Heavy Rain Forecast : ఏపీలో వేసవి కాలాన్ని మించి ఎండలు దంచి కొడుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక పంటల గురించి చెప్పనవసరం లేదు. వర్షాధార భూముల్లో నీరు లేక పొలాలు ఎండిపోతున్నాయి. ఇటువంటి తరుణంలో ఏపీ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ శుభవార్త చెప్పింది.ఆది, సోమవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ వర్షాల నుంచి తేలికపాటి జల్లులు కురుస్తాయని వెల్లడించింది. ఈ ఏడాది సకాలంలో రుతుపవనాలు ప్రవేశించినా..రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు ఆశించిన స్థాయిలో పడలేదు.సరైన వర్షపాతం నమోదు కాలేదు.దీంతో ఖరీఫ్ సజావుగా ముందుకు సాగడం లేదు. వరి ఉబాలు సైతం సక్రమంగా వేయలేదు. చాలా ప్రాంతాల్లో అదును దాటి పోతుండడంతో ఉబాలపై ఆశలు వదులుకుంటున్నారు రైతులు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు అధిక శాతం లో నమోదవుతున్నాయి.దీంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం గా మారడం, తరువాత అది వెళ్ళిపోతూ తేమగాలును తీసుకుపోయింది. అదే ఉక్కపోతకు కారణమవుతోంది. అయితే ఇటువంటి తరుణంలో ఉత్తర కర్ణాటక కు ఆనుకొని తెలంగాణలో ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. భారీ వర్షాల నుంచి తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
* ఆదివారం ఇలా
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆదివారం ప్రకాశం, నంద్యాల, ఏలూరు, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
* సోమవారం ఇలా
ఇక సోమవారం వర్షాల ఉధృతి పెరిగే అవకాశం ఉంది. అన్నమయ్య, నంద్యాల, చిత్తూరు, తిరుపతి,అనంతపురం, ప్రకాశం, ఏలూరు, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో విపత్తుల నిర్వహణ సంస్థ అన్ని రకాల హెచ్చరికలు జారీ చేస్తోంది.లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. పిడుగులు పడే అవకాశం ఉండడంతో ఎవరు బయటకు తిరుగుద్దని సూచిస్తోంది.
* తెలంగాణలో
తెలంగాణకు సైతం భారీ వర్ష సూచన ఉంది. మహబూబ్ నగర్,మెదక్,సంగారెడ్డి,కామారెడ్డి,వికారాబాద్, సిద్దిపేట, హన్మకొండ,ములుగు,వరంగల్,భూపాలపల్లి,పెద్దపల్లి,కరీంనగర్,నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.