Uddanam : ఉద్దానం( uddanam) .. ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది పచ్చని చెట్లు.. చెంతనే సుదీర్ఘ సముద్రతీరం.. తివాచీ పరిచినట్టు ఉండే జీడి, కొబ్బరి చెట్లు. అచ్చం మరో కోనసీమలా ఉంటుంది ఈ ప్రాంతం. మనసుకు హాయి గొలిపేలా ఉంటుంది ఉద్దాన ప్రాంతం. ప్రకృతి పరంగా పరవశించి పోయేలా ఉండే ఈ ప్రాంతం.. కిడ్నీ భూతం మాత్రం వెంటాడుతూనే ఉంది. ప్రభుత్వాలు ఉపశమన చర్యలు చేపడుతున్నా ఉద్దానంలో మాత్రం మరణ మృదంగం కొనసాగుతూనే ఉంది. కిడ్నీ బాధితుల సంఖ్య క్రమేపి పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. డయాలసిస్ సదుపాయం కొద్దిమందికి అందుతుండడంతో.. మిగతావారు వైద్య సేవలు పొందే లోగా మృత్యువాత పడుతున్నారు. చికిత్స పొందుతున్న వారు సగటున రోజుకు ఇద్దరు, ముగ్గురు ప్రాణాలు కోల్పోతున్నారు. నెలకు 30 మందికి పైగా మృతి చెందుతున్నారు. కేవలం ఇది అధికారిక లెక్క మాత్రమే. కానీ ఉద్దానంలో ప్రతి గ్రామంలోనూ మరణాలు నమోదవుతున్నాయి.
Also Read : నిలిచిన ఆరోగ్యశ్రీ.. ఏపీలో ఆరోగ్య ఎమర్జెన్సీ..
* దశాబ్దాలుగా కిడ్నీ భూతం..
ఉద్దానంలో కిడ్నీ భూతం దశాబ్దాలుగా ఆందోళన కలిగిస్తూనే ఉంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి( y s Rajasekhar Reddy ) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉద్దానం కిడ్నీ వ్యాధులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అత్యున్నత బృందంతో సర్వే చేయించారు. కానీ ఎటువంటి ఫలితం తేలలేదు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చిన నేపథ్యంలో.. అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం పవన్ కళ్యాణ్ మాటలకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన ఉద్దానం కిడ్నీ వ్యాధులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అప్పటి టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎదుట కీలక ప్రతిపాదనలు చేశారు. అందుకు అంగీకరించింది అప్పటి చంద్రబాబు సర్కార్. కిడ్నీ బాధితులకు బాసటగా అనేక పథకాలను అందుబాటులోకి తెచ్చింది.
* శుద్ధ జలాల ప్లాంట్లు ఏర్పాటు..
ఉద్దానంలో కిడ్నీ వ్యాధులకు తాగునీరు ఒక కారణమన్నది ఒక విశ్లేషణ మాత్రమే. దానిని అనుసరించి ఉద్దానంలో 100కు పైగా శుద్ధ జలాల ప్లాంట్లను( water plants ) ఏర్పాటు చేసింది నాటి టిడిపి సర్కార్. ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల సర్వేకు అత్యున్నత బృందాన్ని ఏర్పాటు చేసింది. దానికి భారీగా నిధులు కేటాయించింది. కేవలం రెండు రూపాయలకే 20 లీటర్ల శుద్ధ జలాలను అందించింది. అంతటితో ఆగకుండా కవిటి, హరిపురం, సోంపేట సామాజిక ఆసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. టెక్కలి ఏరియా ఆసుపత్రి, పలాస కిడ్నీ పరిశోధన కేంద్రంలో సైతం ఈ డయాలసిస్ కేంద్రాలు కొనసాగుతున్నాయి. డయాలసిస్కు సంబంధించి 103 యంత్రాలు అందుబాటులోకి ఉంచారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం దయాలసిస్ పరిశోధనా కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇలా ప్రభుత్వాలు ప్రత్యేక వైద్య సేవలు ఇస్తున్నా.. ఉద్దానంలో మాత్రం కిడ్నీ బాధితుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
* రోజుకు ఒకరు చొప్పున మరణం..
ఈ డయాలసిస్ కేంద్రాల్లో ( dialysis centres )ప్రతిరోజు బాధితులు మృతి చెందుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఆరు కేంద్రాల్లో ఆరు నెలల్లో 174 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే సగటున రోజుకు ఒకరు మృత్యువాత పడ్డారన్నమాట. ఇది కూడా అధికారిక లెక్క. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇంతకుమించి డయాలసిస్ చేయించుకున్న వారు ఉన్నారు. వారితో కలుపుకుంటే ఉద్దానంలో మరణ మృదంగమే. వైసిపి హయాంలో పలాసలో ఏర్పాటు చేసిన కిడ్నీ పరిశోధనా కేంద్రంలో పూర్తిస్థాయిలో డయాలసిస్ వసతులు సమకూరలేదు. అంతకుముందు పలాస సామాజిక ఆసుపత్రిలో నెఫ్రో ప్లస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డయాలసిస్ యంత్రాలను పలాస కిడ్నీ పరిశోధనా కేంద్రంలో అమర్చి హడావిడి చేశారు. ప్రస్తుతం పలాస పరిశోధన కేంద్రంలో నెఫ్రాలజిస్ట్ సేవలు అందుబాటులో లేవు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్న ప్రస్తుత తరుణంలో.. గతంలో లేవనెత్తిన సమస్యపై దృష్టి సారించాల్సిన అనివార్య పరిస్థితి ఆయనపై ఉంది. అందుకే ఉద్దానం ప్రజలు ఈ సమస్యపై దృష్టి పెట్టాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read : అమరావతి కి గుడ్ న్యూస్.. రూ.4285 కోట్లు రిలీజ్!