TTD Suspends Employees: టీటీడీ( Tirumala Tirupati Devasthanam) సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా వినిపిస్తున్న డిమాండ్ ను పరిగణలోకి తీసుకుంది. తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి ఇటీవల చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. టీటీడీలో అన్యమతస్తులు పనిచేస్తున్నారని గత కొన్నేళ్లుగా ఆరోపణలు ఉన్నాయి. వారిని తప్పించాలన్న డిమాండ్లు కూడా వచ్చాయి. తాజాగా బండి సంజయ్ కూడా ఇదే డిమాండ్ చేశారు. దీనిపై చర్చకు కారణమయ్యారు. సరిగ్గా ఇదే సమయంలో టిటిడి తాజాగా కీలక ఉత్తర్వులు జారీచేసింది. టీటీడీలో పని చేస్తున్న నలుగురు అన్యమత ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది టిటిడి. దీంతో టీటీడీలో పనిచేస్తున్న మిగతా వారిపై వేటు తప్పదని సంకేతాలు పంపించగలిగింది.
Also Read: ఏపీలో మద్యం కుంభకోణం.. ఎక్సైజ్ మంత్రికి సంబంధం లేదట!
ఆ నలుగురు ఉద్యోగులపై..
ప్రస్తుతం టీటీడీలో పనిచేస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్( Deputy Executive Engineer ) ఎలిజర్, బర్డ్ ఆసుపత్రిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్స్ రోసి, గ్రేడ్ వన్ ఫార్మసిస్ట్ ప్రేమావతి, వెంకటేశ్వర ఆయుర్వేద ఫార్మసీలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ జి అసంత తదితరులను తొలగిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ నలుగురు ఉద్యోగులు క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నారని.. అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్న నేపథ్యంలో సస్పెండ్ చేసినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. అయితే వీరే కాకుండా.. టీటీడీలో చాలామంది అన్యమతస్తులు పనిచేస్తున్నారని.. వారి సంగతి ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది.
ఎప్పటినుంచో ఆరోపణలు..
టీటీడీలో అన్య మతస్తులు పనిచేస్తున్నారని హిందూ ధార్మిక సంఘాలు ఎప్పటినుంచో ఆరోపిస్తూ వచ్చాయి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress )ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అన్యమతస్తుల నియామకాలు జరిగాయి అన్నది ప్రధాన ఆరోపణ. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరినీ తొలగించాలన్న డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా తిరుమల లడ్డు ప్రసాదం వివాదంలో ఇదే అంశం తెరపైకి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో వారందరినీ తొలగించాల్సిందే నన్న డిమాండ్ వినిపించింది. తాజాగా తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి బండి సంజయ్ ఈ విషయంలో టీటీడీ చొరవ చూపాలని కోరారు. ఆయన డిమాండ్ చేసిన అతి తక్కువ కాలంలోనే టీటీడీ ఈ చర్యలకు ఉపక్రమించడం విశేషం.
Also Read: కొత్త వివాదంలో ఎమ్మెల్యే కొలికపూడి!
టిటిడి స్పష్టమైన ప్రకటన..
తాజాగా నలుగురు అన్యమత ఉద్యోగస్తులపై చర్యలు తీసుకోవడం సంచలనంగా మారింది. వీరిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో టీటీడీ ఉద్యోగులుగా పని చేస్తూ.. సమస్త ప్రవర్తన నియమావళిని పాటించడం లేదని భావించడమే కాక.. హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తూ.. బాధ్యత రాహిత్యంగా వ్యవహరించినట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించి టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికను, ఇతర ఆధారాలను పరిశీలించిన తర్వాత.. శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ స్పష్టం చేసింది. అయితే మిగతా అన్యమతస్తులపై వేటు తప్పదని స్పష్టమైన సంకేతాలు పంపగలిగింది టీటీడీ. అయితే ఇది ఒక సంచలన నిర్ణయమే.