TTD Ghee Controversy: తిరుమల లడ్డూ వివాదం కేసు విచారణ పూర్తయింది. నెల్లూరు ఏసీబీ కోర్టులో( Nellore ACB Court ) నివేదిక అందించింది ప్రత్యేక దర్యాప్తు బృందం. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో తిరుమల లడ్డు తయారీకి వినియోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని సాక్షాత్ సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీంతో లక్షలాదిమంది భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఇటువంటి అంశాన్ని నేరుగా సీఎం చంద్రబాబు ప్రకటించడం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమైంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం కాకుండా.. సిబిఐ నేతృత్వంలోని సిట్ ఏర్పాటు చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటయింది. సుదీర్ఘ విచారణ అనంతరం 600 పేజీల చార్జ్ షీట్ నెల్లూరులోని ఏసీబీ కోర్టుకు ఇటీవల సమర్పించింది. ఈ ఘటనకు సంబంధించి ఏకంగా 36 మందిని నిందితులుగా చేర్చింది. ఇందులో డైరీ నిర్వహకులతో పాటు టీటీడీ మాజీ ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం ఈ నివేదిక ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగినట్లు సిట్ నివేదిక తేల్చింది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన వింత వాదనతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తోంది.
* సంచలన అంశాలు వెలుగులోకి..
కోర్టుకు సమర్పించిన నివేదికలో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. అసలు లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసి బోలే బాబా డైరీ( Bhole Baba diary ) ఆవులు లేవని.. నెయ్యి తయారీలో పాలనే ఉపయోగించలేదని ప్రత్యేక దర్యాప్తు బృందం స్పష్టం చేసింది. పామాయిల్ లో వివిధ రకాల రసాయనాలు కలిపి నెయ్యి పోలిన మిశ్రమం తయారు చేశారని.. దానిని ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీల ద్వారా తిరుమలకు సరఫరా చేస్తారని సిట్ దర్యాప్తులో నిర్ధారణ అయింది. దాదాపు 68 లక్షల కిలోల కల్తీ మిశ్రమంతో 20 కోట్ల శ్రీవారి లడ్డూలను తయారు చేసినట్లు సిట్ నివేదికలో పేర్కొంది. ఈ కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించి రూ.251 కోట్ల వరకు చెల్లింపులు జరిగినట్లు సిట్ తన చార్జ్ షీట్ లో స్పష్టంగా పేర్కొంది. దీనికి సంబంధించి 36 మందిని నిందితులుగా చేర్చింది.
* వైసిపి వితండ వాదన..
మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress )పార్టీ దీనిపై వితండ వాదన చేస్తోంది. అసలు చంద్రబాబు చెప్పింది ఏంటి? తేలింది ఏంటి? అనే ప్రశ్న వేస్తోంది. చంద్రబాబు జంతు కొవ్వు కలిపారని ఆరోపించారని.. మరి సిట్ మాత్రం జంతువు ప్రస్తావన చేయలేదని గుర్తు చేస్తోంది. ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ఎలా ఆరోపించారు అంటూ చంద్రబాబును ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే దర్యాప్తు బృందం మాత్రం కల్తీ జరిగిందని స్పష్టమైన ఆధారాలు సేకరించి కోర్టు ముందు పెట్టింది. దీనిపైనే టిడిపి తో పాటు జనసేన దృష్టిపెట్టాయి. కల్తీ జరిగిందని స్పష్టంగా చెబుతుంటే.. లాజిక్కులు మాట్లాడుతున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కూటమి నేతలు విరుచుకుపడుతున్నారు. జంతు కొవ్వు అంశాన్ని కాస్త పక్కన పెడితే.. నెయ్యి కల్తీ జరిగిందన్నది మాత్రం నిజమేనని సిట్ రిపోర్ట్ తేల్చింది.