TTD: తిరుమలకు( Tirumala) భక్తుల తాకిడి పెరుగుతోంది. వేసవి సెలవుల దృష్ట్యా భక్తుల రద్దీ పెరుగుతూ వస్తోంది. మేలో విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఇటువంటి తరుణంలో శ్రీవారికి ఏకాంత సేవలు తగ్గుతున్నాయి. అర్చకులు, పండితులు ఈ విషయంలో తాజాగా కీలక ప్రతిపాదనలు చేశారు. ఏకాంత సేవ సమయాన్ని పెంచాలని కోరుతున్నారు. ప్రతిరోజు దాదాపు 23 గంటలకు పైగా దర్శనాలు కొనసాగుతున్నాయి. అయినా సరే భక్తుల రద్దీ తగ్గడం లేదు. అయితే స్వామివారి ఏకాంత సేవలు తగ్గుతుండడంపై చర్చ సాగుతోంది. ఏకాంత సమయం పై ఇప్పుడు మార్పుల దిశగా టిటిడి కసరత్తు చేస్తోంది. కొన్ని కీలక మార్పులు చేయాలని భావిస్తోంది. అందుకు ప్రతిపాదనలతో సిద్ధంగా ఉంది టీటీడీ. వాటిని అమలు చేయడం ద్వారా స్వామివారి ఏకాంత సేవలను పెంచవచ్చని భావిస్తోంది.
Also Read: హై కమాండ్ సీరియస్ వార్నింగ్.. గంటా కింకర్తవ్యం!
తిరుమలలో స్వామివారు కునుకు తీయలేని విధంగా భక్తుల నిత్య దర్శనాలు కొనసాగుతున్నాయి. కనీసం స్వామివారికి సేద తీరే అవకాశం కూడా దొరకడం లేదు. దీంతో స్వామివారి ఏకాంత సమయాన్ని పెంచాలని అర్చక, పండిత బృందం టీటీడీ( Tirumala Tirupati Devasthanam) అధికార యంత్రాంగానికి కీలక సూచనలు చేసింది. రోజు వేకువ జామున సుప్రభాత సేవతో స్వామి నివేదికలు మొదలవుతాయి. సాధారణంగా స్వామివారి ఏకాంత సేవ రాత్రి 12 గంటల్లోపు చేయాలి. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత ఏకాంత సేవ జరుగుతోంది. అయితే క్రమేపీ ఏకాంత సేవ సమయం పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీనిని తగ్గించాలని వేద పండితులు సైతం సూచిస్తున్నారు.
* సుప్రభాత సేవతో నివేదికలు..
సాధారణంగా వేకువ జామున సుప్రభాత సేవతో( suprabhata Seva) స్వామి నివేదికలు మొదలవుతాయి. వేకువ జాము 2:30 గంటలకు మహా ద్వారం, వెండి వాకిలి, బంగారు వాకిలి తలుపులు తెరిచి మూడు గంటలకు సుప్రభాత సేవ నిర్వహిస్తున్నారు. సాధారణంగా రాత్రి 12 గంటల్లోపే ఏకాంత సేవ నిర్వహించాలి. అయితే గత పదేళ్లుగా ఈ సేవ నిర్వహణ సమయం అర్ధరాత్రి ఒంటిగంట దాటిపోతోంది. అప్పుడప్పుడు రెండున్నర గంటలకు సైతం ఏకాంత సేవలు నిర్వహించి తలుపులు మూస్తున్నారు. అక్కడ కుక్కుర్తి సమయానికే తిరిగి తెరిచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. అయితే క్యూ లైన్లు భారీగా ఉండి, కంపార్ట్మెంట్లలో గంటల తరబడి నిరీక్షిస్తున్న భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం చేయించాలనే ఉద్దేశంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది.
* 23 గంటలకు పైగా దర్శనాలు..
తిరుమలలో రోజుకు సగటున 23 గంటలకు పైగా స్వామివారి దర్శనాలు కొనసాగుతున్నాయి. అయితే ఇది సరికాదని.. గర్భాలయంలోని మూలమూర్తికి కనీసం గంట నుంచి గంటన్నర వరకు ఏకాంతం కల్పించాలని కొందరు పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. స్వామి వారి ఏకాంత సమయంలోనే దేవతలు భూలోకానికి వచ్చి శ్రీనివాసుడిని ఆరాధిస్తారని.. స్వయంగా బ్రహ్మదేవుడే వచ్చి పూజ చేస్తారని పురాణాల్లో ఉందని గుర్తు చేస్తున్నారు పండితులు. దేవతల ఆగమన సమయంలో మానవ సంచారం ఉండరాదని స్పష్టం చేస్తున్నారు. అందుకే దర్శనాల సమయాన్ని కుదించి.. ఏకాంత సమయాన్ని పెంచాలని అర్చకులు, కొందరు పండితులు కోరుతున్నారు.
* ఇప్పట్లో సాధ్యమేనా?
అయితే ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానానికి( TTD ) రద్దీ పెరుగుతోంది. సాధారణ రోజుల్లో సైతం స్వామివారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు. వస్తున్నది వేసవికాలం. పిల్లలకు సెలవులు కావడంతో ఎక్కువమంది తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. ఇటువంటి సమయంలో ఎంతో క్లిష్టంగా ఉంటుంది పరిస్థితి. సరిగ్గా ఈ సమయంలోనే టిటిడి కి పండితుల బృందం ఈ సూచన చేయడం విశేషం. పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా టిటిడి ఈ నిర్ణయాన్ని కొద్ది రోజులపాటు వాయిదా వేసుకునే అవకాశం ఉంది. అయితే మరి తప్పదు అంటే మాత్రం భక్తుల దర్శన సమయాన్ని కుదించే పరిస్థితి ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.