Vasireddy Padma: వైసిపికి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను నేరుగా సీఎం జగన్ కు పంపారు. వచ్చే ఎన్నికల్లో ఆమె టికెట్ ను ఆశించారు. తనకు కానీ.. తన భర్తకు కానీ అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కోరారు. కానీ అధినేత నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆమె కేవలం పదవికి రాజీనామా మాత్రమే చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో సామాన్య కార్యకర్తగా కొనసాగుతానని చెప్పుకొస్తున్నారు.
కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఆమె 2009లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశారు. పార్టీ వాయిస్ ను గట్టిగానే వినిపించారు. పిఆర్పి విలీనంతో కాంగ్రెస్ పార్టీలో కొద్ది రోజులు పాటు పనిచేశారు. వైసిపి ఆవిర్భావం నుంచి జగన్ వెంట అడుగులు వేశారు. ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు. 2014 నుంచి 19 వరకు వైసిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ వాయిస్ను బలంగా వినిపించ గలిగారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమితులయ్యారు. క్యాబినెట్ హోదాలో కొనసాగుతున్నారు. 2024 ఎన్నికల్లో టికెట్ ను ఆశించారు. ఇదే విషయాన్ని అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన లైట్ తీసుకున్నారు. ఇప్పటివరకు ప్రకటించిన జాబితాలో వాసిరెడ్డి పద్మకు చోటు దక్కలేదు. దీంతో మనస్థాపానికి గురైన ఆమె మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా ప్రకటించారు.
వాసిరెడ్డి పద్మ జగన్ అత్యంత నమ్మకమైన నేతల్లో ఒకరు. గత కొంతకాలంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఆమె భావిస్తున్నారు. కానీ ఛాన్స్ దక్కలేదు. మహిళా కోటాలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ఆశపడ్డారు. మైలవరం నుంచి కానీ జగ్గయ్యపేట నుంచి కానీ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ జగన్ అందుకు సమ్మతించలేదు. దీంతో ఆమె మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆమె పదవిని వదులుకున్నారని.. రాజ్యాంగబద్ధ పదవి కావడంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వీలులేదని.. అంతేతప్ప ఆమె మనస్తాపంతో రాజీనామా చేయలేదని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై వాసిరెడ్డి పద్మ ఫుల్ క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికైతే ఆమె రాజీనామా వైసీపీలో పెద్ద కలకలం సృష్టించింది.