాయి. ఈ ఘటనపై ఆయనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మాజీ సీఎం జగన్ స్పందించారు. వ్యక్తిగత కక్షతో పెద్దిరెడ్డిని చంద్రబాబు ఇరికించాలని చూస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి పరారీలో ఉన్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ ఘటనకు సంబంధించి అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కేసు విచారణలో సిఐడి సీరియస్ గా వ్యవహరిస్తోందని.. అందుకే వివరాలు బయటకు వెల్లడించడం లేదని తెలుస్తోంది. మొత్తానికి అయితే ఒకటి రెండు రోజుల్లో ఈ మిస్టరీ వీడనుందన్నమాట.