Chandrababu Naidu: ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రజలకు చేరువు కావాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ తరుణంలోనే రకరకాల హామీలు ఇచ్చి ప్రజలను తమ వైపు తిప్పుకునేలా ప్లాన్ చేస్తున్నాయి. ఈ ప్రభుత్వం మంచి చేసిందనుకుంటే ఆశీర్వదించాలని సీఎం జగన్ కోరుతున్నారు. అదే సమయంలో విపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాయి. చంద్రబాబు అయితే సూపర్ సిక్స్ పథకాలతో పాటు సరికొత్త ఆస్త్రాలను బయటకు తీస్తున్నారు. ప్రజలను ఆలోచింపజేసే పథకాలను ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా గతంలో జగన్ ప్రకటించిన ఒక పథకాన్ని.. చిన్నపాటి మార్పులు చేసి తాజాగా ప్రకటించారు. ఇది తప్పకుండా ప్రజల్లోకి వెళుతుందని టిడిపి నేతలు అంచనా వేస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పేదలకు సెంటున్నర ఇంటి స్థలం అందించిన సంగతి తెలిసిందే. ప్రతి గ్రామంలో ఇల్లు లేని పేదలను గుర్తించి సెంటున్నర స్థలం మంజూరు చేశారు. జగనన్న కాలనీ పేరిట లేఅవుట్ వేశారు. అయితే నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో ఈ లేఅవుట్లను వేశారన్న విమర్శలు ఉన్నాయి. చాలామంది లబ్ధిదారులు పెద్దగా ముందుకు రాలేదు. ఊరికి దూరంగా, మౌలిక వసతులు లేని ప్రాంతాల్లో లేఅవుట్లు వేయడం ఇబ్బందికరంగా మారింది. ఇంటి స్థలాలు దక్కించుకున్న వారు సైతం అసంతృప్తితో ఉన్నారు. చాలామంది అక్కడ ఇల్లు కట్టేందుకు కూడా ముందుకు రాలేదు. అయితే ఇప్పుడు ఎన్నికల ప్రచార సభల్లో జగన్ పెద్ద ఎత్తున ఇంటి స్థలాలు ఇచ్చామని చెబుతున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారు. ఈ పథకాన్ని కొద్దిపాటి మార్పులు చేసి ప్రజల్లోకి బలంగా వెళ్లడానికి డిసైడ్ అయ్యారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు రెండు సెంట్లు నుంచి మూడు సెంట్లు భూమి ఇస్తామని తాజాగా చంద్రబాబు ప్రకటించారు. ఆ స్థలంలో పునాదుల నుంచి రూఫ్ వరకు ప్రభుత్వమే కట్టి ఇస్తుందని తేల్చి చెప్పారు. ఇది తన హామీ అని ప్రజల మధ్య ప్రకటించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ప్రజా గళం సభలో చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే తాము ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలపై మహిళల నుంచి అభిప్రాయాలను సేకరించామని.. వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని.. చాలామంది ఇళ్ల స్థలాలు కావాలని అడుగుతున్నారని.. జగన్ ఇచ్చిన ఇంటి స్థలం పడుకోవడానికి కూడా చాలదని.. అందుకే తాము రెండు నుంచి మూడు సెంట్లు స్థలం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అయితే ఈ పథకం ప్రజల్లోకి బలంగా వెళ్తుందని టిడిపి శ్రేణులు విశ్వసిస్తున్నాయి. మరి అది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.