Homeఆంధ్రప్రదేశ్‌TTD Crowd Management : ఎన్ని ప్రభుత్వాలు మారినా.. ‘తిరుమల రద్దీ’ సమస్యకు పరిష్కారమే లేదా?

TTD Crowd Management : ఎన్ని ప్రభుత్వాలు మారినా.. ‘తిరుమల రద్దీ’ సమస్యకు పరిష్కారమే లేదా?

TTD Crowd Management  : అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు..తిరుమల వేంకటేశ్వరుడు దర్శనానికి నిత్యం భక్తులు పోటెత్తుతారు. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. ప్రత్యేక పర్వదినాల్లో అయితే చెప్పనవసరం లేదు. వేసవి, సంక్రాంతి, దసరా సెలవుల సమయంలో సైతం తిరుమల రద్దీగా మారుతోంది. అయితే ఏ ప్రభుత్వం ఉన్నా భక్తుల కష్టాలు మాత్రం తీరడం లేదు. గంటలు, రోజుల తరబడి క్యూలైన్ లో వేచి ఉండక తప్పని పరిస్థితి. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి టీటీడీ పాలకవర్గాలు మారుతున్నాయి. భక్తుల సౌకర్యార్ధం కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కానీ అవి సత్ఫలితాలనివ్వలేదు. అన్నింటి కంటే ముఖ్యంగా విఐపీ, వివిఐపీ బ్రేక్ దర్శనాల పుణ్యమా అని సామాన్య భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో తిరుమలలో భారీగా రద్దీ ఉంది. గత 20 రోజులుగా క్యూలైన్లు నిండిపోయి వైకుంఠం క్యూకాంప్లెక్స్ కు దాటి బయట భక్తులు వేచి ఉండడం కనిపిస్తోంది.

Also Read : ఏపీ మెగా డీఎస్సీ 2025: హాల్‌ టికెట్లు విడుదల.. ఆన్‌లైన్‌ పరీక్షల వివరాలివీ

సిఫారసు లేఖలతోనే అధికం..
మరోవైపు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలకు టీటీడీ అనుమతివ్వడంతో.. దాదాపు సిఫారసు లేఖలతో వచ్చిన వారే అధికం. దీంతో సామాన్య భక్తులకు దర్శనాలు అలస్యమవుతున్నాయి. గంటల తరబడి క్యూలైన్లలో భక్తులు ఉండిపోతున్నారు. ఇటీవల భక్తులు హాహాకారాలు చేసిన సందర్భాలున్నాయి. క్యూలైన్లలోనే టీటీడీ అధికారులు, చైర్మన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇటీవల ఓ యువకుడు క్యూలైన్లలో నిల్చున్న భక్తులు పడుతున్న ఇబ్బందులను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అది విపరీతంగా వైరల్ అవుతోంది. విమర్శలకు తావిస్తోంది. ఎప్పటికప్పుడు టీటీడీ అధికారులు సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. కానీ ఆ స్థాయిలో మాత్రం తిరుమలలో భక్తులకు వసతులు మెరుగుపడం లేదు.

సెలవులు ముగస్తుండడంతో..
వేసవి సెలవులు కావడంతో గత పది రోజులుగా తిరుమలలో ఎక్కువగా రద్దీ కనిపిస్తోంది. మరో 12 రోజుల్లో వేసవి సెలవులు ముగుస్తుండడంతో ఆ ప్రభావం అధికంగా ఉంది. కొండపై భక్తులు రద్దీ పెరగడంతో టీటీడీ రంగంలోకి దిగింది. క్యూలైన్లలో తోపులాటలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే ప్రస్తుతం 70 నుంచి 80 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. వీకెండ్ లో అయితే భక్తుల సంఖ్య 90 వేల మందికి దాటుతోంది. దీంతో పరిస్థితి అదుపు తిప్పుతోంది. కానీ ఈ పరిస్థితి వస్తుందని ముందే గ్రహించలేకపోతోంది టీటీడీ పాలకవర్గం. ఆ స్థాయిలో ఏర్పాట్లు చేయలేకపోతోంది. దీంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు.దీంతో టీటీడీ సేవలపై భక్తులు బాహటంగానే విమర్శలు చేస్తున్నారు.

ఎక్కడ చూసినా భక్తులే..
ప్రస్తుతం వైకుంఠం క్యూకాంప్లెక్స్2,నారాయణగిరి షెడ్ భక్తులతో పూర్తిగా నిండిపోయింది. అలాగే ఏటీసీ,ఏటీజీహెచ్,క్రిష్ణతేజ గెస్ట్ హౌస్, టీబీసీ, రింగ్ రోడ్డు మీదుగా శీలాతోరణం వరకూ భక్తులు వేచి ఉంటున్నారు. క్యూలైన్లలో తాగునీరు , వసతి ఏర్పాటుచేశామని టీటీడీ చెబుతోంది. కానీ వేలు, లక్షలుగా తరలివస్తున్న భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడంలో టీటీడీ విఫలమవుతోంది. కనీసం ఎంతమంది భక్తులు వస్తున్నారు? ప్రత్యేక పర్వదినాల్లో వారి సంఖ్య ఎంత పెరుగుతోంది? వంటి అంచనాలకు రాలేకపోతోంది. వాటికి తగ్గట్టుగా వసతులు కల్పిస్తే భక్తులకు అసౌకర్యం తగ్గుతుంది. కానీ అటువంటి ఆలోచన చేయలేకపోతున్నట్టు వైఫల్యాలు తెలియజేస్తున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి. పాలకవర్గాలు మారుతున్నాయే తప్ప..టీటీడీలో భక్తుల అవస్థలు అలానే కొనసాగుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version