Telangana Politics : తేలుకుట్టిన దొంగలా రేవంత్‌ సర్కార్‌.. కేసీఆర్‌కు పేరొస్తుందనే కాళేశ్వరం మోటార్లు ఆన్‌ చేయడం లేదా?

తెలంగాణలో కాళేశ్వరం లొల్లి కొనసాగుతోంది. మొన్నటి వరకు మేడిగడ్డ కుంగుబాటుపై రేవంత్‌ సర్కార్‌ బీఆర్‌ఎస్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. తాజాగా బీఆర్‌ఎస్‌ నేతలు కాళేశ్వరం మోటార్లు ఆన్‌ చేయకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. డెడ్‌లైన్‌ విధించారు

Written By: Raj Shekar, Updated On : July 27, 2024 2:31 pm
Follow us on

Telangana Politics : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై రేవంత్‌ సర్కార్‌ ఓవైపు కమిషన్‌ వేసి విచారణ జరుపుతోంది. కమిషన్‌ కూడా త్వరగా నివేదిక అందించేందుకు విచారణలో దూకుడు ప్రదర్శిస్తోంది. మరోవైపు తాజాగా బీఆర్‌ఎస్‌ నేతలు అదే కాళేశ్వరం ప్రాజెక్టును తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో కాళేశ్వరంపై విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. ఎక్కడ మీటింగ్‌ జరిగినా కాళేశ్వరం తొలిఫలితం మీకే అంటూ ఊదరగొట్టారు. తర్వాత ప్రాజెక్టును ప్రారంభించారు. పంప్‌హౌస్‌లలోని భారీ మోటార్లతో నీటిని లిఫ్ట్‌ చేస్తూ.. తర్వాత వర్షాకాలంలో జలాశయాలు నిండగానే దిగువకు వదిలేశారు. దీంతో కరెంటు బిల్లు తప్ప పెద్దగా ప్రయోనం ఉండేది కాదు. కొద్దిగా లాభపడ్డది ఎవరంటే ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని కొండ పోచమ్మ, మల్లన్నసారగ్‌ నిర్వాసిత రైతులు, ఆ నియోజకవర్గంలోని చెరువులు, కుంటల కింద పంటలు సాగుచేసే రైతులు మాత్రమే. ఇక రెండేళ్లు నీటిని ఎత్తిపోసిన కేసీఆర్‌ సర్కార్‌ మూడో ఏడాది కూడా నీటిని ఎత్తిపోసిన తర్వాత వచ్చిన వరదలకు కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ కుంగిపోయింది. 26, 26, 28 పియర్స్‌ కుంగడంతో నీటిని నిల్వ చేయొద్దని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ సూచించింది. తర్వాత అన్నారం బ్యారేజీ వద్ద కూడా బుంగలు పడ్డాయి. దానిని కూడా పరిశీలించిన నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ అక్కడ కూడా నీరు నిల్వ చేయొద్దని సూచించింది. తాజాగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కాళేశ్వరం బ్యారేజీకి ప్రాణహిత, గోదావరి నుంచి భారీగా వరద వస్తోంది. అయితే గేట్లు తెరిచి ఉండడంతో నీరంతా వృథాగా దిగువకు పోతోంది. దీనిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావించిన గులాబీ పార్టీ కేటీఆర్‌ నేతృత్వంలో ప్రాజెక్టుల బాటపట్టింది. నీటిని లిఫ్ట్‌ చేయకపోవడంతో మధ్య మానేరు, దిగువ మానేరుఎడారిని తలపిస్తున్నాయని పేర్కొన్నారు. మోటార్లు ఆన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే 50 వేల మంది రైతులతో కలిసి మోటార్లు ఆన్‌ చేస్తామని హెచ్చరించారు.

కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే..
ప్రాజెక్టుల పర్యటన సందర్భంగా కేటీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వం తీరును తప్పు పట్టారు. కేవలం కేసీఆర్‌ను బద్నాం చేయడానికే రేవంత్‌ సర్కార్‌ కాళేశ్వరంను బూచిగా చూపుతోందని ఆరోపించారు. లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకుని మేడిగడ్డ బ్యారేసి ఠీవీగా నిలబడిందని తెలిపారు. చిన్న డ్యామేజీని పెద్ద బూచీగా చూపుతున్నారని ఆరోపించారు. వరద నీటిని సద్వినియోగం చేసుకోవాల్సి సమయంలో నీరంతా వృథాగా కిందకి పోతుంటే రేవంత్‌ సర్కార్‌ చోద్యం చూస్తోందని విమర్శించారు. నీటి పంపింగ్‌ పై ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సందర్శనకు బయలుదేరామని తెలిపారు. ఎండిపోతున్న ఎల్‌ఎండీ, మిడ్‌ మానేరు, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ వరద కాలువ సహా అన్ని రిజర్వాయర్లను నింపాలని డిమాండ్‌ చేశారు.

కేసీఆర్‌కు పేరు వస్తుందనే..
రాజకీయ కక్షతో పంపింగ్‌ స్టార్ట్‌ చేయకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు. వృధాగా పోతున్న నీటిని పంపించేయకుండా ఈ ప్రభుత్వం వర్షం తక్కువ పడిందంటూ, వర్షాలు లేవంటూ సాకులు చెప్పి రైతులకు, ప్రజలకు నష్టం చేసే ప్రయత్నం చేసే అవకాశం ఉందని ఆరపించారు. కన్నెపల్లి దగ్గర పంప్‌లు ఆన్‌చేస్తే మొత్తం రిజర్వాయర్లు నిండుతాయని తెలిపారు. మల్లన్న సాగర్‌ లో 50 టీఎంసీలు, కొండ పోచమ్మ సాగర్‌లో 15 టీఎంసీలు నింపితే ప్రజలకు మంచి నీటిని ఇబ్బందులు కూడా ఉండదన్నారు. ఆ విషయాన్ని పక్కన బెట్టి కేసీఆర్‌ను బద్నాం చేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. మోటార్లు ఆన్‌చేస్తే కేటీఆర్‌కు మంచిపేరు వస్తుందని నీటిని దిగువకు వదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తేలుకుట్టిన దొంగలా రేంత్‌రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. నీటి పంపింగ్‌ ఎందుకు చేయటం లేదంటూ రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామని స్పష్టం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ ధాన్య భండాగారం
కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కారణంగానే దేశానికే తెలంగాణ ధాన్య భండాగారంగా మారిందని కేటీఆర్‌ తెలిపారు. పంజాబ్, హర్యానాను తలదన్ని నీటి సమృద్ధిని సాధించటంతో వ్యవసాయ విస్తరణ జరిగిందన్నారు. ఏటా వృథాగా పోతున్న వందల టీఎంసీల నీళ్లను ఒడిసి పట్టేందుకే కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ చేపట్టారని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ అని చెప్పారు. ఎనిమిది నెలలుగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం లక్షలాది మంది రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు.

పంప్‌లు ఆన్‌ చేయకుంటే ఉద్యమం..
ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పంపులు ఆగస్టు 2 వరకు ఆన్‌ చేయాలని కేటీఆర్‌ సూచించారు. లేదంటే రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదనుకుంటే మేడిగడ్డ నుంచి ప్రస్తుతం 10 లక్షల క్యూసెక్కుల నీరు ఎలా వెళ్తుందని ప్రశ్నించారు. కన్నెపల్లి పంప్‌ హౌస్‌ వద్ద 25 వేల క్యూసెక్కుల నీరు ఉంటే పంపులు ఆన్‌ చేసే అవకాశం ఉందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం కళ్లు తెరిచి వెంటనే పంప్‌లు ఆన్‌చేసి ఎడారిని తలపిస్తున్న ఎల్‌ఎండీ, మిడ్‌ మానేర్, ఎస్సారెస్పీ వరద కాలువ నింపాలని డిమాండ్‌ చేశారు.

Tags