Homeఆంధ్రప్రదేశ్‌Bhogapuram Airport: భోగాపురం ఎయిర్ పోర్ట్ పై చంద్రబాబు సంకల్పం ఇదీ

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్ పోర్ట్ పై చంద్రబాబు సంకల్పం ఇదీ

Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ ఎయిర్ పోర్టు నిర్మాణానికి కొత్త రెక్కలు వస్తున్నాయి. గత ఐదేళ్లుగా ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై తీవ్ర నిర్లక్ష్యం కొనసాగింది. కనీస స్థాయిలో కూడా పనులు ప్రారంభం కాలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామ్యం కావడం, ఆ పార్టీకి చెందిన ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం.. వంటి అంశాలతో ఎయిర్ పోర్టు నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. రెండేళ్లలో విమానాశ్రయాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని సీఎం చంద్రబాబు తాజాగా ప్రకటించారు. ఇదే విషయాన్ని గంటాపధంగా చెబుతున్నారు. దీంతో ఈ ఎయిర్ పోర్టు నిర్మాణ విషయంలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

2014లో రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర క్యాబినెట్లో బిజెపికి, కేంద్ర క్యాబినెట్ లో టిడిపికి చోటు దక్కింది. విభజన హామీల్లో భాగంగా విశాఖలో అంతర్జాతీయ ఎయిర్ పోర్టు నిర్మాణానికి బీజం పడింది. అప్పట్లో టిడిపికి చెందిన అశోక్ గజపతిరాజుకు పౌర విమానయాన శాఖ దక్కింది. ఆయన ఆధ్వర్యంలో భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి అనుమతులు లభించాయి. అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన కూడా చేశారు. కానీతరువాత అధికారంలోకి వచ్చిన జగన్ రెండున్నర సంవత్సరాల్లో ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తి చేస్తానని చెప్పుకొచ్చారు. ఎయిర్ పోర్టు నిర్మాణంలో సక్సెస్ అయిన జిఎంఆర్ సంస్థకు కాంట్రాక్ట్ బాధ్యతలు అప్పగించారు. కానీ పాలన పూర్తయిన జగన్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. గడిచిన ఐదేళ్లలో భోగాపురం విమానాశ్రయంలో 25% పనులు కూడా జరగలేదు. అధికారంలోకి వచ్చిన తొలి నాలుగేళ్లలో దీని ఊసుపట్టని జగన్..ఎన్నికలకు ముందు హడావిడి చేశారు.

నిన్న విశాఖ పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి పనుల స్థితిగతులపై సమీక్షించారు. నిర్ణీత గడువుకు ముందే ఎయిర్పోర్ట్ నిర్మాణం అయ్యేలా చూస్తామని చెప్పారు. 2026 జనవరి నాటికి రన్ వే పై తొలి విమానం రాకపోకలు సాగించేలా చూస్తామని ప్రకటించారు. ప్రస్తుతం మీనాకారంలో 3.8 కిలోమీటర్ల పొడవుతో రెండు రన్ వేలు, టెర్మినల్ టవర్, ఎయిర్ ఫీల్డ్ గ్రౌండ్ లైటింగ్ పనులు త్వరలో ప్రారంభించాలని నిర్ణయించారు. జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు ఇబ్బంది లేకుండా అనుసంధాన రహదారిని కలిపేందుకు 8 ఆకారంలో ట్రంపెట్ నిర్మించనున్నారు. ఇందుకుగాను 25 ఎకరాలు సేకరించారు.

టిడిపి కూటమి ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని ప్రాధాన్యత అంశంగా తీసుకుంది.ఒకవైపు అమరావతి, ఇంకోవైపు పోలవరం,మరోవైపు పరిశ్రమల ఏర్పాటు వంటి అంశాల్లో ముందుకు సాగాలని నిర్ణయం తీసుకుంది.ఎయిర్ పోర్టుల నిర్మాణాన్ని సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.2026 నాటికి కీలక ప్రాజెక్టులకు మోక్షం కలిగించాలని భావిస్తోంది.తద్వారా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని బలమైన ప్రయత్నంలో ఉంది. అయితే ఒక్క ఎయిర్ పోర్ట్ నిర్మాణమే కాదు..చుట్టుపక్కల కీలక ప్రాజెక్టులకు సైతం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా విశాఖ జిల్లాలో కోస్టల్ కారిడార్ కు సర్వే పూర్తయింది. విశాఖ జిల్లా భీమిలి నుంచి భోగాపురం వరకు బీచ్ రోడ్ నిర్మాణం చేపట్టనుంది.మొత్తానికైతే చంద్రబాబు కీలక ప్రాజెక్టుల విషయంలో గట్టి పట్టుదలతో ఉన్నారు. ముఖ్యంగా భోగాపురం ఎయిర్ పోర్ట్ 2026 సంక్రాంతి నాటికి అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. మరి అందులో ఎంతవరకు సఫలీకృతులు అవుతారో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular