Visakha Municipal Corporation : విశాఖలో( Visakha Municipal Corporation ) కూటమి పార్టీల్లో విభేదాలు స్పష్టమయ్యాయి. టిడిపి, జనసేన ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు మారారు. నగరపాలక సంస్థకు సంబంధించి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో విభేదాలు స్పష్టంగా వెలుగు చూశాయి. పదవి కోసం నువ్వా నేనా అన్నట్టు రెండు పార్టీల కార్పొరేటర్లు విడిపోయారు. అటు ఎమ్మెల్యేలు సైతం ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. కోరం లేక డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గ్రేటర్ పీఠం టిడిపి చేతికి చిక్కింది. కానీ డిప్యూటీ మేయర్ పదవి విషయానికి వచ్చేసరికి సామాజిక సమీకరణ తెరపైకి వచ్చింది. ముఖ్యంగా యాదవ, కాపు సామాజిక వర్గాలు ఆ పదవి ఆశించాయి. అయితే అనూహ్యంగా రెడ్డిలకు కేటాయించడంతో ఆ రెండు సామాజిక వర్గాలకు చెందిన 15 మంది కార్పొరేటర్లు ఎన్నికలను బహిష్కరించారు. దీంతో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది.
Also Read : గ్రేటర్ విశాఖలో డిప్యూటీ మేయర్ చిచ్చు!
* ఎన్నికల్లో వైసీపీ గెలుపు..
2021 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 98 డివిజన్లకు గాను.. 48 చోట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక అంశాన్ని పెద్దపీట వేస్తూ యాదవ సామాజిక వర్గానికి చెందిన గొలగాని వెంకట హరి కుమారిని ఎంపిక చేసింది. అయితే రాష్ట్రంలో అధికారం మారడంతో చాలామంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కూటమి పార్టీల్లో చేరారు. అయితే నాలుగు దశాబ్దాల పాటు టిడిపికి మేయర్ పదవి దక్కకపోవడంతో ఆ పార్టీ చురుగ్గా పావులు కదిపింది. మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి దించేసింది. అయితే గొలగాని వెంకట హరి కుమారి యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత. ఆమె స్థానంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతకు అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది.
* కాపు సామాజిక వర్గం ఆగ్రహం..
మరోవైపు డిప్యూటీ మేయర్ పై( Deputy Mayor ) అవిశ్వాసం పెట్టి దించేశారు. ఆయన సైతం కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. ఆయన స్థానంలో కాపు సామాజిక వర్గానికి చెందిన టిడిపి కార్పొరేటర్ కు అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. అయితే డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు కేటాయించాలని ఆ పార్టీ విజ్ఞప్తి చేసింది. దీంతో ఆ పార్టీకి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే జనసేన నుంచి ఓ మహిళా కార్పొరేటర్ పేరు తెర పైకి వచ్చింది. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆ మహిళా కార్పొరేటర్ పేరు ప్రతిపాదించారు. అయితే అందుకు టిడిపి నుంచి అభ్యంతరాలు వచ్చాయి. దీంతో చివరిగా ఓ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్ పేరును ఖరారు చేశారు. దీంతో కాపు, యాదవ సామాజిక వర్గాలకు చెందిన 15 మంది కార్పొరేటర్లు ఎన్నికను బహిష్కరించారు.
Also Read : విశాఖలో కూటమి దూకుడు.. అవిశ్వాస తీర్మానానికి సై!
* ఆ రెండు సామాజిక వర్గాలు అధికం..
విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో కాపులతో( Kapu ) పాటు యాదవ సామాజిక వర్గం అధికం. ఇప్పటివరకు జీవీఎంసీలో ఆ రెండు సామాజిక వర్గాలకు ఎనలేని ప్రాధాన్యం దక్కుతూ వస్తోంది. కానీ ఆ రెండు వర్గాలకు ఉన్న పదవులను తొలగించి ఇతర సామాజిక వర్గాలకు కూటమి పెద్ద పీట వేస్తోంది. దీంతో ఆ రెండు సామాజిక వర్గాలు టిడిపి కూటమికి దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. విశాఖలో డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడడంపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు జరిగే ఎన్నికల్లో సజావుగా కూటమి అభ్యర్థి డిప్యూటీ మేయర్ ఎన్నికల చూడాలని ఆదేశాలు ఇచ్చారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు ప్రత్యేకంగా ఫోన్ చేసి దిశా నిర్దేశం చేశారు. మరి ఈరోజు ఎన్నిక జరుగుతుందా? తిరుగుబాటు కార్పొరేటర్లు మెత్తబడతారా? అన్నది చూడాలి.