IPL 2024, RR vs MI: రాజస్థాన్ పై ఓటమి.. ముంబై ప్లేఆఫ్ మరింత టఫ్.. ఏం చేయాలంటే?

వాస్తవంగా ఈ మ్యాచ్లో కచ్చితంగా ముంబై గెలుస్తుందని అందరూ అనుకున్నారు. రాజస్థాన్ పై ముంబై గత ట్రాక్ రికార్డు కూడా అదే చెబుతోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : April 23, 2024 1:18 pm

RR vs MI Highlights

Follow us on

IPL 2024, RR vs MI: పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. ఈ సామెత అచ్చు గుద్దినట్టు ముంబై ఇండియన్స్ జట్టుకు సరిపోతుంది. పేరుకు గొప్ప గొప్ప ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. అద్భుతమైన బౌలర్లు, సూపర్ పవర్ బ్యాటర్లు ప్లే -11 లో ఉన్నారు. అయినప్పటికీ ఏం ఉపయోగం? కీలక సమయంలో అవుట్ కావడం, జట్టుకు అవసరమైన సమయంలో చేతులెత్తేయడం.. పరిపాటిగా మారింది. ఫలితంగా ఎన్నో అంచనాలతో ఐపీఎల్ 17వ సీజన్లో అడుగు పెట్టిన ఆ జట్టు.. దారుణమైన ఆట తీరుతో పరువు పోగొట్టుకుంటున్నది. అనామక జట్టు లాగా ఆడుతోంది.. పాయింట్ల పట్టికలో చివరి వరుసలో ఉంది. ప్లే ఆఫ్ వెళ్ళాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో రాజస్థాన్ చేతిలో ముంబై ఓడిపోయింది. ఫలితంగా ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. దరిద్రమైన బ్యాటింగ్, చండాలమైన ఫీల్డింగ్, అంతకంటే నాసిరకమైన బౌలింగ్ తో 9 వికెట్ల తేడాతో రాజస్థాన్ పై ఓటమిపాలైంది.

వాస్తవంగా ఈ మ్యాచ్లో కచ్చితంగా ముంబై గెలుస్తుందని అందరూ అనుకున్నారు. రాజస్థాన్ పై ముంబై గత ట్రాక్ రికార్డు కూడా అదే చెబుతోంది. కానీ, సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో ముంబై ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 9 వికెట్లకు 179 రన్స్ చేసింది. తిలక్ వర్మ 65 పరుగులతో రాణించాడు. యువ ఆటగాడు నేహళ్ వదెరా 24 బంతుల్లో 49 పరుగులతో సత్తా చాటాడు. ఈ క్రమంలో రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ ఐదు వికెట్లు పడగొట్టి ముంబై జట్టు టాప్ ఆర్డర్ ను తునాతునకలు చేశాడు. అతని బౌలింగ్లో ముంబై కి వెన్నెముక లాంటి ఆటగాళ్లు పెవిలియన్ చేరుకున్నారు. సందీప్ శర్మ ఐదు వికెట్లు పడగొడితే ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీశాడు. అశ్విన్, చాహల్ చెరో వికెట్ సాధించారు. చేజింగ్ కు దిగిన రాజస్థాన్ జట్టు 18.4 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే నష్టపోయి 183 రన్స్ చేసి.. సులువైన విజయాన్ని దక్కించుకుంది. రాజస్థాన్ బ్యాటర్ జైస్వాల్ 60 బంతుల్లో 104*, బట్లర్ 25 బంతుల్లో 35, సంజు 28 బంతుల్లో 38* రన్స్ చేసి రాజస్థాన్ జట్టును గెలిపించారు. ముంబై బౌలర్లలో పీయూష్ చావ్లా మాత్రమే ఒక వికెట్ దక్కించుకున్నాడు.

సంక్లిష్టం

ఈ టోర్నీలో ఇప్పటివరకు ముంబై జట్టు ఎనిమిది మ్యాచ్ లు ఆడింది. మూడంటే మూడే విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో కొనసాగుతోంది. రాజస్థాన్ జట్టుపై తొమ్మిది వికెట్ల తేడాతో ఓడిపోయిన నేపథ్యంలో.. ముంబై జట్టు తన ప్లే ఆఫ్ అవకాశాలను మరింత క్లిష్టతరం చేసుకుంది. ఈ సీజన్లో ముంబై ఇంకా 6 మ్యాచులు ఆడాల్సి ఉంది. ప్లే ఆఫ్ చేయాలంటే ఈ ఆరింటికి ఆరు మ్యాచ్ లు ముంబై జట్టు గెలవాల్సిందే. ఒకవేళ ఏదైనా ఒక మ్యాచ్లో ఓడిపోతే అప్పుడు రన్ రేట్ అత్యంత కీలకం అవుతుంది. ప్రస్తుతం ముంబై జట్టు ఆడుతున్న తీరు చూస్తుంటే ఆరు మ్యాచులు గెలవడం దాదాపు అసాధ్యంగా అనిపిస్తోంది. సంచలన ఆటతీరు ప్రదర్శిస్తే తప్ప ఆ జట్టు గెలిచే పరిస్థితులు కనిపించడం లేదు. ఇక ముంబై జట్టు తన తదుపరి మ్యాచులు ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో, కోల్ కతా, హైదరాబాద్, లక్నో జట్లతో ఆడాల్సి ఉంది. అయితే ఇందులో మూడు మ్యాచ్లు ముంబై జట్టు సొంత మైదానమైన వాంఖడే లో జరగనున్నాయి. అదొక్కటే ఆ జట్టుకు కలిసి వచ్చే అవకాశం.