Rajyasabha posts : ఏపీలో తొలి దశ నామినేటెడ్ పదవుల ప్రకటన పూర్తయింది. చాలామంది ఆశావహులకు చాన్స్ దక్కలేదు.తరువాత జాబితాలో తమకు తప్పకుండా అవకాశం ఇస్తారని వారు ఎదురుచూస్తున్నారు. ఇందులో చాలామంది సీనియర్లు కూడా ఉన్నారు.మొన్నటి ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా చాలామంది సీనియర్లు త్యాగం చేశారు. సీట్ల సర్దుబాటులో భాగంగా పక్కకు తప్పుకున్నారు.అటువంటి వారంతా పదవుల కోసం ఎదురుచూస్తున్నారు.20 కార్పొరేషన్లకు సంబంధించి నామినేటెడ్ పదవులు ప్రకటించారు చంద్రబాబు. కానీ చాలామంది సీనియర్లకు అందులో చోటు దక్కలేదు.ఇప్పుడు రాజ్యసభ పదవుల ఎంపికపై దృష్టి పెట్టారు. వైసీపీకి చెందిన బీదా మస్తాన్ రావు,మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్యలు రాజ్యసభ పదవులకు రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ తో పాటు మస్తాన్ రావు వైసీపీకి గుడ్ బై చెప్పారు.ఈ ఇద్దరు ఇంకా ఏ పార్టీలో చేరలేదు. కృష్ణయ్య మాత్రం ఊగిసలాట లో ఉన్నారు.జాతీయ బీసీ గణన నేపథ్యంలో ఉద్యమానికి ఆయన శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది.మరోవైపు కృష్ణయ్యను చేర్చుకునేందుకు బిజెపితో పాటు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ ముగ్గురు ఏ పార్టీలో చేరినా తిరిగి రాజ్యసభ పదవులు కేటాయించే అవకాశం లేదు. అందుకే కూటమి పార్టీల నేతలు రాజ్యసభ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు రాజ్యసభ పదవుల ఎంపికపై దృష్టి పెట్టడంతో తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
* జనసేన నుంచి నాగబాబు
ఈ మూడు రాజ్యసభ పదవుల్లో ఒకటి జనసేనకు ఇస్తారని ప్రచారం సాగుతోంది. అదే జరిగితే మెగా బ్రదర్ నాగబాబు కు ఛాన్స్ దక్కడం ఖాయం.ఎందుకంటే జనసేనలో మరో ఆప్షన్ లేదు.ఆది నుంచి నాగబాబు పేరు వినిపించడంతో ఇద్దరు ఎవరు ప్రయత్నించడం లేదు.ఎన్నికల్లో నాగబాబు పోటీ చేయలేదు. అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి సన్నాహాలు చేసినా చివరి నిమిషంలో డ్రాప్ అయ్యారు. పైగా జనసేనతో పాటు కూటమి గెలుపునకు నాగబాబు కృషి చేశారు. ఒకవేళ రాజ్యసభను జనసేనకు కేటాయిస్తే నాగబాబు పేరు ఖరారయ్యే అవకాశం ఉంది.ఆయన విషయంలో ఎటువంటి అభ్యంతరాలు కూడా లేవు.
* గల్లా జయదేవ్ కు అవకాశం
తెలుగుదేశం పార్టీకి సంబంధించి గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ పేరు ఖరారు అయినట్లు ప్రచారం సాగుతోంది. పారిశ్రామిక కుటుంబం నుంచి వచ్చిన ఆయన రెండుసార్లు ఎంపీగా గెలిచారు. వైసిపి హయాంలో ఎన్ని రకాల ఒత్తిళ్లు ఎదురైనా పార్టీలో కొనసాగారు. ఎన్నికలకు ముందు రాజకీయాలకు దూరమయ్యారే తప్ప ఏ పార్టీలో చేరలేదు. అందుకే చంద్రబాబు గల్లా జయదేవ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్లో అనర్గళంగా మాట్లాడడం జయదేవ్ కు కలిసి వచ్చే అంశం.
* సీనియర్ల మధ్య పోటీ
మరోవైపు దేవినేని ఉమా పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఎన్నికల్లో ఆయన టిక్కెట్ త్యాగం చేశారు.మైలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ కు చంద్రబాబు ఛాన్స్ ఇచ్చారు. దీంతో ఉమా పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. అయినా సరే హై కమాండ్ ఆదేశాలను పాటిస్తూ వసంత కృష్ణ ప్రసాద్ గెలుపునకు కృషి చేశారు. అది దేవినేని ఉమా కు కలిసి వచ్చే అంశం. పైగా చంద్రబాబుతో పాటు లోకేష్ కు అత్యంత విధేయుడుగా మెలిగారు. అందుకే చంద్రబాబు రాజ్యసభకు ఉమాను పంపిస్తారని ప్రచారం సాగుతోంది.
మరోవైపు పార్టీలో సీనియర్లుగా ఉన్న అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు సైతం రాజ్యసభ పదవులు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతలు టిడిపి ఆవిర్భావం నుంచి ఉన్నవారే. పైగా చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. ఎన్నికల్లో ఇద్దరు పోటీ చేయలేదు. తమ వారసులను రంగంలోకి దించారు. వయో భారం రీత్యా గౌరవప్రదమైన పదవులు చేపట్టి రాజకీయాల నుంచి నిష్క్రమించాలని భావిస్తున్నారు. అయితే ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామి కావడంతో గవర్నర్ పోస్టులు కేటాయిస్తారని తెలుస్తోంది. అయితే అది ఎప్పుడో తెలియడం లేదు. అందుకే రాజ్యసభ పదవులకు తమ పేర్లు పరిశీలించాలని ఈ ఇద్దరు నేతలు కోరుతున్నట్లు సమాచారం. మొత్తానికైతే టిడిపిలో రాజ్యసభ పదవుల కోసం చాలామంది నేతలు ఎదురుచూస్తున్నారు. ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. మరి చంద్రబాబు మదిలో ఏముందో తెలియాలి.