Andhra Pradesh : ఏపీలో( Andhra Pradesh) మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయా? ఆ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి హామీ ఇచ్చింది. అవసరం మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు ఉంటుందని ప్రకటించింది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్న నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటు పై దృష్టి పెట్టాలని ఆ ప్రాంత ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు. రంపచోడవరం నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. రంపచోడవరంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి నుంచి పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ కు మద్దతుగా జరిగిన సమావేశంలో గుమ్మడి సంధ్యారాణి ఈ వ్యాఖ్యలు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రంపచోడవరం నియోజకవర్గం కలవడం వల్ల స్థానికులు అసౌకర్యానికి గురవుతున్నారని మంత్రి చెప్పుకొచ్చారు. రంపచోడవరం నుంచి పాడేరు కలెక్టరేట్ కు వెళ్లాలంటే 500 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని.. అందుకే ఈ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు గుమ్మిడి సంధ్యారాణి.
,* మార్కాపురం జిల్లా ఏర్పాటు?
మరోవైపు మార్కాపురం( Markapuram) జిల్లా ఏర్పాటుపై సైతం స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కామెంట్స్ చేశారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు కావడం ఖాయమని.. ఈ మేరకు రాష్ట్ర మంత్రి నారాయణ స్పష్టత ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తారని చెప్పుకొచ్చారు. మార్కాపురం జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. దీనిపై కూటమి ప్రభుత్వం సైతం సానుకూలంగా ఉంది. త్వరలో ఇందుకు సంబంధించి ప్రకటన రావచ్చని తెలుస్తోంది.
* జిల్లాల విభజన పై విమర్శలు
వైసీపీ( YSR Congress ) హయాంలో 13 ఉమ్మడి జిల్లాలను.. 26 జిల్లాలుగా విభజించారు. అప్పట్లో జిల్లాల విభజన హేతుబద్ధంగా జరగలేదన్న ఆరోపణలు ఉన్నాయి. పైగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విభజన చేయలేదన్న విమర్శలు కూడా వ్యక్తం అయ్యాయి. వాటిని పట్టించుకోకుండా వైసిపి సర్కార్ అప్పట్లో ముందుకు సాగింది. అయితే ఈ ఎన్నికలకు ముందు కూటమి చాలా జిల్లాల ఏర్పాటుకు హామీ ఇచ్చింది. అవి ఇప్పుడు తెరమీదకు వస్తున్నాయి. వాటి విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి కూటమి ప్రభుత్వంపై ఏర్పడింది. అయితే ఇప్పటివరకు రెండు జిల్లాల డిమాండ్ మాత్రమే ఉంది. అయితే కొన్ని జిల్లాల్లో మండలాల సర్దుబాటు, నియోజకవర్గాల సర్దుబాటు విషయంలో చాలా రకాల అభ్యంతరాలు ఉన్నాయి. వీటన్నింటిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం ఉంది.
* రెవెన్యూ డివిజన్లు సైతం
ఇంకోవైపు రెవెన్యూ డివిజన్ల ( revenue divisions )ఏర్పాటు విషయంలో సైతం కూటమి చాలా రకాలుగా హామీలు ఇచ్చింది. కానీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. కూటమి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతోంది. ఇప్పుడిప్పుడే పాలన గాడిలో పడుతోంది. ఈ తరుణంలోనే రెవెన్యూ డివిజనులతో పాటు జిల్లాల ఏర్పాటు చర్చకు వస్తోంది. అయితే ఇప్పట్లో అది జరిగే పని కాదని అధికారులు చెబుతున్నాయి. కానీ వీలైనంత త్వరగా జిల్లాల విభజన పూర్తి చేసి.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం.