TTD Kiosk Machines: భక్తులకు టీటీడీ( Tirumala Tirupati Devasthanam) గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై లడ్డు ప్రసాదం సరఫరాను మరింత సులభతరం చేసింది. ప్రత్యేక కియోస్క్ యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. యూపీఐ చెల్లింపుల ద్వారా నగదు రహిత లావాదేవీలు జరుపుకోవచ్చు. కేవలం దర్శనం టికెట్ ఉన్నవారే కాదు.. లేనివారు సైతం ఈ యంత్రం ద్వారా లడ్డూలు పొందవచ్చు. లడ్డు ప్రసాదం కోసం భక్తులు పెద్ద ఎత్తున నిరీక్షించాల్సి వచ్చేది. దీంతో క్యూ లైన్ లలో భక్తులు ఇబ్బంది పడేవారు. దీనిని గుర్తించిన టిటిడి ఈ కొత్త విధానం ద్వారా ప్రసాదం సరఫరాకు నిర్ణయించింది. దీనిపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నారు.
Also Read: సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ 13 ప్రశ్నలు
* క్యూ లైన్ కష్టాలు లేకుండా..
ఇప్పటివరకు లడ్డుల కోసం భక్తులు క్యూ లైన్ లలో బారులు తీరేవారు. దీనిని మరింత సులభతరం చేయాలని టిటిడి భావించింది. అందుకే నూతన విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. కియోస్క్ యంత్రం( kiyosk machine) ద్వారా లడ్డూల పంపిణీకి నిర్ణయించింది. ఈ యంత్రం ఉపయోగించి యూపీఐ చెల్లింపుల ద్వారా.. నగదు లేకుండానే.. పారదర్శక లావాదేవీలు జరిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. లడ్డు విక్రయ కేంద్రాలకు సమీపంలో ఈ కియోస్క్ యంత్రం అందుబాటులో ఉంటుంది. ఈ యంత్రంలో రెండు ఆప్షన్లు ఉంటాయి. అందులో ఒకటి దర్శన టికెట్ ఉన్నవారు.. తమ ఆప్షన్ ను 1గా ఎంచుకోవాలి. ఆ తరువాత టిక్కెట్ వివరాలను యంత్రం ధృవీకరిస్తుంది. మరోవైపు టికెట్ లో ఉన్న వ్యక్తుల సంఖ్య ఆధారంగా.. ప్రతి వ్యక్తి రెండు అదనపు లడ్డూల వరకు కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. దర్శన టికెట్ లేనివారు ఆప్షన్ 2 ఎంచుకోవాలి. ఆ తర్వాత తమ ఆధార్ నెంబర్ ఇవ్వాలి. దర్శనం టికెట్ లేని వ్యక్తులు సైతం కియోస్క్ యంత్రం ద్వారా రెండు లడ్డూల వరకు కొనుగోలు చేయవచ్చు. ఆప్షన్ ఎంచుకున్న తర్వాత యూపీఐ ద్వారా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. లావా దేవి పూర్తి చేసిన తర్వాత రసీదు అందుతుంది. ఆ రసీదు తీసుకుని లడ్డు కౌంటర్ల వద్దకు వెళ్తే.. అక్కడ అదనపు లడ్డూలు పొందవచ్చు.
* కొనసాగుతున్న రద్దీ..
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగిసినా.. భక్తుల తాకిడి మాత్రం తగ్గలేదు. మరోవైపు టీటీడీకి భారీగా విరాళాలు వస్తున్నాయి. ఎస్ వి ప్రాణదాన ట్రస్టుకు( SV pranadana trust ) భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు అందజేశారు. బెంగళూరుకు చెందిన అగర్వాల్ ఇండెక్స్ ఫర్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు 20 లక్షల రూపాయలను విరాళంగా అందించింది. రాజస్థాన్ చెందిన ఏకే ఇంజనీరింగ్ కంపెనీ సైతం ఎస్.వి ప్రాణదాన ట్రస్టుకు పది లక్షల రూపాయలను విరాళంగా అందించింది. తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగానే ప్రసాదం పంపిణీకి కియోస్క్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది. వీటిని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తోంది.
Also Read: జగన్ వీరాభిమానికి ‘ఏపీపీఎస్సీ’ పదవి