Tirupathi : ఏపీలో( Andhra Pradesh) రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. ఇందుకు తిరుపతి వేదిక అయ్యింది. శ్రీ వెంకటేశ్వర గోశాలలో 100 గోవులు చనిపోయాయని టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇది రాజకీయ రచ్చకు కారణం అయ్యింది. ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ తరుణంలో ఎస్ వి గోశాలను సందర్శించాలని టిడిపి ఎమ్మెల్యేలు కరుణాకర్ రెడ్డిని ఫోన్లో కోరారు. అన్ని విధాలుగా ప్రభుత్వ పరంగా భద్రత కల్పిస్తామని.. గోశాలను సందర్శించాలని వారు కోరారు. దీంతో ఆయన గోశాలకు వెళ్లేందుకు సిద్ధపడ్డారు. అదే సమయంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు.
Also Read : 30 ఏఎంసీలకు కమిటీలు.. జనసేన కు ఛాన్స్.. బిజెపికి ఒకటి!
* ఫేక్ అని తేల్చిన టిటిడి..
గత పది నెలల కాలంలో గోశాలలో 100 ఆవులు చనిపోయాయని ఆరోపించారు కరుణాకర్ రెడ్డి( Karunakar Reddy ). అయితే ఆ స్థాయిలో ఆవులు చనిపోలేదని.. అదంతా ఫేక్ ప్రచారం అని టిటిడి కొట్టి పారేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదని తేల్చింది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే టీటీడీ గోశాలలో భారీగా ఆవులు చనిపోయాయని ఆరోపించడం ప్రారంభించారు. అదే సమయంలో టీటీడీ కూడా ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. ఆ ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది. అయితే టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం మాత్రం నడుస్తోంది.
* ఉదయానికే గోశాలకు ఎమ్మెల్యేలు..
టీటీడీ గోశాలలో( TTD goshala) 100 గోవులు చనిపోయాయి అని ఆరోపించిన కరుణాకర్ రెడ్డి దానిని నిరూపించాలని టిడిపి సవాల్ చేసింది. దీంతో కరుణాకర్ రెడ్డి సైతం సై అన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం టిడిపి ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, పులివర్తి నాని, కలికిరి మురళీమోహన్, నవాజ్ బాషలు ఫోన్ చేసి ఎస్ వి గోశాలను సందర్శించాలని కరుణాకర్ రెడ్డిని కోరారు. తాము ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎస్పీతో సమన్వయం చేసుకుంటామని.. సందర్శనకు వస్తే భద్రత సైతం కల్పిస్తామని వారు హామీ ఇచ్చారు. పోలీసుల సూచనల మేరకు ఐదుగురితో రావాలని సూచించారు.
* సవాళ్లు, ప్రతి సవాళ్లు
అయితే గత రెండు రోజులుగా కరుణాకర్ రెడ్డి సవాల్ విసురుతూనే ఉన్నారు. ఏకంగా టిడిపి ఎమ్మెల్యేలు( TDP MLAs) పిలిచేసరికి వస్తానని చెప్పారు. బయలుదేరుతున్నట్లు సమాచారం ఇచ్చారు. దీంతో తిరుపతి గోశాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అయితే అంతకుముందు పోలీసులు అనుమతిస్తేనే తాను గోశాలకు వస్తానని చెప్పారు కరుణాకర్ రెడ్డి. అయితే తాము కరుణాకర్ రెడ్డి కి ఎటువంటి ఆంక్షలు పెట్టలేదని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. వ్యక్తిగత భద్రతా సిబ్బందితో కలిసి గోశాలను సందర్శించేందుకు అనుమతి ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఎటువంటి గృహనిర్బంధం చేయలేదని.. ఆయనను అడ్డుకోమని చెప్పారు.
* పోలీసుల కీలక సూచనలు..
అయితే పరిస్థితి ఒక్కసారి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కీలక సూచనలు చేశారు. రెండు పార్టీల నేతలు ఒకేసారి గోశాలకు వెళ్లవద్దని సూచించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం సూచనలు చేసినట్లు తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఎపిసోడ్ తో తిరుపతిలో ఉద్రిక్తత కనిపిస్తోంది. అధికారపక్షంతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం దూకుడుగా ఉండడంతో ఉత్కంఠ నెలకొంది. ముందు జాగ్రత్తగా పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.
Also Read : విశాఖ జోన్ గెజిట్ కు ఒడిశా అడ్డంకి!