YCP Social Media : సోషల్ మీడియా రాజ్యమేలుతున్న రోజులు ఇవి. ప్రతి రాజకీయ పార్టీ తన సోషల్ మీడియా వింగ్ ను బలపరుచుకుంటుంది. పార్టీ అనుబంధ విభాగాల కంటే సోషల్ మీడియాకి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ విషయంలో వైసిపి ముందు వరుసలో ఉంది. ఆది నుంచి ఆ పార్టీ సోషల్ మీడియాను నమ్ముకుంది. ఒకవైపు ఐప్యాక్ వ్యూహం, మరోవైపు సోషల్ మీడియా విభాగం పనితనంతో మంచి ఫలితాలను సాధించింది వైసిపి. 2014 ఎన్నికల్లో తృటిలో అధికారాన్ని చేజార్చుకుంది. అదే రూపుతో 2019 ఎన్నికల్లో మాత్రం ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ ఈ విజయం వెనుక మాత్రం సోషల్ మీడియా కృషి ఉంది. ఇది కాదనలేని సత్యం. వైసిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీ సోషల్ మీడియా విభాగానికి సేవలందిస్తున్నారు విజయసాయిరెడ్డి. కానీ గత ఐదేళ్లుగా ఆయనకు పక్కన పెట్టారు. దీంతో సోషల్ మీడియా వింగ్ వీక్ అయ్యింది. ఇప్పుడు తిరిగి మార్చాల్సిన పరిస్థితి ఎదురైంది. తిరిగి విజయసాయి రెడ్డికి ఆ బాధ్యతలు జగన్ కట్టబెట్టినట్లు ప్రచారం సాగుతోంది.
*మారిన నిర్ణయాలు
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ నిర్ణయాలు మారిపోయాయి. పార్టీలో కీలక నేతలబాధ్యతలను బదిలీ చేశారు. సోషల్ మీడియా విభాగానికి ఇన్చార్జిగా విజయసాయిరెడ్డి ఉండేవారు. ఆయన స్థానంలో సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవరెడ్డిని తెచ్చారు. పార్టీతో పాటు ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి హవా పెరిగింది. అదే సమయంలో సోషల్ మీడియా విభాగం పై ఆయన దృష్టి పడింది. దీంతో ఆ పీఠంపై సజ్జల భార్గవరెడ్డిని కూర్చోబెట్టారు. కానీ గత ఐదేళ్లలో సోషల్ మీడియా పరంగా ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదు అన్నది జగన్ అభిప్రాయం.
* సమీప బంధువుకు బాధ్యతలు
వైసీపీకి ఓటమి తర్వాత సోషల్ మీడియా వింగ్ తో పాటు ఐ ప్యాక్ టీమును తప్పించారని ప్రచారం జరిగింది. సజ్జల భార్గవరెడ్డిని తప్పించి.. విదేశాల్లో ఉన్న తన సమీప బంధువులకు జగన్ ఆ బాధ్యతలు అప్పగించినట్లు టాక్ నడిచింది. కానీ అది నిజం కాదు అని తేలింది. మరోవైపు సజ్జల భార్గవరెడ్డి సైతం స్థానికంగా అందుబాటు లేరని తెలుస్తోంది. కేసుల భయంతో ఆయన విదేశాలకు వెళ్లిపోయినట్లు అనుమానాలు ఉన్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి సైతం హైదరాబాదులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సజ్జల భార్గవరెడ్డి లేకపోవడంతో.. తిరిగి ఆ బాధ్యతలు ఎవరికి అప్పగించాలా అని జగన్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
* విజయసాయి రెడ్డి వైపు మొగ్గు
అయితే సోషల్ మీడియాను సక్సెస్ ఫుల్ గా నడిపిన విజయసాయి రెడ్డి అయితే సరిపోతారని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయ్ సాయి రెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించారు. తొలిత ఉత్తరాంధ్ర రీజినల్ బాధ్యతలను అప్పగించారు. తరువాత ఆ బాధ్యతలను కూడా తప్పించారు. ఎన్నికలకు ముందు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి టిడిపిలోకి వెళ్లిపోయారు. దీంతో అనివార్య పరిస్థితుల్లో విజయసాయిరెడ్డిని అక్కడి నుంచి బరిలో దించారు. అయినా సరే ఆయనకు ఓటమి ఎదురైంది. అందుకే ఇప్పుడు తిరిగి సోషల్ మీడియా విభాగాన్ని అప్పగించడం ద్వారా.. విజయసాయిని యాక్టివ్ చేయాలని జగన్ భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.