Liquor Scam : జగన్( Jagan Mohan Reddy) మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక చిక్కులు ఎదురవుతూనే ఉన్నాయి. ఇటీవల విదేశీ పర్యటన ముగించుకుని జగన్ బెంగళూరు వచ్చారు. అక్కడినుంచి తాడేపల్లికి చేరుకున్నారు. పార్టీ శ్రేణులతో వరుసుగా రివ్యూలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వైసిపి హయాంలో జరిగిన మద్యం కుంభకోణం పై విచారణ కోసం చంద్రబాబు సర్కార్ సిట్ ను నియమించింది. దీనిపై ఉత్తర్వులు కూడా జారీచేసింది. అయితే ఇటువంటి సమయంలోనే జగన్మోహన్ రెడ్డి ఇంటికి సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించడాన్ని అనుమానిస్తోంది టిడిపి. తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానం టిడిపి నుంచి వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా మద్యం ఫైల్స్ తగులుబెట్టారన్నది అనుమానం. గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ కుంభకోణాలు బయటపడకుండా.. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చేసిన మాదిరిగానే.. ఇక్కడ కూడా మద్యం ఫైల్స్ దగ్ధం చేశారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.
* బయటపడిన కుంభకోణం
వైసిపి( YSR Congress ) ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీ మారింది. నేరుగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడిపింది. ఆ సమయంలో ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన కంపెనీలకు మాత్రమే మద్యం సరఫరా చేసి టెండర్ దక్కింది. దీని వెనుక భారీ గోల్మాల్ జరిగిందన్నది కూటమి ప్రభుత్వం అనుమానం. వైసిపి హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది కూటమి సర్కార్. ఇప్పుడు కూడా పెద్దిరెడ్డి కుమారుడిదే ప్రధాన పాత్ర అని సిఐడి దర్యాప్తులో తేలింది. మద్యం సరఫరా కంపెనీలతో సంప్రదింపులు, ముడుపుల చెల్లింపులకు అంగీకరించిన సంస్థలకే సరఫరా ఆర్డర్లు ఇచ్చారన్నది ప్రధాన ఆరోపణ. ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది ఏపీ సర్కార్. దీనికి సంబంధించి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ బృందానికి విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు నేతృత్వం వహిస్తున్నారు. రెండు వారాల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఈ బృందానికి గడువు విధించారు.
* కొద్ది గంటలకే
అయితే సిట్( special investigation team) ఏర్పాటుకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయిన తరువాత.. తాడేపల్లి లో జగన్ నివాసం సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించడం అనుమానాలకు తావిస్తోంది. అక్కడ పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో సెక్యూరిటీ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే దీనిపై ఆసక్తికరమైన అనుమానం వ్యక్తం చేస్తోంది టిడిపి. లిక్కర్ స్కాం లో సిట్ పడింది. రాత్రికి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడింది. ప్యాలెస్ బయట తగలబడిన కాగితాలు, డైరీలు ఏంటని ప్రశ్నిస్తోంది తెలుగుదేశం. మద్యం స్కాం కి సంబంధించి తాను రాసుకున్న లెక్కలు, డాక్యుమెంట్లు తగలబెట్టరా? అంటూ టిడిపి సెటైరికల్ గా ప్రశ్నిస్తోంది. బుధవారం సాయంత్రం ఘటన జరిగితే ఇప్పటివరకు తన ఇంటి ముందున్న సిసి పూటేజీ ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నిస్తోంది తెలుగుదేశం పార్టీ.
* వరుస ఘటనలతో
మరోవైపు జగన్( Jagan Mohan Reddy) ఇంటి పరిసరాల్లో ఈ ఘటన జరగడంపై వైసీపీలో ఒకరకమైన ఆందోళన కనిపిస్తోంది. ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఇంటి సమీపంలో రకరకాల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత నెల 23న మంత్రి లోకేష్ జన్మదినం. ఆరోజు జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు టిడిపి కార్యకర్తలు హల్చల్ చేశారు. ఆ ఘటన మరువక ముందే ఇప్పుడు అగ్ని ప్రమాదం సంభవించింది. ఇది ముమ్మాటికి విద్రోహ చర్యగా అనుమానిస్తోంది వైసిపి. టిడిపి మాత్రం మద్యం ఫైల్స్ దగ్ధం చేయడానికి వైసిపియే ఈ చర్యకు దిగిందని ఆరోపిస్తోంది. దీంతో టిడిపి, వైసీపీ మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. ఇది ఎంతవరకు తీసుకెళ్తుందో చూడాలి.