Y S Vivekananda Reddy : వైయస్ వివేకానంద రెడ్డి ( Y S Vivekananda Reddy )హత్య జరిగి ఆరేళ్లు అవుతోంది. ఇంతవరకు ఆ కేసు కొలిక్కి రాలేదు. నిందితులకు శిక్ష పడలేదు. పైగా ఈ కేసులో సాక్షులు ఒక్కొక్కరు అనుమానాస్పద స్థితిలో చనిపోతున్నారు. వివేకానంద రెడ్డి సామాన్య వ్యక్తి కాదు. ఎంపీగా, మంత్రిగా కూడా పదవి చేపట్టారు. పైగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వైయస్ రాజశేఖర్ రెడ్డి కి స్వయానా సోదరుడు. మరో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సొంత బాబాయి. అటువంటి వ్యక్తి హత్యకు గురైతే.. ఇప్పటివరకు నిందితులు ఎవరన్నది తేలక పోవడం నిజంగా విచారకరమే. టిడిపి ప్రభుత్వ హయాంలో వివేకానంద రెడ్డి చనిపోయారు. టిడిపిపై అపవాదు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందారు జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన తర్వాత కేసును తొక్కి పెట్టారు. ఐదేళ్లపాటు నిర్వీర్యం చేశారు. పోనీ కూటమి అధికారంలోకి వచ్చింది కదా అని భావిస్తే ఇప్పుడు కూడా కేసులో పురోగతి లేదు.
Also Read : ఆ సమయంలోనే జగన్ టార్చర్.. సంచలన అంశాలను బయటపెట్టిన బాలినేని!
* అప్పట్లో వ్యతిరేక ప్రచారం
2019 మార్చి 15న వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. అయితే నాడు ఇది రాజకీయ ప్రత్యర్థులు చేసిన హత్య అని ప్రచారం చేశారు. ఆ సీన్ క్రియేట్ చేశారు. ప్రతి ఏటా వర్ధంతి నాడు నివాళులు అర్పించేవారు. నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి ఏకంగా వివేకానంద రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. దానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించేవారు. అయితే టిడిపి హయాంలో సిబిఐ విచారణ( CBI enquiry) కావాలని కోరారు జగన్మోహన్ రెడ్డి. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ అవసరం లేదని తేల్చి చెప్పారు. కానీ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కొనసాగిస్తూ వచ్చారు.
* ముఖం చాటేసిన నేతలు
గత ఐదేళ్లుగా వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో వివేకానంద రెడ్డి వర్ధంతిలు, జయంతులు ఘనంగా జరిపించేవారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. కానీ ఈ ఏడాది మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా రాలేదు. వివేకానంద రెడ్డి కుమార్తె, అల్లుడు పులివెందులలో వివేకానంద రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో కొంతమంది మాత్రమే కార్యక్రమానికి హాజరయ్యారు. జగన్మోహన్ రెడ్డితో పాటు అవినాష్ రెడ్డితో సంబంధాలు ఉన్న ఒక్క కుటుంబ సభ్యుడు కూడా హాజరు కాలేదు. దీంతో వైయస్సార్ కుటుంబ అభిమానుల్లోనే ఒక రకమైన ఆవేదన వ్యక్తం అవుతోంది. వివేకానంద రెడ్డి హత్య వెనుక ఎవరు ఉన్నారో స్పష్టం అవుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు వివేకానంద రెడ్డి గుర్తున్నారు. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తుకు రాలేదు. కనీసం ఇటువైపుగా చూసేందుకు కూడా ఎవరూ సాహసించడం లేదు.