APPSC: వైఎస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ నేతలతో జాగ్రత్తగా ఉండాలని టిడిపి హైకమాండ్ సూచిస్తోంది. పార్టీలో విభేదాలు సృష్టించేందుకు వారు ప్రయత్నిస్తారని.. చేరికల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని హై కమాండ్ సూచిస్తోంది. కానీ కీలక నియామకాల విషయంలో మాత్రం వైసిపి మద్దతు దారులకు ప్రాధాన్యమిస్తోంది. ఇది బయట నుంచి వస్తున్న ఆరోపణ కాదు. స్వయంగా పార్టీ శ్రేణులు చేస్తున్న ఆరోపణ ఇది. తాజాగా ఏపీపీఎస్సీ సభ్యుడిగా సి శశిధర్ నియామకం పై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వస్తున్నాయి. వైసిపి వీరాభిమానికి ఎలా పదవి ఇస్తారని టిడిపి సోషల్ మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఇది పార్టీకి షాకింగ్ పరిణామంగా ఎక్కువ మంది అభివర్ణిస్తున్నారు. ఏపీపీఎస్సీ సభ్యుడు అంటే చాలా పెద్ద పదవి. దీని నియామకం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేయగలదు. తొలగింపు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు. అటువంటి పదవి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వీరాభిమానికీ ఎలా ఇస్తారు అని ప్రశ్నిస్తున్నాయి టిడిపి శ్రేణులు.
Also Read: సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ 13 ప్రశ్నలు
* వైసిపి హయాంలో రిజిస్ట్రార్ గా..
అనంతపురం జేఎన్టీయూ( Ananthapuram JNTU ) మాజీ రిజిస్ట్రార్ ఈ శశిధర్. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలోనే ఆయన రిజిస్ట్రార్ గా నియమితులయ్యారు. అయితే ఆది నుంచి శశిధర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డి పట్ల సానుకూలంగా వ్యవహరించేవారు. అప్పట్లో అవకాశం దొరికినప్పుడల్లా వైసీపీ ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తేసేవారు. అంతటితో ఆగకుండా టిడిపి నిర్ణయాలను తప్పు పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉద్యోగులకు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం హెల్త్ స్కీమ్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దేశంలోనే అత్యున్నత పథకం అంటూ శశిధర్ కొనియాడారు కూడా. బడ్జెట్ కేటాయింపులపై సైతం ప్రత్యేక హర్షం వ్యక్తం చేసేవారు. ప్రైవేటు వేదికల్లో అయితే జగన్మోహన్ రెడ్డితో కలిసి ఫోటోలకు దిగేవారు. కేవలం జగన్మోహన్ రెడ్డి వీరాభిమాని కావడంతోనే అప్పట్లో జేఎన్టీయూ రిజిస్టర్ గా భర్తీ చేశారని ఒక ప్రచారం అయితే ఉంది.
* హేమ చంద్రారెడ్డి అనుచరుడుగా..
అప్పటి ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డికి( hemachandra Reddy ) శశిధర్ అనుచరుడిగా పేరుంది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మూడు రాజధానులకు మద్దతుగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పాలనా వికేంద్రీకరణకు మూడు రాజధానులు ఉండాల్సిందేనని శశిధర్ స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. లక్షల కోట్లు వెచ్చించి నిర్మించేలా రాజధాని సరికాదు అంటూ హెచ్చరించారు. అమరావతి ప్రాంతంలో పర్యటించానని.. అక్కడ బేస్మెంట్ కి ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉందని.. అమరావతి అభివృద్ధి చెందాలంటే కనీసం 30 సంవత్సరాలు పడుతుందని స్వయంగా సాక్షి మీడియాలో ఇంటర్వ్యూలో చెప్పినట్లు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియోలు దర్శనమిస్తున్నాయి.
* టిడిపి శ్రేణుల అభ్యంతరాలు
ఏపీపీఎస్సీ( APSSC) లాంటి పెద్ద పదవి జగన్మోహన్ రెడ్డి అభిమానికి ఇవ్వడం ఏమిటనేది టిడిపి శ్రేణుల నుంచి వినిపిస్తున్న మాట. శశిధర్ నియామకం వెనుక ఎలాంటి కసరత్తు చేయలేదని.. అతని బ్యాగ్రౌండ్ చూడకుండా ఎలా నియమిస్తారని ఎక్కువమంది ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంలో ఏదో జరుగుతోందని.. కుట్రలు జరుగుతున్నాయని ఎక్కువమంది అనుమానిస్తున్నారు. సాధారణంగా ఏపీపీఎస్సీకి విద్యారంగం, ఇతరత్రా రంగాలకు చెందిన నిష్ణాతులనే సభ్యులుగా నియమిస్తారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత అడ్డగోలు నియామకాలు ప్రారంభం అయ్యాయి. వైయస్సార్ కాంగ్రెస్ విద్యార్థి విభాగంలో పనిచేసిన సలాం బాబును గత ప్రభుత్వం సభ్యుడిని చేసింది. మరోవైపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి సిఫారసు చేసిన వ్యక్తి ఏపీపీఎస్సీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ సానుభూతిపరులను నియమించుకోవడంలో తప్పులేదు. కానీ ఇప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ని విపరీతంగా అభిమానించే ఓ వ్యక్తిని తీసుకువచ్చి ఏపీపీఎస్సీ సభ్యుడిగా చేయడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.
Also Read: వైసీపీకి చెందిన వారికి ఎలాంటి పనులు చెయ్యొద్దు..
