Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా.. అది సంచలనంగానే మారుతుంది.ఎన్నికల్లో అంతులేని మెజారిటీతో గెలిచింది కూటమి ప్రభుత్వం.ఆ గెలుపులో కీలక భాగస్వామ్యం అయ్యారు పవన్ కళ్యాణ్.పవన్ పై పెద్ద నమ్మకం పెట్టుకున్న ప్రజలు జనసేనకు సంపూర్ణ విజయం అందించారు. అందుకే వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు పవన్ శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆదర్శ నిర్ణయాలను తీసుకుంటున్నారు. ముఖ్యంగా దుబారా ఖర్చును నియంత్రిస్తున్నారు. తాను దుబారా ఖర్చు తగ్గించుకోవడమే కాకుండా… కూటమి ప్రభుత్వానికి సైతం స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారు. తనకోసం ప్రత్యేక క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. అయితే అందులో ప్రభుత్వం తరఫున ఫర్నిచర్ ఏర్పాటుకు పవన్ అంగీకరించలేదు. తానే సొంతంగా సమకూర్చుకున్నారు. ఇప్పుడు దానినే అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. 2026 మే 31 వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫర్నిచర్ కొనుగోలు పై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ మరో నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం పవన్ బిజీగా ఉన్నారు. డిప్యూటీ సీఎం తో పాటు నాలుగు శాఖల మంత్రిగా ఉన్నారు. నిత్యం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కార మార్గం చూపుతున్నారు. ఒక్క పిఠాపురం నియోజకవర్గ ప్రజలే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఏ సమస్య పైన అయినా ప్రజలు పవన్ ను ఆశ్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. అటు రాజకీయంగాను కీలక శక్తిగా మారారు పవన్. జాతీయ స్థాయిలో సైతం పవన్ పరపతి పెరిగింది. అటు సినీ పరిశ్రమ పెద్దలు తరచూ కలిసి వెళ్తున్నారు. రాజకీయ ప్రముఖుల తాకిడి సైతం అధికంగా ఉంది. అందుకే బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పవన్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇటువంటి తరుణంలో తనకోసం వచ్చిన వారు బొకేలతో రావద్దని పవన్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. వాటితో ఒరిగేదేమీ లేదని.. మీరు తేవాలనుకుంటే పేద ప్రజలకు ఉపయోగపడే కూరగాయలు, ఆహార పదార్థాలు తేవాలని సూచించారు పవన్. వాటితో అన్నా క్యాంటీన్ల నిర్వహణ, అనాధ శరణాలయాల నిర్వహణకు వినియోగించుకోవచ్చని పవన్ అభిప్రాయపడ్డారు.
జనసేన తరఫున ఇద్దరు ఎంపీలుగా గెలిచారు.మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి, కాకినాడ నుంచి తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ గెలిచారు. ఈరోజు వారు పవన్ ను ప్రత్యేకంగా కలుసుకున్నారు. తమ వెంట బొకేలు బదులు కూరగాయల బుట్ట తెచ్చారు. దీనికి ఫిదా అయ్యారు పవన్ కళ్యాణ్. ప్రత్యేకంగా వారిని అభినందించారు. ముందు చూపుతో వ్యవహరించారని.. ఇదే మాదిరిగా అందరూ తేవాలని విజ్ఞప్తి చేశారు. బొకేలతో రావద్దని.. పేద ప్రజలకు ఉపయోగపడే కూరగాయలు, పండ్లు తేవాలని సూచించారు పవన్. త్వరలో అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతున్నాయి. వాటికి సంబంధించి కార్యాచరణను ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. ఆగస్టు 15 నుంచి క్యాంటీన్లు తెరవాలని కసరత్తు చేస్తోంది. టెండర్లు కూడా ఈనెల 22న పూర్తి చేయాలని చూస్తోంది. దీంతో బొకేలు బదులు కూరగాయలు ఇస్తే అన్నా క్యాంటీన్ల కోసం వినియోగిస్తామని.. అనాధ శరణాలయాలకు కూరగాయలను పంపిస్తామని పవన్ చెప్పుకు రావడం విశేషం.
సాధారణంగా ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతల వద్దకు వెళ్లేటప్పుడు పూల బొకేలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. దానిని ఒక గౌరవప్రదంగా కూడా చూస్తారు. అయితే ఇలా బొకేలు తీసుకున్నాక పక్కన పడేస్తారు. ఎందుకూ పనికిరావు కూడా. అందుకే పవన్ కళ్యాణ్ ఈ వినూత్న ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. పార్టీ ఎంపీల నుంచి కూరగాయల బుట్ట తీసుకొని ఆయన ప్రత్యేక పిలుపునివ్వడం విశేషం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇదే ఫార్ములా కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే పవన్ పిలుపు మేరకుచాలా రకాల మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు ఈ బొకేల స్థానంలో కూరగాయలు, ఆహార పదార్థాలు చేరడం ఖాయంగా తేలుతోంది. అయితే పవన్ ఈ తరహా ఆలోచనలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. వారి అభినందనలు అందుకుంటున్నాయి.