Homeఆంధ్రప్రదేశ్‌Tirumala Prank Video: తిరుమలరా బాబూ.. పవిత్రక్షేత్రంలో ఆ వీడియోలేంటి? ఆకతాయిల పరాచకాలపై దుమారం

Tirumala Prank Video: తిరుమలరా బాబూ.. పవిత్రక్షేత్రంలో ఆ వీడియోలేంటి? ఆకతాయిల పరాచకాలపై దుమారం

Tirumala Prank Video: తిరుమల దర్శనాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు భక్తులు. అక్కడ ప్రతిదీ సెంటిమెంట్ గా ఉంటుంది. స్వామి వారి దర్శనం నుంచి అన్న ప్రసాదం వరకు ప్రతిఘట్టం ఒక కీలకంగా భావిస్తారు భక్తులు. ఎన్నెన్నో నిబంధనలు అక్కడ అమలవుతాయి.కలియుగ వైకుంఠంగా కూడా భక్తులు పరిగణిస్తారు.అటువంటి తిరుమల పవిత్రతకు మంటగలిపేలా కొందరు వ్యవహరిస్తున్నారు. తాజాగా యూట్యూబర్ చేసిన అతి విమర్శలకు తావిస్తోంది. ఫ్రాంక్ వీడియోలతో సదరు యూట్యూబర్ కలకలం సృష్టించారు. ఈ ఘటనపై టీటీడీ సీరియస్ అయ్యింది. కఠిన చర్యలకు ఆదేశించింది. నారాయణగిరి షెడ్స్ లోని క్యూలో వెళ్తూ మరో కంపార్ట్మెంట్ తాళాలు తీసే ఉద్యోగిలా కొందరు యూట్యూబర్లు ఒక ఫ్రాంక్ వీడియోను రూపొందించారు. సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో వెంటనే టిటిడి స్పందించింది. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది.

తమిళనాడు రాష్ట్రానికి చెందిన టీపీఎఫ్ వాసన్ తన మిత్రులతో కలిసి స్వామివారి దర్శనానికి వెళుతున్నాడు. నారాయణ గిరి షెడ్ల క్యూలైన్ వద్ద గేటు తాళాలను తెరుస్తున్నట్లుగా నటించాడు. వారిని టీటీడీ సిబ్బంది గా భావించిన షెడ్లలోని భక్తులు ఆశగా నిలబడ్డారు. తీరా చూస్తే వారు ప్రాంక్ వీడియో చేశారని గుర్తించి నిరాశకు గురయ్యారు. ఈ సన్నివేశాన్ని చిత్రీకరించిన ఆకతాయిలు ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశారు. ఈ వీడియో వైరల్ గా మారడంతో పెద్ద దుమారమే రేగింది. కంపార్ట్మెంట్లలో ప్రాంక్ వీడియోల ఘటనపై టీటీడీ స్పందించింది. భక్తుల మనోభావాలతో ముడిపడిన దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు తమిళనాడు వెళ్లాయి.

తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే క్యూలైన్లోకి అనుమతిస్తారు. ఈ క్రమంలో మొబైల్ ఫోన్ క్యూ లైన్ లలో ఎలా వచ్చిందని సందేహాలు తలెత్తాయి. టీటీడీ భద్రతా లోపాలను ఈ ఘటన బయటపెట్టింది. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల క్యూ లైన్ లలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లేందుకు అనుమతి ఉండదు. తమిళనాడుకు చెందిన యూట్యూబర్ సిబ్బంది కళ్ళు కప్పి మొబైల్ ఫోన్ తీసుకెళ్లి ప్రాంక్ వీడియోను చిత్రీకరించడం పై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అక్కడితో ఆగకుండా నిందితుడు దానిని ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయడం వైరల్ గా మారింది. దీనిపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా ఈ ఘటనపై టీటీడీ స్పందించింది. ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. హేయమైన చర్యగా అభివర్ణించింది. ఫ్రాంక్ వీడియోలు చిత్రీకరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. నారాయణగిరి షెడ్స్ దాటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి ప్రవేశించక ముందే భక్తుల నుంచి భద్రతా సిబ్బంది మొబైల్ ఫోన్లు డిపాజిట్ చేసుకుంటారు. ఒకరిద్దరి ఆకతాయి చేష్టలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని టిటిడి ఆందోళన వ్యక్తం చేసింది. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. అయితే ఇటీవల టీటీడీలో ఈవో శ్యామలరావు కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఈ తరుణంలో భద్రత సిబ్బంది వైఫల్యం వెలుగు చూసింది. దీంతో శాఖా పరమైన చర్యలు ఉంటాయని టీటీడీ వర్గాలు సైతం చెబుతున్నాయి.

గతంలో కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.తిరుమల కొండపైకి మూగజీవాలు తీసుకురావడం నిషేధం. కానీ కొందరు భద్రతా సిబ్బంది కళ్ళుగప్పి తమ వెంట పెంపుడు కుక్కలు, జంతువులు తరలించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి సమయంలో టిటిడి భద్రతపై నీలి నీడలు కమ్ముకునేవి. ఇప్పుడు కూడా అటువంటి ఘటన ఎదురు కావడం విశేషం. ఇప్పటికైనా తిరుమలలో భద్రతా చర్యలు పెరగాల్సిన అవసరం ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular