YS Viveka case : దేశంలోనే వివేకా హత్య కేసు హై ప్రొఫైల్ గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఎన్నో సంచలనాలకు వేదికగా మారుతోంది. ఈ కేసులో అరెస్టయిన నిందుతులు సైతం సీబీఐ దర్యాప్తులను టార్గెట్ చేస్తున్నారు. నేరుగా కోర్టులను ఆశ్రయిస్తున్నారు. దాని ప్రభావం దర్యాప్తుపై పడుతోంది. అయితే ఈ మొత్తం కేసులో ఎదురవుతున్న పరిణామాలన్నింటిపైనా వివేకా కుమార్తె సునీతారెడ్డి పోరాడుతున్నారు. తరచూ ఇంప్లీట్ పిటీషన్ వేస్తున్నారు. తాజాగా వివేకా పీఏ కృష్ణారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపైనా కూడా సునీత ఇంప్లీట్ పిటీషన్ వేశారు.
సుప్రీం కోర్టు ఆదేశాలతో సీబీఐ కొత్త సీట్ ను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. దీంతో గతంలో విచారణ చేపట్టిన వారిని సైతం దర్యాప్తునకు పిలిచారు. వారి నుంచి వివరాలు సేకరించారు. అలానే వివేకా పీఏ కృష్ణారెడ్డి తెరపైకి వచ్చారు. ఆయన్నుంచి సీబీఐ అధికారులు వివరాలు సేకరించారు. వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, ఆయన సోదరుడు భానుప్రకాష్ రెడ్డిలపై పలు అభియోగాలు మోపినట్టు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా సీబీఐ అధికారులు ఆ ముగ్గర్ని సైతం విచారించారు. అయితే అంతటితో ఆగని కృష్ణారెడ్డి నేరుగా మీడియాకే ఇంటర్వ్యూలిచ్చారు. సునీత దంపతులపై అనుమానం వ్యక్తం చేశారు. అవినాష్ రెడ్డిని ఇరికించేందుకు తనపై ఒత్తిడిచేశారని పేర్కొన్నారు.
అంతటితో ఆగని కృష్ణారెడ్డి ఈ కేసులో అసలు బాధితుడు తానేనని సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. దస్తగిరికి క్షమాభిక్ష రద్దు చేయాలని కోరారు.వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారి అసలు నిజాలు బయటపెట్టిన నిందితుడు దస్తగిరికి గతంలో సీబీఐ క్షమాభిక్ష పెట్టింది. దస్తగిరిని నిందితుడిగా కాకుండా అప్రూవర్ గా చూస్తూ ఆయనకు క్షమాభిక్ష పెట్టించిన సీబీఐ నిర్ణయంపై ఇతర నిందితులు మండిపడుతున్నారు. ఇప్పుడు అదే దస్తగిరిపై వివేకా పీఏ కృష్ణారెడ్డి పిటీషన్ వేయడం కేసులో కీలక మలుపు. అయితే ఈ పిటీషన్ పై విచారణ జరిపేందుకు సుప్రీం సిద్ధపడుతుంగా వివేకా కుమార్తె సునీత ఇంప్లీట్ పిటీషన్ వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కేసులో అసలు బాధితులు తాను, తన తల్లి సౌభాగ్యమ్మ మాత్రమేనని.. ఇంకెవరు కాదని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై సుప్రీం కోర్టు ఎలా రియాక్టవుతుందో చూడాలి మరీ.