Tree plantation scam: కోట్ల మొక్కలు నాటినట్టు.. కనికట్టు.. ఈ స్కాంలో తప్పు ఎవ్వరిది?

రాష్ట్రవ్యాప్తంగా 13 వేల పంచాయతీల్లో 1.37 కోట్ల మొక్కలు నాటినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఒక్కో మొక్క నాటేందుకు, రెండేళ్ల పాటు సంరక్షించేందుకు రూ. 500 వరకు ఖర్చు చేశారు.

Written By: Dharma, Updated On : October 2, 2023 2:32 pm
Follow us on

Tree plantation scam: ఉపాధి హామీ పథకం.. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇదో వరంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నియంత్రించేందుకుగాను ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆశయం మంచిదే అయినా.. కానీ అధికారంలో ఉన్న సొంత పార్టీ శ్రేణులకు ఇదో వరంగా మారుతోంది. ముఖ్యంగా మొక్కల పెంపకంలో భారీ గోల్ మాల్ జరుగుతోంది. ఏపీలో అయితే కోట్ల మొక్కల పెంపకం వెనుక.. వందల కోట్ల రూపాయల కైంకర్యం జరిగింది. ఈ పాపం మీదంటే మీది అని వైసిపి, తెలుగుదేశం పార్టీలు పరస్పరం నిందించుకుంటున్నాయి. కానీ వందల కోట్ల ప్రజాధనం వృధా అయ్యింది. దానికి జవాబు దారి కరువైంది.

రాష్ట్రవ్యాప్తంగా 13 వేల పంచాయతీల్లో 1.37 కోట్ల మొక్కలు నాటినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఒక్కో మొక్క నాటేందుకు, రెండేళ్ల పాటు సంరక్షించేందుకు రూ. 500 వరకు ఖర్చు చేశారు. ఈ లెక్కన సరాసరి రూ. 650 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.అయితే ఇప్పుడు లక్షల్లోనే మొక్కలు బతికాయని చూపుతుండడం విశేషం. కానీ ఈ పాపం మీదంటే మీదేనంటూ తెలుగుదేశం, వైసీపీలు ఆరోపించుకుంటున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మొక్కల పెంపకంలో భారీగా అవకతవకలు ఉన్నాయని జగన్ సర్కార్ ఆరోపిస్తుంది. దీనిపై కేసులు పెట్టేందుకు సిద్ధపడుతోంది. ఈ తరుణంలో ఎల్లో మీడియా ఒక కథనాన్ని ప్రచురించింది. గత ప్రభుత్వ హయాంలో నాటిన మొక్కలు చనిపోవడానికి వైసిపి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని చూపుతోంది. వైసీపీ కార్యకర్తలే దోచుకున్నారని.. సోషల్ ఆడిట్ వ్యవస్థ డమ్మిగా మారిందని.. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అస్సలు పట్టించుకోవడం లేదనేది ఈ కథనం సారాంశం.

తాజాగా నెల్లూరు జిల్లాలో ఓ గ్రామస్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గ్రామంలో 3000 మొక్కలు నాటినట్లు చూపి సర్పంచ్ పన్నెండు లక్షల రూపాయలు పక్కదారి పట్టించారని గ్రామస్తులు ఆరోపించారు. గతంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా ఉన్న వ్యక్తి సర్పంచ్ గా ఎన్నికయ్యారు. 3000 మొక్కలు నాటినట్లు చూపించారు. కానీ ఒక్క మొక్క కూడా బతికిన దాఖలాలు లేవు. సదరు సర్పంచ్ వైసీపీ నాయకుడు కావడంతో అధికారులు చర్యలకు వెనకడుగు వేస్తున్నారు. దీంతో ఈ విషయం వెలుగులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.అయితే తెలుగుదేశం పార్టీ హయాంలోనే మొక్కల పేరిట భారీగా అవినీతి చోటుచేసుకుందని వైసిపి ఆరోపిస్తోంది.

2018లో 17.34 కోట్ల మొక్కలు నాటినట్లు తెలుస్తోంది. అయితే తాజా గణాంకాల ప్రకారం అందులో 1.53 కోట్ల మొక్కలు మాత్రమే బతికున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ మొక్కలు ఎవరి హయాంలో చనిపోయాయి అన్నది తెలియాల్సి ఉంది.2019లో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మొక్కల సంరక్షణ బాధ్యత ఆ ప్రభుత్వమే చూసుకోవాలని తెలుగుదేశం చెబుతోంది. అయితే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే మొక్కలు నిర్వీర్యమైపోయాయని.. చనిపోయిన మొక్కలకు మేము ఎలా సంరక్షిస్తామని వైసిపి నేతలు చెబుతున్నారు. 2021 లో వైసీపీ ప్రభుత్వం 12.82 కోట్లు మొక్కలు నాటినట్లు రికార్డుల పేర్కొన్నారు. అందులో 6.98 కోట్లు మొక్కలు
మాత్రమే బతికున్నట్లు రికార్డుల్లో చూపుతున్నారు.2022లో 53.45 కోట్లు మొక్కలు నాటగా.. 38.80 కోట్లు మొక్కలు బతికినట్లు తెలుస్తోంది. అయితే ఈ మొక్కల పెంపకం మాటున భారీగా ఉపాధి హామీ నిధులు పక్కదారి పడుతుండడం విమర్శలకు తావిస్తోంది. వైసిపి, టిడిపిలో తీరుపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.