Vallabhaneni Vamsi Family issue : ఆయనకాకుంటే మీరు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వినిపించే మాట ఇది. ఎవరైనా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు వివాదాల్లో చిక్కుకున్న సమయాల్లో.. కేసుల బారిన పడినప్పుడు వారి కుటుంబసభ్యులకు వైసీపీ నాయకత్వం నుంచి హామీలు వెళుతుంటాయి. ఆయన బదులు మీరు అంటూ నాయకత్వ బాధ్యతలు ఇస్తామని చెబుతుంటారు. అయితే ఇటువంటి హామీలు నేతల కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నాయి. తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ భార్య పంకజాశ్రీ విషయంలో ఇటువంటి ప్రచారమే నడుస్తోంది. ఆమె గన్నవరం నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తారని లీకులిస్తున్నారు. కానీ ఆమె చాన్స్ దక్కే అవకాశం లేదు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ నే అందరూ గుర్తుచేస్తున్నారు. తాజాగా బాపట్ల మాజీ ఎమ్మెల్యే నందిగం సురేశ్ సతీమణి విషయంలో జరిగిన ప్రచారం వెనుక వైఎస్సార్ కాంగ్రెస్ హామీ ఉన్నట్టు ప్రచార జరుగుతోంది.
Also Read : బంగాళాఖాతం నుంచి భారీ హెచ్చరిక..ఏపీలో ఆ జిల్లాలకు అలెర్ట్
అప్పట్లో దువ్వాడ విషయంలో..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై ఇటీవల వేటుపడింది. ఆయన కుటుంబ వివాదంతో పార్టీకి చెడ్డపేరు వస్తోందని భావించి ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ హైకమాండ్ ప్రకటించింది. అయితే 2024 ఎన్నికలకు ముందు నుంచే దువ్వాడ ఫ్యామిలీలో వివాదం జరుగుతునే ఉంది. అందుకే దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి పట్టుబడడంతో టెక్కలి నియోజకవర్గ ఇన్ చార్జిగా ఆమెకే బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల్లో టిక్కెట్ కూడా మీకేనంటూ స్పష్టం చేశారు. కానీ సరిగ్గా ఎన్నికలకు ముందు వైసీపీ టిక్కెట్ ను దువ్వాడ శ్రీనివాస్ కు కట్టబెట్టారు. దీంతో ఆ కుటుంబంలో వివాదం మరింత పెరిగింది. ఎన్నికల ఫలితాల తరువాత మరింత రచ్చకు కారణమైంది.
ఏకంగా హోంమంత్రినంటూ..
తాజాగా మాజీ ఎంపీ నందిగాం సురేశ్ భార్య బేబీలత విషయంలో ఇదే రకమైన హామీ వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ఫలితాల తరువాత నందిగాం సురేశ్ అరెస్టయిన సంగతి తెలిసిందే. మొన్న ఆ మధ్యన రిలీజ్ అయి.. ఇటీవల మళ్లీ జైలుపాలయ్యారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ సురేష్ తరపున ఆయన కేసులను వాదిస్తున్న ఓ మహిళా న్యాయవాది ఇటీవల ఆయన భార్య బేబీ లతకు( baby Lata ) ఫోన్ చేశారట. ఈ సందర్భంగా వారి మాటల మధ్యలో ఈసారి సురేష్ బదులుగా బేబీ లతకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని.. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాష్ట్ర హోం మంత్రి అవుతారంటూ ఆ న్యాయవాది చెప్పినట్లు ఆ ఆడియో లో ఉంది. అదే సమయంలో తాను సురేష్ తో ములాకత్ అయ్యేందుకు జైలుకు వెళ్ళగా.. అక్కడ గతంలో తనతో దురుసుగా వ్యవహరించిన ఓ సి ఐ కూడా ఇదే మాదిరిగా అన్నారని బేబీ లతా చెప్పుకొచ్చారు. మీరు కాబోయే హోం మంత్రి.. మమ్మల్ని గుర్తుపెట్టుకోండి అంటూ ఆ సీఐ తనతో చెప్పినట్టు బేబీ లత ఆడియోలో పేర్కొన్నారు.కానీ దీని వెనుక వైసీపీ నాయకత్వ హామీ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
వంశీకి ఇష్టం లేకుండా?
అయితే ఇప్పుడు వల్లభనేని వంశీమోహన్ కుటుంబంలో చిచ్చుపెట్టే విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ నిర్ణయం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ రోజు గన్నవరం నియోజకవర్గ పార్టీ శ్రేణుల సమావేశం మాజీ మంత్రి పేర్ని నాని అధ్యక్షతన జరగనుంది. ప్రధానంగా వంశీ భార్య పంకజాశ్రీకి నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చేందుకే ఈ సమావేశం అని తెలుస్తోంది. అయితే పంకజాశ్రీ రాజకీయాల్లోకి రావడం వంశీమోహన్ కు ఎంతమాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. పైగా తనపై నమోదైన కేసులకు వరుసగా బెయిల్లు వస్తున్నాయి. ఈ సమయంలో తనను ఇన్ చార్జిగా మార్చి భార్యకు ఇస్తామనడం ఎంతవరకు సమంజసమని వంశీమోహన్ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.