YCP – Mohan Babu : తిరుపతి సమీపంలోని శ్రీవిద్యానికేతన్ ను మోహన్ బాబు యూనివర్సిటీగా మార్చారు. చిన్నపాటి విద్యాసంస్థగా ప్రారంభమైన విద్యానికేతన్ ప్రస్థానం యూనివర్సిటీగా అభివృద్ధి చెందింది. ఇది సంతోషించదగ్గ విషయమే అయినా.. ఇలా రూపాంతరం చెందే క్రమంలో మోహన్ బాబుపై భూ ఆక్రమణల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. తాజాగా రూ.8 కోట్ల విలువైన ఆస్తిపై ఎంబీయూ వర్గాలు కన్నేశారని పరిసర గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఆ గ్రామ పెద్దలపై మోహన్ బాబు మనుషులు హత్య ప్రయత్నానికి దిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎంబీయూ డంపింగ్ యార్డు కోసం యూనివర్సిటీ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. రంగంపేట పంచాయతీలోని నాగపట్నం సర్వే నంబర్ 10.2లో 35 సెంట్ల స్థలంపై వారి కన్నుపడింది. దీని కోసం పంచాయతీకి దరఖాస్తు చేసుకున్నారు. కానీ గ్రామస్థులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. అక్కడ డంపింగ్ యార్డు వద్దని తీర్మానించుకున్నారు. అక్కడ నుంచి వివాదం నడుస్తోంది. ప్రస్తుతం అదే ప్రదేశంలో పనులు జరుగుతుండడంతో స్థానిక ఎంపీటీసీ సభ్యుడు బోసు చంద్రారెడ్డి, ఉప సర్పంచ్ మోనీస్ లు సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించారు. ఆ స్థలం ఎవరికైనా సేకరించారా? అంటూ వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు. ఇది ఎంబీయూ వర్గాల వారికి ఆహ్వానం తెప్పించింది.
ఎంబీయూ కు చెందిన ఆరుగురు వ్యక్తులు శనివారం రాత్రి గ్రామంలో హల్ చల్ సృష్టించారు. కర్రలు, కత్తులతో గ్రామంలో కలియతిరిగారు. మాస్కుపెట్టుకున్న ఓ వ్యక్తి కత్తి చేత పట్టుకొని ఎంపీటీసీ చంద్రారెడ్డి ఇంటి వద్ద బెదిరింపులకు దిగాడు. దీంతో స్థానికులు అతడ్ని పట్టుకొని దేహశుద్ధి చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబుతో ఎంబీయూ పీఆర్వో సతీష్, సునీల్ చక్రవర్తి వల్ల తమకు ప్రాణహాని ఉందంటూ ఎంపీటీసీ, ఉప సర్పంచ్ లు ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులు వైసీపీకి చెందిన వారే కావడం గమనార్హం. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరీ.