TTD  Laddu issue : కొంపముంచిన ల్యాబ్ రిపోర్ట్.. తిరుపతి లడ్డూ విషయంలో అడ్డంగా బుక్కైన చంద్రబాబు సర్కార్

ప్రస్తుతం తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారం పెను సంచలనాలకు కారణమవుతోంది. తిరుమల పవిత్రతకు దెబ్బతీసేలా లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వును వాడారని చంద్రబాబు ఆరోపించారు. అప్పటినుంచి రగడ ప్రారంభమైంది.

Written By: Dharma, Updated On : September 20, 2024 1:22 pm

TTD  Laddu issue

Follow us on

TTD  Laddu issue : తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో పెద్ద రగడ నడుస్తోంది. వైసిపి ప్రభుత్వ హయాంలో ఈ లడ్డూల తయారీని జంతువుల కొవ్వుతో తయారు చేశారన్నది ప్రధాన ఆరోపణ. నిన్ననే దీనిని బయట పెట్టారు ఏపీ సీఎం చంద్రబాబు. అడ్డగోలు నిర్ణయాలతో టీటీడీ పవిత్రతను దెబ్బతీశారని కూడా ఆరోపణలు చేశారు. చివరకు భక్తుల అన్న ప్రసాదాల విషయంలో కూడా కల్తీ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటినుంచి వివాదం నడుస్తూనే ఉంది. దీనిపై టీటీడీ మాజీ చైర్మన్లు స్పందించారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణానికి కూడా సిద్ధపడ్డారు. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. అయితే ఓ ల్యాబ్ రిపోర్ట్ లో బయటకు వచ్చిన అంశాలనే తాము ప్రస్తావించామని టిడిపి నేతలు చెబుతున్నారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో పాటుగా అభ్యంతరకర పదార్థాలు ఉన్నాయంటూ ల్యాబ్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. దానినే ప్రస్తావిస్తున్నారు టిడిపి నేతలు. అయితే అవి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాంపిళ్లు అని.. దానికి వైసిపి ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తుంది అన్నది వారి నుంచి వినిపిస్తున్న మాట. ఇది ముమ్మాటికీ చంద్రబాబు సర్కార్ చేసిన కుట్ర అని తిరిగి ఆరోపిస్తున్నారు. అనుకూల మీడియా కూడా అలానే చెబుతోంది. ఆ ల్యాబ్ రిపోర్ట్ లో తేదీలను పరిశీలిస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాతవి కనిపిస్తున్నాయని చెబుతున్నారు. దీంతో ఈ అంశం యూ టర్న్ తీసుకుంటోంది. తిరిగి కూటమి ప్రభుత్వం పైనే ప్రచారం ప్రారంభమైంది.

* అప్పటి నుంచి వివాదం
తిరుమల శ్రీవారి లడ్డూ అంటే శుభ్రతకు మారుపేరు. సువాసనలతో ఉండే ఈ లడ్డూను ఇట్టే పోల్చవచ్చు. అయితే ఈ లడ్డూ మునుపటి రుచి కానీ.. సువాసన కానీ.. నాణ్యత కానీ లేవన్న ఆరోపణలు ఉన్నాయి. హిందూ ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్ దాస్ తొలిసారిగా ఈ లడ్డూ ప్రసాదం నాణ్యతను ప్రశ్నించారు. నాణ్యత తగ్గడానికి నెయ్యి కారణమని ఆరోపించారు. అప్పట్లోనే ఈవో దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఇదొక ప్రాధాన్యత అంశంగా మారిపోయింది.

* ల్యాబ్ రిపోర్ట్ లో సంచలనం
లడ్డూ తయారీకి వినియోగిస్తున్న నెయ్యి నాణ్యమైందా? లేదా? అని తెలుసుకునేందుకు గుజరాత్ లోని ఎన్డిడీబీకి చెందిన అనుబంధ ల్యాబ్ కు పంపించారు. జూలై 8న పంపగా.. వాటి రిపోర్టు అదే నెల 16న వచ్చింది. తమిళనాడుకు చెందిన కంపెనీ అందిస్తున్న నెయ్యిలో భారీగా కల్తీ జరిగినట్లు స్పష్టం చేసింది. దీంతో తమిళనాడుకు చెందిన సంస్థ నుంచి నెయ్యి సర్ఫరాను నిలిపివేశారు. మిగతా సంస్థలను నాణ్యత పాటించాలని హెచ్చరించారు. నందిని సరఫరాను పునరుద్ధరించారు.

* దాంతోనే అనుమానాలు
అయితే వైసిపి హయాంలో నెయ్యి సరఫరా సంస్థను మార్చడం ఈ అనుమానాలకు బలం పెరిగింది. దేశంలోనే గుజరాత్ ఆనంద్ డైరీ తర్వాత అంతటి పేరు ప్రతిష్టలు ఉన్న సంస్థ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్. ఈ ఫెడరేషన్ నందిని బ్రాండ్ పేరిట నెయ్యిని సుదీర్ఘకాలం టీటీడీకి సరఫరా చేసింది. కేఎంఎఫ్ సరఫరా చేసే నెయ్యి నాణ్యతాపరంగా పేరు మోసింది. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కేఎంఎఫ్ టీటీడీకి నెయ్యి సరఫరాను కొనసాగించింది. అయితే 2023లో మాత్రం ఉన్నపలంగా నీ సరఫరాను నిలిపివేశారు. అటు తరువాత సరఫరా అయిన నెయ్యిలో నాణ్యత లోపం బయటపడినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ల్యాబ్ పరిశీలనకు పంపిన తేదీలు.. రిపోర్టు వచ్చిన తేదీలు పరిశీలిస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే జరిగాయన్న విషయాన్ని వైసిపి అనుకూల మీడియా తెరపైకి తెస్తోంది. తప్పు జరిగి ఉంటే కూటమి ప్రభుత్వ హయాంలో జరిగేదని.. జూన్లో అధికారం నుంచి దూరమైన వైసీపీకి ఎలా అంటగడతారు అన్నది వారి నుంచి వినిపిస్తున్న మాట. అయితే ఇప్పటికే దీనిపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.