TTD Udayaastamanu Seva : తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతి హిందువు ఎంతో ఆసక్తి చూపుతారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్న ఒక్కసారైనా శ్రీవారిని దర్శించుకోవాలని పరితపిస్తారు. ఒక్క క్షణమైనా వెంకటేశ్వరుడిని కల్లారా చూసేందుకు ఆశ పడతారు. ఉచిత దర్శనం నుంచి ప్రత్యేక దర్శనం వరకు..ఎన్నో రకాల ఆర్జిత సేవలు అందుబాటులోకి ఉన్నాయి. రోజంతా స్వామివారి దర్శనానికి ఓ సేవ ఉంది. అదే శ్రీవారి ఉదయాస్తమాన సేవ. ఈ సేవకు అక్షరాల కోటి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సేవను దక్కించుకుంటే జన్మ ధన్యమైనట్లే. సాధారణంగా తిరుపతి వెళ్లే భక్తులు ముందుగానే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుంటారు. ప్రత్యేక దర్శనానికి సంబంధించి టికెట్లు ఉన్నాయో? లేవు చూసుకుంటారు. సర్వదర్శనాలతో పాటు దివ్యదర్శనాలు, నిత్య, వార పూజలు, ప్రత్యేక సేవలు చాలానే అందుబాటులో ఉన్నాయి. అయితే వాటన్నింటిలోనూ ఎంతో విశేషమైనది ఉదయాస్తమాన సేవ.
* అందరూ భక్తులే
సామాన్యుడి నుంచి సంపన్నుడు వరకూ అన్ని వర్గాల ప్రజలు శ్రీవారి భక్తులే. అయితే ఎవరి సామర్థ్యం, శక్తి కొలది తిరుమల వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటారు. ఈ క్రమంలోనే ఏడాది పొడవునా ఆర్జిత సేవలను అందుబాటులోకి తెచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. నిత్యం శ్రీవారికి ఎన్నో కైంకర్యాలను నిర్వహిస్తారు. ఉదయం సుప్రభాతం నుంచి సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ వరకూ ప్రతిదీ ఇక్కడ ప్రత్యేకమే. అందుకే ఈ సేవల కోసం ప్రత్యేకంగా టికెట్లు కూడా కేటాయించారు. అయితే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు.. సకల సేవలో పాలుపంచుకుని.. రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీనివాసుడి సకల వైభోగాలను తిలకించే భాగ్యాన్ని ఈ ఉదయస్తమాన సర్వసేవను టీటీడీ అందుబాటులోకి తెచ్చింది.
* తొలిసారిగా 1980లో
ప్రపంచంలోనే హిందూ ధార్మిక ఆలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. నిత్యం లక్షలాదిమంది భక్తులు తరలి వస్తారు. స్వామి వారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో తొలిసారిగా 1980లో ఉదయస్తమాను సేవ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ సేవకు సైతం విపరీతంగా పోటీ ఉండడంతో మధ్యలో నిలిపివేశారు. 2021లో మళ్లీ పునరుద్ధరించారు. అయితే శ్రీ పద్మావతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి కోటి రూపాయలు పైన విరాళాలు అందించే భక్తులకు ఉదయాస్తమాను సేవ టిక్కెట్లు కేటాయిస్తూ వచ్చారు.అయితే వారంలో ఆరు రోజులు ఈ సేవ టిక్కెట్ల ధర కోటి రూపాయలు ఉంటే.. శుక్రవారం మాత్రం కోటిన్నర రూపాయలు. ప్రస్తుతం 347 సేవా టిక్కెట్లు అందుబాటులో ఉన్నట్లు టీటీడీ వర్గాలు చెబుతున్నాయి.
* అందరూ అర్హులే
ఈ టిక్కెట్ ను ఎవరైనా కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంది. సంవత్సరంలో ఏదైనా ఒక తేదీని ఎంచుకొని ఏడుకొండలవాడిని దర్శించుకోవచ్చు. ఆ రోజంతా వెంకన్న సేవలో భాగం కావచ్చు. టికెట్ పొందిన భక్తులు ఆ రోజును బట్టి సుప్రభాతం, తోమాల, అర్చన, అభిషేకం, అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను దర్శించవచ్చు. భక్తుడితోపాటు ఆరుగురు కుటుంబ సభ్యులకు అనుమతిస్తారు. కంపెనీ పేరుతో పొందిన వారికి 20 సంవత్సరాల పాటు ఈ అవకాశాన్ని వాడుకునే వీలుంది. టిటిడి అధికార వెబ్సైట్ కి లాగిన్ ఐ బుక్ చేసుకోవచ్చు. ఆధార్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ ఏదైనా గుర్తింపు కార్డు అప్లోడ్ చేయాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More