Pawan Kalyan: 2019లో కమ్ బ్యాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వరుస చిత్రాలు ప్రకటించారు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో చిత్రాల్లో ఆయన నటించారు. హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాల షూటింగ్ పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ మూడు చిత్రాలు కొంత మేర షూటింగ్ జరుపుకున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమయ్యే క్రమంలో పవన్ కళ్యాణ్ షూటింగ్స్ కి విరామం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. జనసేన 100 శాతం స్ట్రైక్ రేట్ తో 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంది.
పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఎన్నికలయ్యాక పవన్ కళ్యాణ్ తిరిగి షూటింగ్స్ లో పాల్గొంటారని నిర్మాతలు భావించారు. కానీ ప్రజా సేవలో తలమునకలైన పవన్ కళ్యాణ్ కి సమయం దొరకడం లేదు. ఎన్నికలు ముగిసి మూడు నెలలు అవుతున్నా ఆయన మేకప్ వేసుకోలేదు.
ఇటీవల పవన్ కళ్యాణ్ షూటింగ్ కి సిద్ధమయ్యారు. అంతలోనే ఏపీలో వరదలు సంభవించాయి. అధికారులతో సమీక్షలు, వరద బాధితుల సహాయక చర్యల్లో బిజీ అయ్యారు. దాంతో మరల బ్రేక్ పడింది. వరద ప్రభావం తగ్గింది. పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తిరిగి షూటింగ్ లో పాల్గొనబోతున్నారట. ముందుగా ఆయన హరి హర వీరమల్లు మూవీ సెట్స్ లో జాయిన్ కానున్నారట.
హరి హర వీరమల్లు సెట్స్ పైకి వెళ్లి చాలా కాలం అవుతుంది. దర్శకుడు క్రిష్ ఈ ప్రాజెక్ట్ వదులుకున్నారు. కొత్త దర్శకుడు రంగంలోకి దిగాడు. ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో హరి హర వీరుమల్లు నిర్మిస్తున్నారు. యాభై శాతానికి పైగా షూటింగ్ పూర్తి అయినట్లు సమాచారం. వీలైనంత త్వరగా హరి హర వీరమల్లు కంప్లీట్ చేసే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారట.
అనంతరం ఓజీ షూటింగ్ సైతం పూర్తి చేయాలనేది పవన్ కళ్యాణ్ ఆలోచనట. గ్యాంగ్ స్టర్ డ్రామాగా దర్శకుడు సుజీత్ ఓజీ తెరకెక్కిస్తున్నాడు. డివివి దానయ్య నిర్మాతగా ఉన్నారు. దానయ్య నుండి కూడా పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ తో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నారు. హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. వచ్చే ఏడాది పవన్ కళ్యాణ్ నటించిన ఈ మూడు చిత్రాలు థియేటర్స్ లోకి రానున్నాయని సమాచారం.