Vanga Geetha : మాజీ ఎంపీ వంగా గీత( Vanga Geetha ) జనసేనలో చేరుతారా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారా? అందుకే సైలెంట్ గా వ్యవహరిస్తున్నారా? పిఠాపురం లో జరగనున్న జనసేన ప్లీనరీలో ఆ పార్టీలో జాయిన్ అవుతారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. 2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు గీత. ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోటీకి దిగారు. అప్పట్లో వంగా గీత విషయంలో పవన్ కళ్యాణ్ సానుకూల ప్రకటనలు చేశారు. ఆమె మంచి నాయకురాలని కొనియాడారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె జనసేనలో చేరుతారని కూడా అప్పట్లో ప్రకటించారు. ఇప్పుడు అదే నిజం అయినట్లు కనిపిస్తోంది.
Also Read : బిజెపికి ఒక ఎమ్మెల్సీ.. ఆ ముగ్గురిలో ఒకరికి ఛాన్స్!
* నేతలు క్యూ..
తాజాగా జనసేనలోకి ( Jana Sena ) భారీగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేరేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 14న జనసేన ప్లీనరీ పేరుతో కార్యక్రమ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆవేదికపై భారీగా చేరికలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కాకినాడ మాజీ ఎమ్మెల్యే పెండ్యం దొరబాబు జనసేనలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా కలుసుకొని పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అందుకు పవన్ కళ్యాణ్ సైతం అంగీకరించడంతో జనసేనలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు వంగా గీత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
* సుదీర్ఘ రాజకీయ నేపథ్యం
వంగా గీత సుదీర్ఘ రాజకీయాలు( long Political career ) చేశారు. 1985 లోనే రాజకీయ ఆరంగెట్రం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు.1995 నుంచి 2000 వరకు తూర్పుగోదావరి జిల్లా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా వ్యవహరించారు. 2000 నుంచి 2006 వరకు టిడిపి తరఫున రాజ్యసభ సభ్యురాలిగా కూడా ఎన్నికయ్యారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించడంతో ఆ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో పోటీ చేసి ఓడిపోయారు. 2019లో కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2024 ఎన్నికల్లో పవన్ పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు.
* సైలెంట్ వెనుక కారణం అదే..
సుదీర్ఘ రాజకీయ నేపథ్యంలో ఆమె ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారని ప్రచారం సాగుతోంది. పిఠాపురంలో( Pithapuram ) జనసేన ఆవిర్భావ సభ జరుగుతున్న సమయంలో ఆమె పొలిటికల్ గా సైలెంట్ గా ఉన్నారు. పెద్దగా కనిపించడం లేదు కూడా. కాపు సామాజిక వర్గానికి చెందిన ఈమె విషయంలో పవన్ కళ్యాణ్ ఆది నుంచి సానుకూలంగా ఉన్నారు. అందుకే ఆమె జనసేనలో చేరేందుకు దాదాపు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read : బొత్స స్మశానం కామెంట్స్.. అమరావతి రైతు ఫిర్యాదు!