Vegetables Low Prices In AP: ఏపీ ప్రభుత్వం( AP government ) మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజలతో పాటు రైతులకు ప్రయోజనం కలిగించేలా ఒక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. ఈ రైతు బజార్ల ద్వారా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరతో పాటు ప్రజలకు తక్కువ ధరలు కూరగాయలు దొరికేలా చూడాలని భావిస్తోంది. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రైతు బజార్లను ప్రారంభించారు. ఇవి విజయవంతంగా నడిచాయి కూడా. మధ్యలో ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో వాటి నిర్వహణ కష్టంగా మారింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్లీ రైతు బజార్లపై దృష్టి పెట్టింది.
* ప్రతి నియోజకవర్గంలో..
సాధారణంగా నగరాలు, పెద్ద పట్టణాల్లోనే అప్పట్లో రైతు బజార్లను( rythu bazaars) ఏర్పాటు చేశారు. ప్రతి నగరంలో ఏర్పాటు చేసిన రైతు బజార్ విజయవంతం అయింది. అందుకే ఇప్పుడు ప్రధాన పట్టణాలతో పాటు ప్రతి నియోజకవర్గానికి ఒక రైతు బజారు మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. రైతులు కష్టపడి పండించిన కూరగాయలు, ఆకుకూరలకు మంచి గిట్టుబాటు ధరలు రావాలంటే రైతుబజార్లే ఉత్తమమని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే నగరాలు, పట్టణాల్లో రైతు బజార్లు కొనసాగుతున్నాయి. ఇకపై ప్రతి నియోజకవర్గంలో ఒక రైతు బజార్ విధిగా ఉండాలన్న ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. ఇందుకు సంబంధించి సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష కూడా చేశారు.
* ఆధునిక హంగులతో..
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 127 రైతు బజార్లు ఉన్నాయి. కొత్తగా మరో 80 రైతు బజార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది కూటమి ప్రభుత్వం( alliance government) . రైతు బజార్లు అనేవి రైతులకు, కొనుగోలుదారులకు ఉభయ తారకంగా ఉంటాయి. వినియోగదారులకు తక్కువ ధరలు కూరగాయలు దొరుకుతాయి. అందుకే వీటి సంఖ్యను పెంచాలని భావిస్తోంది ప్రభుత్వం. ఇప్పటివరకు రైతు బజార్లలో కూరగాయలు మాత్రమే విక్రయించేవారు. ఇకపై వాణిజ్య పంటలను కూడా అమ్మడానికి ప్రణాళికలు చేస్తున్నారు. దీనివల్ల రైతులకు మరింత ప్రయోజనం కలగనుంది. 1999లో ఉమ్మడి రాష్ట్రంలోనే సీఎం చంద్రబాబు రైతు బజార్లను ప్రారంభించారు. ఇప్పటికీ రైతు బజార్లు అంటే చంద్రబాబు పేరు చెబుతారు. అయితే తాజాగా కొత్త రైతు బజార్ల ఏర్పాటుపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఆధునిక హంగులతో ఈ బజారులను ఏర్పాటు చేయనుంది.