Homeఆంధ్రప్రదేశ్‌Vizianagaram Political Update: ఆ జిల్లాలో టిడిపికి నాయకుడు కావలెను!

Vizianagaram Political Update: ఆ జిల్లాలో టిడిపికి నాయకుడు కావలెను!

Vizianagaram Political Update: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి( Telugu Desam Party) బలమైన నాయకత్వం ఉంది. ప్రతి జిల్లాలో టిడిపికి అదే స్థాయిలో నాయకత్వం కొనసాగుతోంది. టిడిపి చాలామంది నేతలను పుట్టించిందన్నది వాస్తవం. అప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలింది. ఆ పార్టీలో పాతతరం నాయకులు కొనసాగే వారు. దశాబ్దాలుగా వారి పదవులు అనుభవించేవారు. కానీ సరికొత్త రాజకీయ నినాదంతో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు అయింది. ఉమ్మడి రాష్ట్రంలో వందలాది మంది నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ గా మారింది. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీల నుంచి నాయకత్వం పుట్టుకొచ్చింది. అయితే ఇప్పుడు టిడిపిలో యువనాయకత్వం వస్తోంది. పాత నాయకులంతా పదవీ విరమణ చేస్తున్నారు. యాక్టివ్ రాజకీయాలకు దూరం అవుతున్నారు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో అదే పరిస్థితి ఉంది. ఇప్పటివరకు నాయకత్వ బాధ్యతలు తీసుకున్న అశోక్ గజపతిరాజు రాజ్యాంగబద్ధ పదవి గవర్నర్ గా నియమితులయ్యారు. ఇకనుంచి విజయనగరంలో పార్టీ బాధ్యతలు ఎవరు చూస్తారు అన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.

అశోక్ కు రాజ్యాంగబద్ధ పదవి
విజయనగరం జిల్లాలో( Vijayanagaram district) అశోక్ అంటే టిడిపి.. టిడిపి అంటే అశోక్ అన్నట్టు పరిస్థితి ఉండేది. చివరికి పార్టీ కార్యాలయంగా కూడా అశోక్ గజపతిరాజు బంగ్లా దశాబ్దాలుగా కొనసాగుతుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దశాబ్దాలుగా విజయనగరం జిల్లాను అశోక్ గజపతిరాజు శాసించారు. ఎన్టీఆర్ అయినా.. చంద్రబాబు హయాంలో అయినా.. విజయనగరం జిల్లాలో మాత్రం పూర్తిగా అశోక్ కనుసన్నల్లోనే రాజకీయం నడిచేది. ఆయన మాటే శిరోధార్యంగా ఉండేది. ఆయన అనుకున్న వారే పదవులు అందుకునేవారు. 2024 ఎన్నికల్లో కూడా ఆయన మాటే చెల్లుబాటు అయింది. అటువంటి నేత ఇప్పుడు గవర్నర్గా వెళుతుండడంతో రాజకీయంగా కథ ముగిసినట్లే.

Also Read: New Goa Governor: ఇద్దరూ ఇద్దరే.. గవర్నర్ల నియామకంలో ‘ఉత్తరాంధ్ర’ మార్క్!

విజయనగరంలో లోటు
ఇప్పుడు విజయనగరం జిల్లాలకు అర్జెంటుగా టిడిపికి నాయకత్వం అవసరం. మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్( Kondapalli Srinivas) ఉన్నారు. ఆయన రాజకీయాలకు కొత్త. జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపలేకపోతున్నారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం బలంగా కనిపిస్తోంది. బొత్స కుటుంబం మొత్తం వైసీపీని లేపే ప్రయత్నంలో ఉంది. ఆ కుటుంబాన్ని తట్టుకొని రాజకీయాలు చేయడం చాలా కష్టం. అశోక్ గజపతిరాజు క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు కావడంతో బొత్స కుటుంబ హవాను ఇట్టే తట్టుకోగలిగారు. ఆ స్థాయి రాజకీయాలు చేయాలంటే ఇప్పుడు టిడిపి కి పటిష్ట నాయకత్వం ఆవశ్యం. అయితే అక్కడ నాయకత్వం తీసుకునేందుకు కనుచూపుమేరలో కూడా ఎవరూ కనిపించడం లేదు.

ఆ రెండు సామాజిక వర్గాల ప్రాబల్యం..
విజయనగరం జిల్లాలో తూర్పు కాపులతో( turpu Kapu ) పాటు వెలమ సామాజిక వర్గం అధికం. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత కళా వెంకట్రావు ఉన్నారు. ఆయనది బలమైన రాజకీయ నేపథ్యం. అయితే ఆయన సైతం దూకుడు చూపే అవకాశం లేదు. విజయనగరం ఎంపీగా ఉన్నారు కలిసేట్టి అప్పలనాయుడు. ఓ ద్వితీయ శ్రేణి నాయకుడిగా ఉన్న అప్పలనాయుడు పార్టీకి అందించిన సేవలను గుర్తించి చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారు. ఆయన ఎంపీగా విజయం సాధించారు. అయితే జిల్లా నాయకత్వం తీసుకునే స్థాయిలో అప్పలనాయుడు లేరనేది మెజారిటీ శ్రేణుల అభిప్రాయం. మరోవైపు బొబ్బిలి రాజులు ఉన్నారు. సుజయ్ కృష్ణ రంగారావు తో పాటు ఎమ్మెల్యే బేబి నయన కూడా ఉన్నారు. ఇంకోవైపు మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ రాజాం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీనియర్ ఎమ్మెల్యేగా కోళ్ల లలిత కుమారి సైతం ఉన్నారు. నియోజకవర్గాలపరంగా తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న.. జిల్లాను సమన్వయం చేసే నాయకుడు ఇప్పుడు అవసరం. మరి టిడిపి హై కమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular