https://oktelugu.com/

Danam Nagender : రేవంత్ రెడ్డికి షాకిచ్చిన ‘దానం’.. ఇలా చేస్తాడనుకోలేదు

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హైడ్రా కూల్చివేతలపై స్పందించారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లను కూల్చడం సరికాదని అన్నారు. పేదల ఇళ్ల జోలికి పోవద్దని గతంలోనే హైడ్రాకు తాను చెప్పినట్లుగా వెల్లడించారు. మూసీ నిర్వాసితులకు కౌన్సిలింగ్ ఇచ్చి, ప్రత్యామ్నాయం చూపించిన తరువాతనే వారిని ఖాళీ చేయిస్తే బాగుండేదని అన్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : September 29, 2024 / 02:35 PM IST

    Danam Nagender

    Follow us on

    Danam Nagender :  మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు వేరు. ఇప్పుడు మరొలా మారాయి. మొన్నటివరకు హైడ్రాను స్వాగతించిన వారంతా ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. పెద్దలను వదిలి పేదల జోలికి వస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అటు బాధితులు సైతం లబోదిబోమంటున్నారు. వారికి ప్రతిపక్షాలు కూడా తోడయ్యాయి. ప్రభుత్వ చర్యలను విమర్శిస్తున్నాయి. రాష్ట్రంలో బుల్డోజర్ల రాజ్యం నడుస్తోందంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టి ఏడాదైనా కాకముందే హైడ్రా అంశంలో ఇప్పుడు అపవాదులు ఎదుర్కొంటున్నారు.

    హైడ్రా వ్యవస్థపై ముందు నుంచీ బీఆర్ఎస్, బీజేపీలు విమర్శిస్తూ వస్తున్నాయి. ఇరు పార్టీల నేతలు ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నారు. పేదల జోలికొస్తే ఊరుకోబోమంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నా హైడ్రా మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా.. మూసీ బాధితుల అంశం నగరంలో భారీ ఎత్తున వివాదానికి దారితీసింది. మూసీ ప్రక్షాళనలో భాగంగా అక్కడి పరిసర ప్రాంతాలను ఖాళీ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో వారికి 15వేల డబుల్ బెడ్‌రూమ్‌లను కేటాయించింది. తమ నివాసాలను ఖాళీ చేసి డబుల్ బెడ్ రూమ్‌లకు షిఫ్ట్ కావాలని సూచించింది. అలాగే.. స్థలానికి సంబంధించి కూడా పరిహారం ఇస్తామని చెప్పింది. భూచట్టం ప్రకారం పరిహారం అందిస్తామంది.

    కానీ.. కొంత మంది బాధితులు ఒప్పుకొని ఖాళీ చేసి వెళ్తుండగా.. ఇంకా చాలా మంది మాత్రం వెళ్లిపోయేందుకు నిరాకరిస్తున్నారు. దశాబ్దాలుగా ఉంటున్న తమకు అన్యాయం చేయొద్దని వేడుకుంటున్నారు. మరోముందడుగు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. నిన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు కూడా వెళ్లారు. అక్కడ మాజీ మంత్రి హరీశ్ రావును కలిశారు. తమ గోడును వెళ్లబోసుకున్నారు. దాంతో హరీశ్ కూడా వారికి భరోసా ఇచ్చారు. అయితే.. ఇప్పటివరకు ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా విషయంలో ప్రతిపక్షాల నుంచి వ్యతిరేక వాయిస్ వినిపించింది. మొదటిసారి అధికార పార్టీ ఎమ్మెల్యే నుంచే హైడ్రాపై వ్యతిరేకంగా వాయిస్ వినిపించడం ఇప్పుడు కలకలం రేపింది. అధికార పార్టీలోనూ హైడ్రాపై ధిక్కార స్వరం వినిపించడంతో.. హైడ్రా భవిష్యత్ ఏంటనేది అందరినీ ఆలోచనలో పడేసింది.

    ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హైడ్రా కూల్చివేతలపై స్పందించారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లను కూల్చడం సరికాదని అన్నారు. పేదల ఇళ్ల జోలికి పోవద్దని గతంలోనే హైడ్రాకు తాను చెప్పినట్లుగా వెల్లడించారు. మూసీ నిర్వాసితులకు కౌన్సిలింగ్ ఇచ్చి, ప్రత్యామ్నాయం చూపించిన తరువాతనే వారిని ఖాళీ చేయిస్తే బాగుండేదని అన్నారు. వారికి గూడుతోపాటు ఉపాధి చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. ఇళ్లకు రెడ్ మార్క్ వేయడం తొందర పాటు చర్యే అని అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. కూల్చాలనుకుంటే ఎఫ్టీఎల్ పరిధిలోని ఐమాక్స్, జలవిహార్‌లను కూల్చాలంటూ సూచించారు. అంతేకానీ.. స్లమ్‌లలో ఉండే పేదలను ఇబ్బందులు పెట్టొద్దంటూ వ్యాఖ్యలు చేశారు. దానం వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి. అధికార పార్టీలో ఉండి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్లుగా మాట్లాడడం ఏంటని అందరూ చర్చించుకుంటున్నారు. మరి.. దానం వ్యాఖ్యలపై పార్టీ పెద్దలు కానీ ముఖ్యమంత్రి రేవంత్ కానీ ఎలా స్పందిస్తారో చూడాలి.