Tomato Price: ఏపీలో కూరగాయల ధరలు మండుతున్నాయి. ముట్టుకుంటే షాక్ కొట్టేలా ధరలు ఉన్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. అవసరానికి తగ్గట్టు ఉత్పత్తి లేకుండా పోయింది. అదే ధరల పెరుగుదలకు కారణమైంది. మరి ముఖ్యంగా టమాటా ధర ఆకాశాన్ని అంటుతోంది. ఇప్పటికే సెంచరీని కొట్టేసింది. కిలో టమాటా ధర 100 రూపాయల పై మాటే. కన్నీరు పెట్టిస్తోంది. దీంతో కూరగాయలు కొనలేక.. సగటు జీవి ఇబ్బందులు పడుతున్నాడు. ఇటువంటి తరుణంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూరగాయల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో.. రాయితీపై ఉల్లి, టమాటాలు విక్రయించేందుకు నిర్ణయించింది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న రైతు బజార్లలో రాయితీపై ఉల్లి, టమాటాలను విక్రయించునున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెనాయుడు సచివాలయం తో అధికారులతో సమీక్షించారు. ధరల నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. సగటు మధ్య తరగతి జీవికి ఇబ్బందులు కలగకుండా ఉండాలన్న మంత్రి… ఉల్లి, టమాటాలను రాయితీపై అందించాలని అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లోని రైతు బజార్లలో వెంటనే టమాట, ఉల్లిపాయల విక్రయాలు ప్రారంభించాలని స్పష్టం చేశారు.
* భారీ వర్షాలే కారణం
గత నెలలో ఏపీలో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. కృష్ణ, గోదావరి నదులు పొంగి ప్రవహించడంతో వరద బీభత్సం సృష్టించింది. ఈ తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా కూరగాయల పంటలు పాడయ్యాయి. ఉత్పత్తి కూడా తగ్గింది. ఈ క్రమంలోనే కూరగాయల ధర పెరుగుతూ వస్తోంది. కిలో ఉల్లి 55 రూపాయల నుంచి 70 రూపాయల వరకు పలుకుతోంది. టమాటా ధర 100 రూపాయలు దాటుతోంది. దీంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. అసలే పండగ సీజన్ కావడంతో ఇప్పుడు అదనపు భారం పడుతోంది. అందుకే ధరలు అదుపులోకి వచ్చే వరకు రాయితీపై ఉల్లి, టమాటాలను విక్రయించాలని మంత్రి ఆదేశించారు.
* మార్కెటింగ్ శాఖ ఏర్పాట్లు
మరోవైపు మార్కెటింగ్ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు. రైతుల వద్ద నుంచి టమాటా, ఉల్లి నేరుగా కొనుగోలు చేసి రైతు బజార్లలో అమ్మకాలు చేయనున్నారు. కిలో టమాట 50 రూపాయలకే విక్రయించనున్నారు. అటు ఉల్లి ధరను సైతం 40 రూపాయలుగా నిర్ణయించారు. ఇప్పటికే అన్ని రైతు బజార్లకు సరుకు అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. రాయితీపై వాటి పంపిణీ ప్రారంభించనున్నారు.