Visakhapatnam And Vijayawada Metro Projects: ఏపీలో( Andhra Pradesh) మెట్రో ప్రాజెక్టులు పట్టాలెక్కే సమయం ఆసన్నమైంది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న విజయవాడ, విశాఖ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు కార్యరూపం దాల్చనున్నాయి. ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం రూ.21,616 కోట్లతో ఈ రెండు ప్రాజెక్టులను నిర్మించనున్నారు. కేంద్ర రాష్ట్ర,ప్రభుత్వాలు చెరో 50 శాతం నిధులతో వీటి నిర్మాణం చేపట్టనున్నాయి. 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టులను ప్రతిపాదించింది. అయితే అప్పట్లో ఎన్డీఏ నుంచి టిడిపి బయటకు రావడంతో ఈ ప్రతిపాదన మరుగున పడింది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు మెట్రో ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Also Read: కాంగ్రెస్ లో లేకున్నా నాకు సీఎం సీటు ఎందుకొచ్చిందంటే?.. బయటపెట్టిన రేవంత్
* టెండర్లకు సిద్ధం..
విశాఖతో( Visakhapatnam) పాటు విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తొలి దశలో విజయవాడ మెట్రో రైలు నిర్మాణం కోసం రూ.10,118 కోట్లు.. విశాఖ మెట్రో ప్రాజెక్టు కోసం రూ.11,498 కోట్లు కేటాయించింది. వాటికి సంబంధించి టెండర్లను ఆహ్వానించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ మెట్రో రైలుకు సంబంధించి వి ఎం ఆర్ డి ఏ నుంచి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.4,101 కోట్ల నిధులను మళ్లించునున్నారు. విజయవాడ మెట్రో కు సి ఆర్ డి ఏ నుంచి రూ. 3,497 కోట్ల నిధులను కేటాయించనున్నారు.
టెండర్లు పిలిచేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం.
* పక్క జిల్లాలకు కనెక్టివిటీ..
విశాఖకు సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు గోదావరి జిల్లాలకు( Godavari district ) కనెక్టివిటీ అధికంగా ఉంటుంది. ప్రస్తుతం రైల్వే మార్గం అందుబాటులో ఉంది. ఆపై రోడ్డు మార్గం కూడా ఉంది. కానీ మెట్రో రైలు ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్రవాసులకు రవాణా మరింత సులభతరం కానుంది. విజయవాడకు సంబంధించి ఇటు ఏలూరు తో పాటు అటు అమరావతి.. ఆపై గుంటూరుకు కనెక్టివిటీ చేస్తూ మెట్రో ప్రాజెక్టు అందుబాటులోకి రానందన్నమాట.
ఈ రెండు నగరాలు ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. విజయవాడకు సంబంధించి గుంటూరుకు.. అటు అమరావతిని కలుపుతూ ఈ మెట్రో రైలు ప్రాజెక్ట్ నిర్మితం కానుంది. విశాఖకు సంబంధించి విజయనగరం తో పాటు శ్రీకాకుళం వరకు.. ఇటు అనకాపల్లి వరకు ఈ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మించనున్నారు. మొత్తానికైతే ఎట్టకేలకు మెట్రో రైలు ప్రాజెక్ట్ సాకారం కానుండడం నిజంగా శుభ పరిణామం.