Kurnool Bus Fire Accident: జీవితమంటే నీటి బుడగ ప్రాయమని వెనుకటికి ఓ కవి పేర్కొన్నాడు. కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం ఆ కవి రాసిన మాటలకు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. బస్సు ప్రమాదంలో ఒక కుటుంబం లో తీరని విషాదం నెలకొంది. అనేక కష్టాలు పడి.. ఆర్థికంగా అవాంతరాలు ఎదుర్కొని.. దేశం గాని దేశం వెళ్లిపోయి.. మస్కట్ అనే ప్రాంతంలో స్థిరపడితే.. చివరికి విధి వారి జీవితాన్ని వెంటాడింది. హాయిగా సాగిపోతున్న కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది.
మస్కట్ ప్రాంతంలో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రాంతానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తి తన భార్య సంధ్యతో కలిసి ఉంటున్నాడు. ఇతడు అక్కడ ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడికి కుమార్తె, కుమారుడు సంతానం. కుమార్తె బెంగళూరులో ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. కుమారుడు ఐఐటీలో చదువుతున్నాడు. ఇటీవల దీపావళి సెలవులకు ఆనంద్ తన కుటుంబంతో కలిసి వచ్చాడు. దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు. ఆ తర్వాత అతడు మస్కట్ బయలుదేరి వెళ్లిపోయాడు. వాస్తవానికి అతనితోపాటు భార్య సంధ్య కూడా రావాల్సి ఉండేది. ఆ సమయానికి ఆమెకు జ్వరం రావడంతో తీసుకువెళ్లడం కుదరలేదు.. కుమార్తె ను బెంగళూరులో దింపి.. తాను అక్కడ నుంచి మస్కట్ వెళ్లాలని సంధ్య భావించింది. కుమారుడు కూడా తాను ఐఐటీ చదువుతున్న ప్రాంతానికి వెళ్లిపోయాడు.
తన కుమార్తెను బెంగళూరులో దింపి రావడానికి వేమూరి కావేరి ట్రావెల్స్ సంస్థకు చెందిన బస్సులో టికెట్ బుక్ చేసింది సంధ్య. వారిద్దరూ పటాన్చెరువు ప్రాంతంలో ఆ బస్సు ఎక్కారు. అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదంలో సంధ్య, ఆమె కూతురు దుర్మరణం చెందారు. ఈ విషయం తెలిసిన ఆనంద్ గుండెలు పగిలేలా రోదించాడు. వెంటనే మస్కట్ నుంచి బయలుదేరి ఇండియాకు వచ్చాడు. ఆయన కుమారుడు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నాడు. మస్కట్ ప్రాంతంలో తెలుగువారి ఉన్నతికి ఆనంద్ సహకరించేవారు. అందరిని ప్రేమతో పలకరించేవారు. సంధ్య కూడా అలానే ఉండేది. మస్కట్ ప్రాంతంలో తెలుగు సమాజ అభివృద్ధికి సంధ్య చేసిన కృషిని అక్కడి తెలుగువారు మర్చిపోలేకపోతున్నారు. అంతేకాదు ఆనంద్, ఆయన కుమారుడు వల్లభ్ కు ధైర్య వచనాలు చెబుతున్నారు. ఎవరు ఎలాంటి ధైర్య వచనాలు చెప్పినా.. అవి తాత్కాలికం మాత్రమే. ఎందుకంటే వారిద్దరూ లేని లోటు ఆనంద్ కు ఎవరూ తీర్చలేరు. ఆ బాధను ఎవరూ పూడ్చ లేరు.