Visakhapatnam Vijayawada Metro Updates: ఏపీ ప్రభుత్వం( AP government) రెండు నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టును పట్టాలెక్కిస్తోంది. టెండర్లను ఖరారు చేసేందుకు ప్రయత్నాల్లో ఉంది. విజయవాడతో పాటు విశాఖలో మెట్రో ప్రాజెక్ట్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు భూ సమీకరణకు కూడా సిద్ధపడుతోంది ఏపీ ప్రభుత్వం. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి రూ.11,498 కోట్లు, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి రూ.10,118 కోట్లు మంజూరు చేశారు. ఈ మేరకు టెండర్ షెడ్యూల్ విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి మెట్రో ఫేజ్ 1 పనులను మూడేళ్ల కాల పరిమితిలో పూర్తి చేయాలని నిర్ణయించింది.
41 స్టేషన్లతో..
విశాఖపట్నం మెట్రో( Visakhapatnam Metro) రైలు మొదటి దశలో మూడు క్యారీడార్లలో 46.23 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం 99.75 ఎకరాల భూమి అవసరమని మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రతిపాదించి విశాఖ జిల్లా కలెక్టరేట్కు వివరాలను పంపింది. మొదటి దశ ప్రాజెక్టులో భాగంగా స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.40 కిలోమీటర్లు ఉండనుంది. అందులో 29 స్టేషన్లో ఉండనున్నాయి. తాటి చెట్ల పాలెం చిన్న వాల్తేరు మధ్య 6.75 కిలోమీటర్లు దూరం ఉండనుంది. మధ్యలో ఏడు స్టేషనులు ఉంటాయి. గురుద్వారా నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు 5.8 కిలోమీటర్ల మేర ఉంటుంది. మధ్యలో ఆరు స్టేషన్లు ఉండనున్నాయి.
34 స్టేషన్లతో..
విజయవాడ మెట్రో( Vijayawada Metro) రైలు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి 91 ఎకరాల భూమి అవసరమని ప్రతిపాదనలు చేసింది ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్కు ప్రతిపాదనలు పంపించారు. తొలి దశలో భాగంగా గన్నవరం నుంచి పిఎన్బిఎస్, పెనమలూరు నుంచి పిఎన్బిఎస్ కారిడార్ల నిర్మాణం చేపట్టనున్నారు. 26 కిలోమీటర్ల ఒకటో క్యారిడార్ గన్నవరం, యోగాశ్రమం, విమానాశ్రయం, వేల్పూరు, గూడవల్లి, చైతన్య కళాశాల, నిడమనూరు ఎంపీటీ సెంటర్ ప్రసాదంపాడు రామవరప్పాడు చౌరస్తా వరకు జాతీయ రహదారి మీదుగా వస్తుంది. రెండో క్యారీడర్ 12.5 కిలోమీటర్ల మేర ఉండనుంది. పిఎన్బిఎస్ నుంచి ప్రారంభమై బందరు రోడ్డు మీదుగా బెంజ్ సర్కిల్,ఆటోనగర్, కానూరు, పోరంకి మీదుగా పెనమలూరు వరకు కొనసాగనుంది. విజయవాడలో ఈ రెండు క్యారీడార్లలో మొత్తం 34 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.
Also Read: అందరి నోటా ‘అమరావతి’.. ఏం జరుగనుంది!
మూడేళ్లలో పనులు పూర్తి..
ఈ ప్రభుత్వానికి 2029 వరకు కాల పరిమితి ఉంది. అయితే 2028 లోగా తొలి దశ మెట్రో రైలు ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఆ మేరకు టెండర్లను ఖరారు చేసి పనులు ప్రారంభించాలన్న యోచనలో ఉంది. మరోవైపు భూసేకరణకు సంబంధించి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆ రెండు జిల్లాల కలెక్టరేట్లకు ప్రతిపాదనలు కూడా అందాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాయి మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి భూ సమీకరణ కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్న ఆలోచనలో ఉన్నారు. మొత్తానికి అయితే సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్నాయి.