Vizianagaram royal family: రాజులు పోయారు.. రాజరికలు పోయాయి.. కానీ ఒక ప్రాంతంలో మాత్రం రాజుల త్యాగాలు కళ్ళెదుటే కనబడతాయి. రాజులు అంటే శాసించే వారు కాదు.. ప్రజల కోసం పరితపించేవారు అని స్పష్టమవుతుంది. విజయనగరం( Vijayanagaram) పూసపాటి రాజవంశీయుల త్యాగాలకు అడ్డు అదుపు ఉండదు కూడా. ప్రజల కోసం వేలాది ఎకరాలను త్యాగం చేసిన రాజవంశం వారిది. తాజాగా భావితరాల కోసం 1000 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని వదులుకున్నారు పూసపాటి రాజవంశీయులు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఏపీ ప్రభుత్వానికి అప్పగించిన గొప్ప మనసున్న మారాజులు పూసపాటి వంశీయులు. విజయనగరం జిల్లా భోగాపురం లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు అవుతున్న క్రమంలో… అనుబంధంగా సివిల్ ఏవియేషన్ లో ఉద్యోగ ఉపాధి కోర్సులను అందించే సంస్థకు ఏకంగా 136 ఎకరాల భూమిని ఇచ్చారు అంటే వారి ఔథర్యం ఎలాంటిదో అర్థం అవుతుంది.
పెరుగుతున్న విమాన ప్రయాణికులతో..
దేశవ్యాప్తంగా 200 వరకు విమానాశ్రయాలు( airports ) ఉన్నాయి. విమాన ప్రయాణికులు పెరుగుతున్నారు. భవిష్యత్తులో విమానయానం మరింత రద్దీగా మారనుంది. ఇటువంటి పరిస్థితుల్లో మానవ వనరులు అనేది విమానయానానికి అవసరం. విమానాల్లో పనిచేసేందుకు పైలెట్లతో పాటు అన్ని విభాగాలకు సిబ్బంది అవసరం. కానీ మన దేశంలో సివిల్ ఏవియేషన్ కోర్సులకు సంబంధించిన విద్యాసంస్థలు లేవు. యూనివర్సిటీలు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ యూనివర్సిటీలకు సంబంధించి క్యాంపస్లను ఒకే చోట ఏర్పాటు చేసేందుకు ఏపీ మంత్రి నారా లోకేష్ నిర్ణయించారు. అయితే ఆ ఏవియేషన్ ఎడ్యుకేషన్ సంస్థకు భూములు ఇచ్చింది పూసపాటి రాజవంశీయుల నేతృత్వంలోని మాన్సాస్ ట్రస్ట్. నిర్వహణకు ముందుకు వచ్చింది విమానాశ్రయాల నిర్మాణ బాధ్యతలు చూసే జిఎంఆర్ సంస్థ.
ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ కోసం..
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ( bhogapuram International Airport ) నిర్మాణం దాదాపు ఒక కొలిక్కి వచ్చింది. వచ్చే నెలలో ట్రయల్ రన్ జరగనుంది. మే నెలలో మొదటి విమానం ఎగరనుంది. అయితే మొన్ననే ఇండిగో సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. కేవలం విమానాల్లో పనిచేసే సిబ్బంది వల్ల ఈ తరహా సంక్షోభం ఎదురయింది. భవిష్యత్తులో ఇటువంటి సంక్షోభం తలెత్తకుండా విమానయానానికి అవసరమైన సిబ్బందిని ఏపీ నుంచి అందించేందుకు సంకల్పించారు మంత్రి నారా లోకేష్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏవియేషన్ యూనివర్సిటీల బ్రాంచులు ఒకే చోట అందుబాటులోకి తేవాలని భావించారు. ఏవియేషన్ ఎడ్యుకేషన్ హబ్ ను విశాఖలో ఏర్పాటు చేయాలని చూశారు. ప్రభుత్వ భూముల్లో వాటిని ఏర్పాటు చేయాలని భావించారు. అయితే గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు, ఆయన కుమార్తె విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఈ విషయంలో గొప్ప వితరణకు ముందుకు వచ్చారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలో… భీమిలి మండలంలో పూసపాటి రాజవంశీయుల మాన్సాస్ ట్రస్ట్ కు 136 ఎకరాల భూమి ఉంది. ప్రస్తుతం అది మార్కెట్ విలువ ప్రకారం 1000 కోట్ల రూపాయలకు చెందినది. ఆ భూమిని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు అశోక్ గజపతిరాజుతో పాటు ఆయన కుమార్తె అదితి గజపతిరాజు.
ఘనమైన చరిత్ర..
పూసపాటి కుటుంబానికి ఘన చరిత్ర. దశాబ్దాల కిందటే ఆ కుటుంబానికి రెండు సొంత విమానాలు ఉండేవట. సొంత విమానాశ్రయాలు సైతం ఏర్పాటు చేసుకున్నారట. ముఖ్యంగా చివరి సంస్థానాధీశుడు మహారాజ అలక్ నంద గజపతి హయాంలో ఈ విమానాలు ఉండేవట. అదే వంశానికి చెందిన అశోక్ గజపతిరాజు పైలట్ కావాలనే కోరిక ఉండేదట. సామాన్యుడికి సైతం విమాన సేవలు అందాలన్నది అశోక్ గజపతిరాజు ఆలోచన. కానీ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు ఆయన. అలా 2014లో ఎంపీ అయి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలోనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు జరిగింది. ఇప్పుడు త్వరలో ఆ విమానాశ్రయం నుంచి విమానాలు ఎగరబోతున్నాయి. ఇప్పుడు ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ కోసం భూములను తృణప్రాయంగా అందించి మరోసారి ఔదార్యం చాటుకుంది పూసపాటి కుటుంబం. నిజంగా ఆ కుటుంబానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.