Polavaram : ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో అడుగుపెట్టిన కొద్దిసేపటికే ఒక ప్రెస్ నోట్ విడుదలవుతుంది. అందులో ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు, విభజన హామీలు..ఈ మూడు అంశాలకు ఎనలేని ప్రాధాన్యత ఉంటాయి. అయితే ఈ మూడింట్లో ఒకదానికైనా అడుగు ముందు పడిందంటే లేదనే చెప్పొచ్చు. అసలు సీఎం జగన్ ఢిల్లీ ఎందుకొచ్చారు? తమతో కలిసి ఏం చర్చించారు? అసలు రాష్ట్రానికి ఏం అడిగారు? అన్నది కూడా కేంద్ర పెద్దలు బయటపెట్టరు. మూడేళ్లుగా ఇదే తంతు. అందుకే ఒకటి రెండు అనుకూల ఛానళ్లు తప్ప జగన్ పర్యటనను నేషనల్ మీడియా కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
కేంద్ర ప్రభుత్వం మాత్రం కొన్ని విషయాల్లో ఎప్పటికప్పుడు స్పష్టతనిస్తోంది. తాజాగా ఏపీ జీవనాడిగా భావిస్తున్న పోలవరం జాతీయ ప్రాజెక్టు విషయంలో స్పష్టమైన ప్రకటన చేసింది. ప్రాజెక్టు నిర్మాణానికి కేవలం రూ.12,911.15 కోట్లు మాత్రమే ఇస్తామని తేల్చిచెప్పింది. అంతకు మించి ఇవ్వలేమని చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు మాత్రం వేరే విధంగా ఉన్నాయి. రూ.55,548.87 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని జగన్ సర్కారు చెబుతూ వస్తోంది. అయితే కేంద్రం తాజాగా చేసిన ప్రకటనపై రాష్ట్ర పెద్దలు ఎవరూ స్పందించలేదు. దీంతో ఎలా ముందుకెళ్లాలో తెలియడం లేదు.
రాష్ట్రంలో పోలవరం ప్రాధాన్యత గల ప్రాజెక్ట్. చంద్రబాబు హయాంలో నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. పనులు కూడా కొంతవరకూ ఆశాజనకంగా జరిగాయి. చంద్రబాబు నిత్యం పర్యవేక్షించేవారు. నిత్యం సమీక్షలు జరిపేవారు. అయితే జగన్ పవర్ లోకి వచ్చిన తరువాత పోలవరానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. కానీ చేసి చూపించలేదు. ఈ నాలుగేళ్లలో కేవలం ఆరుసార్లు మాత్రమే ప్రాజెక్టును సందర్శించారు. నిర్వాసితుల సమస్యలు సైతం పరిష్కరించలేకపోయారు. విపక్షంలో ఉన్నప్పుడు పరిహారంపై పోరాటం చేయాలని రెచ్చగొట్టిన ఆయన… అధికారంలోకి వచ్చిన తరువాత మడత పేచీ వేశారు.
పోనీ మంత్రులు అయినా ఆసక్తి చూపారా? అంటే అదీ లేదు. తొలి మంత్రివర్గంలో జలవనరుల శాఖ మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. పోలవరం విషయంలో ఆయన మాటలు కోటలు దాటిపోయాయి. విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు వ్యంగ్యోక్తులు సంధించారు. పర్సంటేజ్ అంటూ దీర్ఘాలు పలికారు. ప్రాజెక్టు నిర్మాణం గడువు ఇది అంటూ చెప్పి శపధం చేశారు. తీరా ఆ సమయం వచ్చేసరికి పత్తా లేకుండా పోయారు. తరువాత అంబటి రాంబాబుకు మంత్రి పదవి దక్కింది. కానీ ఆయన మాటలతో రెచ్చిపోతున్నారే కానీ పనులు పట్టాలెక్కించలేకపోతున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ స్పష్టమైన ప్రకటన తరువాత ఎలా స్పందిస్తారో? చూడాలి మరి.