Botsa Satyanarayana: మాజీ మంత్రి బొత్స అనారోగ్యంతో ఉన్నారా? లేకుంటే విదేశీ పర్యటనలో ఉన్నారా? ఎందుకు ఆయన బయటకు కనిపించడం లేదు? జగన్ విజయనగరం పర్యటనలో సైతం ముఖం చాటేశారు ఎందుకు? అసంతృప్తితో ఉన్నారా? అలకబూనారా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదో ఆసక్తికర చర్చ. బొత్స సత్యనారాయణ ఉభయగోదావరి జిల్లాల వైసిపి రీజినల్ కోఆర్డినేటర్ గా నియమితులయ్యారు. అంతకుముందు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అక్కడ వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జనసేనలోకి ఫిరాయించారు. దీంతో ఆయనపై అనర్హత వేటు పడింది. ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే అక్కడ వైసీపీకి స్థానిక సంస్థల్లో స్పష్టమైన బలం ఉంది. దీంతో జగన్ వ్యూహాత్మకంగా విజయ నగరానికి చెందిన బొత్స సత్యనారాయణ రంగంలోకి దించారు. అయితే బలం తక్కువగా ఉన్న జిల్లాలో ఎందుకు ప్రయోగాలకు పోవడం అని చంద్రబాబు వెనుకడుగు వేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పోటీలో పెట్టలేదు. దీంతో బొత్స ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక ఉత్తరాంధ్ర తనదేనన్న నిర్ణయానికి వచ్చారు. అయితే జగన్ అనూహ్యంగా విజయసాయిరెడ్డిని రంగంలోకి దించారు. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా నియమించారు. బొత్స ను మాత్రం జనసేన బలంగా ఉన్న ఉభయగోదావరి జిల్లాలకు పంపించారు. అప్పటినుంచి బొత్స కనిపించడం మానేశారు. విజయనగరం జిల్లాలో డయేరియా బాధితులను పరామర్శించడానికి జగన్ వచ్చినప్పుడు కూడా బొత్స కనిపించకుండా పోయారు.అయితే ఇప్పుడు విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్ రావడంతో బొత్స గురించి బలమైన చర్చ నడుస్తోంది.
* ఒకప్పుడు బొత్స శిష్యుడే
గతంలో వైసీపీ హయాంలో విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఇందుకూరి రఘురాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన మాజీ మంత్రి బొత్స ప్రధాన అనుచరుడు. అయితే ఎస్ కోట నియోజకవర్గ టికెట్ ఆశించారు. కానీ జగన్ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు టికెట్ ఇచ్చారు. దీనిని సహించలేక రఘురాజు కుటుంబ సభ్యులతో పాటు మెజారిటీ క్యాడర్ టిడిపిలోకి వెళ్లిపోయింది. రాష్ట్రం తో పాటు ఎస్.కోట నియోజకవర్గంలో టిడిపి విజయం సాధించింది. ఎమ్మెల్సీగా ఉన్న ఇందుకూరి రఘురాజు టిడిపి నేతలతో కలిసి ప్రారంభోత్సవాలు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో వైసిపి ఆయనపై శాసనమండలి చైర్మన్ మోసేన్ రాజుకు ఫిర్యాదు చేసింది. దీంతో రఘురాజు పై అనర్హత వేటు పడింది. అయితే తనపై అనర్హత వేటు విషయంలో నిబంధనలు పాటించలేదంటూ రఘురాజు కోర్టును ఆశ్రయించారు. కానీ ఇంతలోనే ఈసి నోటిఫికేషన్ జారీ చేయడం విశేషం.
* స్పష్టమైన బలం
ప్రస్తుతం విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థలకు సంబంధించి వైసీపీకి స్పష్టమైన బలం ఉంది. మొత్తం ఓటర్లు 753 మంది ఉన్నారు. వీరిలో వైసీపీకి 548 మంది, టిడిపికి 156, జనసేనకు 13 మంది ఉన్నారు. స్వతంత్రులు ఓ 22 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ఎలా చూసినా వైసీపీకి స్పష్టమైన బలం ఉంది. అయితే ఎన్నికల అనంతరం చాలామంది టీడీపీలో చేరిపోయినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో బొత్స సత్యనారాయణ ఎక్కడ కనిపించకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సైతం ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకుంటామని ధీమాతో ఉన్నారు. అయితే అసలు విషయం తెలిసి బొత్స తప్పుకున్నారా? లేకుంటే అలకబూనారా? అన్నది తెలియాల్సి ఉంది.