Varudu Kalyani: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన అనారోగ్యానికి గురికావడం ఇటీవల రెండోసారి. గతంలో ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళన చేస్తున్న క్రమంలో సొంత నియోజకవర్గంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. సభలో మాట్లాడుతుండగానే ఆయన స్పృహ తప్పి పడిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రిలో చేర్పించి వైద్య సేవలు అందించారు. అప్పట్లోనే ఆయన రాజకీయాలనుంచి దూరమవుతారని ప్రచారం నడిచింది. కానీ మళ్ళీ యాక్టివ్ అయ్యారు. అయితే ఇటీవల మళ్ళీ ఆయన అనారోగ్యానికి గురికావడంతో హైదరాబాద్ తరలించారు. బ్రెయిన్ స్ట్రోక్ తో ఆయన బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయనపై విపరీతమైన స్ట్రెస్ పడడంతోనే అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. అందుకే వీలైనంతవరకు రాజకీయాలకు క్రమేపి దూరం కావాలని బొత్స భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఖమేనీ ఖతం.. ఇజ్రాయెల్, అమెరికా ఇకనైనా యుద్ధం ముగిస్తాయా?
* భారం తగ్గించేందుకు..
ప్రస్తుతం బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana ) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి శాసనమండలిలో నేతగా వ్యవహరిస్తున్నారు. శాసనసభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకున్న స్థాయిలో సంఖ్యాబలం లేదు. శాసనమండలిలో బలం ఉండడంతో వైసిపి పక్ష నేతగా బొత్స సత్యనారాయణ కు అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి. సీనియర్ నేత కావడంతో పాటు ఆజాతశత్రువుగా ఆయనకు పేరు ఉంది. ఆయన శాసనమండలిలో ఉంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ వినిపించవచ్చు అని భావించారు జగన్మోహన్ రెడ్డి. అయితే పూర్తి అనారోగ్యానికి గురికావడంతో ఆయనపై భారం తప్పించాలని కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డిని కోరినట్లు తెలుస్తోంది.
* కళ్యాణి వైపు మొగ్గు…
శాసనమండలిలో వైసిపి పక్ష నేత పదవి కోసం చాలామంది పోటీపడుతున్నారు. ప్రముఖంగా వైసీపీ ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, పివిపి సూర్యనారాయణ రాజు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే వీరిలో ఉత్తరాంధ్రాకు చెందిన వరుదు కళ్యాణి శాసనమండలిలో బలమైన వాయిస్ వినిపించ గలుగుతున్నారు. ప్రభుత్వంపై గట్టిగానే విమర్శలు చేస్తున్నారు. విధానపరమైన అంశాల్లో ప్రభుత్వాన్ని ఇరికించగలుగుతున్నారు. పైగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో ఆమెకు ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. అదే జరిగితే ఉత్తరాంధ్రకు గొప్ప గౌరవం దక్కినట్టే.