YCP Vs Pawankalyan : పవన్.. ఈ పేరు వింటేనే వైసీపీ నేతలకు చిరాకు పుడుతోంది. ఒక నాయకుడిగా కాదు.. వ్యక్తిగా కూడా వారు అంగీకరించడం లేదు. ఆయన మాటలను సహించడం లేదు. ఆయన చర్యలను తప్పుపట్టడమే కాదు.. ప్రజలకు తప్పుడు మనిషిగా చూపేందుకు తెగ ఆరాటపడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత ఉన్నా ఇప్పుడు పవనే వారికి బద్ధ శత్రువు. తమ అధికారానికి గండికొడుతున్నారన్న భయం. తమ వ్యూహాలకు అడ్డంకిగా నిలుస్తున్నారన్న బాధ వెరసి.. పవన్ ను శత్రువుగా చూస్తున్నారు. పవన్ పై ప్రత్యేకంగా స్టాండ్ ను తీసుకున్నారు. దాని ప్రకారం పవన్ పై ఒక రకమైన ముద్ర వేసి ప్రజల్లో బలహీనం చేయాలన్న ప్రయత్నంలో ఉన్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఒక్కటిగా వెళ్లకూడదన్నది వైసీపీ అభిమతం. కానీ పవన్ టీడీపీ, జనసేనలతో పాటు బీజేపీని కలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది జగన్ అండ్ కో మింగుడు పడడం లేదు. ఎలాగైనా కూటమిని అడ్డుకోవాలి. అడ్డంకులు సృష్టించాలి. దత్తపుత్రుడు అన్న ప్రచారం మరింత విస్తృతం చేయాలి. చంద్రబాబు చదువుతున్న స్క్రిప్ట్ తోనే పవన్ మాట్లాడుతున్నారు. చంద్రబాబును కలిసి బేరం పెట్టారు. సీట్ల సర్దుబాటు పూర్తిచేసుకున్నారు. పరిమిత నియోజకవర్గాల్లోనే పోటీకి ఒప్పుకున్నారు. దోచుకుందాం.. పంచుకుందాం..తినుకుందాం.. అన్న నినాదంతోనే ఆ మూడు పార్టీలు కలవనున్నాయి. అన్న విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.
వారాహి యాత్రలో పవన్ మాటలను వక్రీకరించే పనిలో వైసీపీ బ్యాచ్ ఉంది. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టునే పవన్ చదువుతున్నారని ఆరోపణలు చేస్తోంది. తనకు సీఎంగా అవకాశమివ్వాలని కోరింది అందులో భాగమేనని చెప్పుకొస్తోంది. ఎక్కడ కాపులు దూరమవుతారోనన్న అనుమానంతోనే కొత్తగా పవన్ తో ఈ స్లోగన్ చంద్రబాబే పంపించారని చెబుతోంది. ప్రధానంగా ఈనాడు, ఆంధ్రజ్యోతితో పాటు టీడీపీ అనుకూల మీడియాలో పవన్ వ్యక్తిగత ఇంటర్వ్యూలు పతాక శీర్షికన రావడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది. గతంలో పవన్ విషయంలో ఎల్లో మీడియా వ్యవహరించిన తీరును గుర్తుచేస్తోంది. అటు పవన్ సైతం ఎల్లో మీడియాపై చేసిన విమర్శలు, వ్యాఖ్యానాలను వైసీపీ తన సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం ప్రారంభించింది. గత ఎన్నికల్లో రెండుచోట్ల పోటీచేసి ఓడిపోయిన ఓ పార్టీ అధినేతకు ఎల్లో మీడియా ప్రాధాన్యం ఇవ్వడం వెనుక ఉన్న మతలబు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికీ చంద్రబాబు ప్లాన్ గా చెప్పుకొస్తున్నారు.
పవన్ హత్య కూడా కాపుల్లో ఒకరకమైన సింపతికేనని వైసీపీ అనుమానిస్తోంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వంపై పవన్ ఇదే తరహా ఆరోపణలు చేయడాన్ని గుర్తుచేస్తోంది. జగన్ సర్కారుపై పవన్ చేసిన హత్య ఆరోపణలపై ఆధారాలు చూపించాలని డిమాండ్ చేస్తోంది. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. సంక్షేమ పథకాలతో ప్రజల్లో బలంగా ఉన్న జగన్ ను పలుచన చేసేందుకు ఇసుక, మద్యం అవినీతి ఆరోపణలు చేస్తున్నారని అనుమానిస్తోంది. జగన్ క్లాస్ వార్ పై మాట్లాడుతున్న పవన్ కు నారా జమిందారే చారు మజుందార్, పుచ్చిన బుర్ర చంద్రయ్యే పుచ్చలపల్లి సుందరయ్య అంటూ ఎద్దేవా చేస్తోంది. చంద్రబాబు ఫిలాసఫీయే పవన్ ఖులాసఫీగా చెబుతోంది. ఈ మొత్తం అన్నిరకాల లైన్లను తీసుకొని ప్రచారం చేయాలని వైసీపీ శ్రేణులు, సోషల్ మీడియా విభాగాలకు హైకమాండ్ నుంచి ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. దీనిపై జన సైనికులు రియాక్టవుతున్నారు. గట్టిగానే ఎదుర్కొంటామని చెబుతున్నారు.