32 YCP Sitting MLAs : వైసీపీలో 32 మంది ఎమ్మెల్యేల మార్పు తధ్యమా? ఐ ప్యాక్ టీమ్ స్పష్టమైన హెచ్చరికలు పంపిందా? వారందర్నీ పక్కన పడేయ్యనున్నారా? పనితీరు నెపంగా చూపి ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తెరపైకి తేనున్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. ఈ నెల 21న సీఎం జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో వర్క్ షాపు నిర్వహించారు. చివరిసారిగా ఏప్రిల్ 2న సమీక్షించారు. సరిగ్గా 80 రోజుల తరువాత ఎమ్మెల్యేలు, మంత్రులతో జరగనున్న భేటీ హీట్ పెంచుతోంది. తప్పుకోండి అని ముఖం మీద చెబుతారో? లేకుంటే మరో చాన్స్ ఇస్తారో? అన్న చర్చ వైసీపీ వర్గాల్లో నడుస్తోంది.
అధికార పార్టీలో చాలామంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని పార్టీ హైకమాండ్ కు సమాచారం ఉంది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయతలో నాయకత్వం ఉంది. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారు. మరికొందరు అసంతృప్తి వ్యాఖ్యలతో కాక రేపుతున్నారు. ఇటువంటి సమయంలో వెనుకబడ్డారని జాబితా చదివితే అసలుకే ఎసరు వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వెనుకబడిన వారిలో 32 మంది ఉన్నారు. అందులో సీనియర్లు, మంత్రులు సైతం ఉన్నట్టు తెలుస్తోంది. వారి పేర్లు బయటపెడితే పరిణామాలు ఎటుదారితీస్తాయోనన్న ఆందోళన పార్టీలో వ్యక్తమవుతోంది.
ప్రజల నుంచి నిలదీతలు వ్యక్తమవుతుండడంతో చాలా మంది గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. మరికొందరు వచ్చే ఎన్నికల్లో పోటీచేసేందుకు అయిష్టతతో ఉన్నారు. అటువంటి వారు పెద్దగా ఆసక్తి చూపలేదు. అలాగని పార్టీ వారిని వదులుకోవాలని చూడడం లేదు. ఈ తరుణంలో వర్క్ షాపులో అటువంటి వారిని అధినేత ఎలా డీల్ చేస్తారోనన్న చర్చ ప్రారంభమైంది. మరోవైపు చాలామంది తాము తప్పుకొని వారసులకు లైన్ క్లియర్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే అధినేతకు మొర పెట్టుకున్నారు. కానీ ఆయన్నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఈ వర్కుషాపులోనైనా తమకు తీపి కబురు చెబుతారని సీనియర్లు వెయిట్ చేస్తున్నారు.
నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకూ పార్టీలో కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. రాయలసీమలో పార్టీకి పట్టు తప్పుతోంది. ఇటువంటి తరుణంలో బెత్తం పట్టుకొని సరిచేయకుంటే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. సీనియర్లు, జూనియర్లకు గ్యాప్ ఉంది. తాజా మంత్రులు, మాజీ మంత్రుల మధ్య ఆధిపత్య ధోరణి నడుస్తోంది. గతంలో తమ వర్గాన్ని అణచివేశారన్న నెపంతో.. ఇప్పుడు మాజీ మంత్రి వర్గాన్ని అణగదొక్కుతున్నారు. దీంతో పార్టీలో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. చాలాచోట్ల ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నాయంగా ఎమ్మెల్సీలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది కూడా గ్యాపునకు కారణమవుతోంది. వీటన్నింటికీ 21న జరిగే వర్కుషాపుతో పరిష్కారం దొరుకుతుందని వైసీపీ వర్గాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి.