Vangaveeti Radhakrishna: విజయవాడ( Vijayawada) రాజకీయాల్లో ఒక సంచలనం చోటు చేసుకోనుందా? ఒక పొలిటికల్ బాంబు పేలనుందా? ఒక యువనేత రాజకీయ సన్యాసం చేయనున్నారా? ఈ రాజకీయాల్లో ఇమడలేకపోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ ఆ నేత ఎవరంటే వంగవీటి రాధాకృష్ణ. వంగవీటి మోహన్ రంగ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు రాధా. కానీ అనుకున్న స్థాయిలో రాజకీయాల్లో రాణించలేకపోతున్నారు. పరిస్థితులకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. రాజకీయ పార్టీలు ఆయనను వాడుకుంటున్నాయి తప్ప.. ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అందుకే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొని సాధారణ జీవితంతో సంతృప్తి చెందాలని రాధాకృష్ణ భావిస్తున్నట్లు సమాచారం.
Also Read: వాటాలు ఇవ్వాల్సిందే.. లేకుంటే కప్పం.. రామాయపట్నం పోర్టు నిర్మాణంలో టిడిపి ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు
* ఏపీ రాజకీయాల్లో సుస్థిర స్థానం
ఏపీ రాజకీయాల్లో వంగవీటి మోహన్ రంగాది( vangaveeti Mohan Ranga) ప్రత్యేక స్థానం. సామాజిక కార్యకర్తగా, అణగారిన వర్గాల ప్రతినిధిగా వంగవీటి మోహన్ రంగ విజయవాడకు సుపరిచితులయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలోనే గుర్తింపు పొందారు. ఇంటింతై వటుడింతై అన్న మాదిరిగా ఏపీ రాజకీయాలనే ప్రభావితం చేసే సమ్మోహన శక్తిగా మారారు. 1988లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండగా.. ఓ నిరసన దీక్షలో దారుణ హత్యకు గురయ్యారు. రంగా హత్య తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయానికి కారణమైంది.
* అన్ని పార్టీలది అదే పరిస్థితి..
అది మొదలు వంగవీటి మోహన్ రంగ పేరు రాజకీయంగా వినిపిస్తూనే ఉంది. కానీ రాజకీయ పార్టీలకు( political parties) ప్రయోజనం కల్పించిన ఆ పేరు.. ఆ కుటుంబానికి మాత్రం పనికి రాకుండా పోయింది. మోహన్ రంగ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వంగవీటి రాధాకృష్ణ.. రాజకీయ తప్పిదాలు కారణంగా పొలిటికల్ కెరీర్ ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. ఒకవైపు స్వీయ తప్పిదాలు, మరోవైపు రాజకీయంగా తనను వాడుకొని వదిలేయడంపై తీవ్ర ఆవేదనతో ఉన్నారు వంగవీటి. అందుకే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని చూస్తున్నారు.
* రాజశేఖర్ రెడ్డి వారించినా
వైయస్ రాజశేఖర్ రెడ్డి( y s Rajasekhar Reddy ) పిలుపుతో 2004లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు వంగవీటి రాధాకృష్ణ. ఆ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగు పెట్టారు. కానీ 2009లో ఆయన పొలిటికల్ గా తప్పటడుగులు వేశారు. చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చేరారు. రాజశేఖర్ రెడ్డి వద్దని వారిస్తున్నా వినలేదు. ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ ఎన్నికల్లో అదే పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో చేరే సరికి రాధాకృష్ణ ఒక సాధారణ నేతగా మిగిలిపోయారు.
* జగన్మోహన్ రెడ్డిని విభేదించి..
వైయస్ జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy )వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు ఆ పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీచేయాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు. కానీ వినకుండా టిడిపిలో చేరారు. ఐదేళ్లపాటు అదే పార్టీలో కొనసాగారు. 2024 ఎన్నికల్లో ఏదో ఒక చోట రాధాకృష్ణకు సర్దుబాటు చేస్తారని ప్రచారం నడిచింది. కానీ అలా చేయలేదు. అయినా సరే కూటమి తరుపున వంగవీటి రాధాకృష్ణ ప్రచారం చేశారు. కూటమి అధికారంలోకి రావడంతో రాధాకృష్ణకు తప్పకుండా పదవి దక్కుతుందని భావించారు. కానీ ఈ ఎమ్మెల్సీ పదవుల్లో కూడా రాధాకృష్ణ పేరును పరిగణలోకి తీసుకోలేదు.
* ఆత్మాభిమానంతో..
అయితే వంగవీటి( vangaveeti ) అన్న పేరు ప్రతి రాజకీయ పార్టీ వాడుకుంటోంది. ఆపై రాజకీయంగా తాను చేసిన స్వీయ తప్పిదాలతో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. అందుకే ఆత్మాభిమానంతో రాజకీయాల నుంచి తప్పుకోవడమే మేలన్న నిర్ణయానికి వంగవీటి రాధాకృష్ణ వచ్చినట్లు సమాచారం. మరోవైపు కుటుంబ సమస్యలు కూడా వెంటాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వంగవీటి రాధాకృష్ణ అనే నేత రాజకీయాలనుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటిస్తే మాత్రం.. అది ముమ్మాటికి వంగవీటి కుటుంబ అభిమానులకు నిరాశ కలిగించే అంశమే. మరి రాధాకృష్ణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Also Read:ఒక్కొక్కరికీ రూ.50 వేల నుంచి లక్ష.. డ్వాక్రా మహిళలకు రూ.35,000.. ఏపీలో పండగే!