Vishaka : వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి వరుసగా షాక్ లు తప్పడం లేదు. ముఖ్యంగా విశాఖ నగరంలో ఆ పార్టీ బలం కోల్పోతోంది. మొన్నటికి మొన్న మేయర్ పదవిని కోల్పోయింది ఆ పార్టీ. తాజాగా డిప్యూటీ మేయర్ పదవిని కూడా కోల్పోయింది. డిప్యూటీ మేయర్ శ్రీధర్ పై కూటమి సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో శ్రీధర్ డిప్యూటీ మేయర్ పదవిని కోల్పోయారు. ఇటీవలే మేయర్ హరి వెంకట కుమారి తన పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి ఏప్రిల్ 28న ఎన్నికలు నిర్వహించనున్నారు. నాలుగు దశాబ్దాల తర్వాత తెలుగుదేశం పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకోనుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. స్థానిక సంస్థల్లో సైతం పట్టు కోల్పోతోంది. ఆ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.
Also Read : ఏపీకి కేంద్రం శుభవార్త.. మోడీ పర్యటనకు ముందే భారీగా నిధుల విడుదల!
* డిప్యూటీ మేయర్ పై నెగ్గిన అవిశ్వాసం..
మొన్న మేయర్( Mayor ) పదవిపై అవిశ్వాసం పెట్టారు కూటమి సభ్యులు. అది నెగ్గడంతో నిన్ననే డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం పెట్టారు. అవిశ్వాస తీర్మానానికి 74 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. 63 మంది కార్పొరేటర్లతో పాటు 11 మంది ఎక్స్ ఆఫీషియో సభ్యులు డిప్యూటీ మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో డిప్యూటీ మేయర్ శ్రీధర్ తన పదవిని కోల్పోయారు. 2021 లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 58 డివిజన్లతో అధికారంలోకి వచ్చింది. కానీ పదవీకాలం ఏడాది ఉండగా మేయర్ తో పాటు డిప్యూటీ మేయర్ తమ పదవులను వదులుకోవాల్సి వచ్చింది.
* ఇటీవల మేయర్ పై అవిశ్వాసం..
ఇటీవల మేయర్ పీఠాన్ని సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోల్పోయిన సంగతి తెలిసిందే. మేయర్ గా ఉన్న గొలగాని హరి వెంకట కుమారి పై( Hari Venkata Kumari ) కూటమి సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఓటింగ్ లో మూడింట రెండు వంతుల మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో మేయర్ పదవి నుంచి గోల గాని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీచేసింది. మరోవైపు విశాఖ మేయర్ స్థానంతో పాటుగా గుంటూరు మేయర్ స్థానానికి ఏప్రిల్ 28న ఎన్నికలు జరగనున్నాయి. గుంటూరు మేయర్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగటంతో ఆ పోస్ట్ కూడా ఖాళీ అయింది. గతంలో వాయిదా పడిన పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నికలతో పాటు తొలి మున్సిపల్ వైస్ చైర్మన్ స్థానాలకు అదే రోజు ఎన్నికలు నిర్వహించనున్నారు. తుని, కుప్పం మున్సిపల్ చైర్పర్సన్ స్థానాలకు.. మాచర్ల, తాడిపత్రి మున్సిపాలిటీలో మూడు వైస్ చైర్మన్ స్థానాలకు అదే రోజు ఎన్నికలు నిర్వహించేలా నోటిఫికేషన్ విడుదల చేశారు. 28న ఏ కారణంగా నైనా ఎన్నికలు జరగకపోతే ఆ మరుసటి రోజు నిర్వహిస్తారు.
* 28న అన్నింటికీ ఎన్నికలు..
పాలకొండ చైర్ పర్సన్, తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలకు సభ్యుల కోరంతో సంబంధం లేకుండా ఎన్నికలు జరపనున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో మున్సిపల్ చట్టం 2005 రూల్ 5 ప్రకారం.. మూడోసారి కోరంతో సంబంధం లేకుండా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ చట్టం ప్రకారం సమావేశానికి ముగ్గురు సభ్యులు హాజరైతే సరిపోతుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీచేసిన నోటిఫికేషన్ లోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో ఈసారి ఎన్నికలు జరగడం ఖాయమని తెలుస్తోంది.
Also Read : సజ్జల శ్రీధర్ ఎవరు? ఎందుకు అరెస్ట్ చేశారు? ఏం చేశాడు?